[1] యెహోవాను స్తుతించుట మంచిది. సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.
[2] ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం, రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.
[3] దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది. సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.
[4] యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు. నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.
[5] యెహోవా, నీవు గొప్ప కార్యాలు చేశావు. నీ తలంపులు మేము గ్రహించటం మాకు ఎంతో కష్టతరం.
[6] నీతో పోల్చినట్లయితే మనుష్యులు బుద్ధిలేని జంతువుల్లాంటి వారు. మేము ఏదీ గ్రహించలేని బుద్ధిలేని వాళ్లలా ఉన్నాము.
[7] దుర్మార్గులు గడ్డిలా మొలిచినా, చెడ్డవాళ్లు అభివృద్ధి చెందినా వారు శాశ్వతంగా నాశనం అవుతారు.
[8] కాని యెహోవా, నీవు శాశ్వతంగా గౌరవించ బడతావు.
[9] యెహోవా, నీ శత్రువులు అందరూ నాశనం చేయబడతారు. చెడు కార్యాలు చేసే ప్రజలందరూ నాశనం చేయబడుతారు.
[10] కాని నీవు నన్ను బలపరుస్తావు. బలమైన కొమ్ములుగల పొట్టేలువలె నీవు నన్ను చేస్తావు. సేదదీర్చే నీ తైలాన్ని నీవు నా మీద పోశావు.
[11] నా శత్రువుల పతనాన్ని నా కండ్లారా చూచాను. నా శత్రువుల నాశనాన్ని నా చెవులారా విన్నాను.
[12] నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు. వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.
[13] మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాట బడిన మొక్కలవలె బలంగా ఉంటారు. వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.
[14] వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు. వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.
[15] యెహోవా మంచివాడని నేను చెబతున్నాను. ఆయనే నా బండ. ఆయనలో అవినీతి లేదు.