Skip to content
Opens in a new window

[1] దేవా, లేచి నీ శత్రువులను చెదరగొట్టుము. ఆయన శత్రువులు అందరూ ఆయన దగ్గర్నుండి పారిపోయెదరుగాక!

[2] గాలికి ఎగిరిపోయే పొగలా నీ శత్రువులు చెదరిపోవుదురుగాక. అగ్నిలో మైనం కరిగిపోయేలా నీ శత్రువులు నాశనం చేయబడుదురుగాక.

[3] కాని మంచి మనుష్యులు సంతోషంగా ఉన్నారు. మంచి మనుష్యులు దేవునితో కలసి సంతోషంగా గడుపుతున్నారు. మంచి మనుష్యులు ఆనందం అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు.

[4] దేవుని స్తుతించండి. ఆయన నామమునకు స్తుతులు పాడండి. ఆయనకు మార్గం సిద్ధపరచండి. ఆరణ్యంలో ఆయన తన రథం మీద వెళ్తాడు. ఆయన పేరు యాహ్. ఆయన నామాన్ని స్తుతించండి.

[5] ఆయన పవిత్ర ఆలయంలో దేవుడు అనాధలకు తండ్రిలా ఉన్నాడు. దేవుడు విధవరాండ్రను గూర్చి జాగ్రత్త పుచ్చుకొంటాడు.

[6] ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు. దేవుడు తన ప్రజలను కారాగారం నుండి విడిపిస్తాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. కాని దేవునికి విరోధంగా తిరిగే మనుష్యులు దహించు సూర్య వేడిమిగల దేశంలో నివసిస్తారు.

[7] దేవా, నీ ప్రజలను నీవు ఈజిప్టు నుండి బయటకు రప్పించావు. ఎడారిగుండా నీవు నడిచావు.

[8] భూమి కంపించింది. దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, సీనాయి కొండ మీదికి వచ్చాడు. మరియు ఆకాశం కరిగిపోయింది.

[9] దేవా, నీవు వర్షం కురిపించావు మరియు నిస్సారమైన పాత భూమిని నీవు మరల బలపరిచావు.

[10] నీ పశువులు ఆ దేశానికి తిరిగి వచ్చాయి. దేవా, అక్కడ పేద ప్రజలకు నీవు ఎన్నో మంచి వాటిని యిచ్చావు.

[11] దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నా శుభవార్త చెప్పడానికి అనేక మంది ప్రజలు వెళ్లారు.

[12] “శక్తిగల రాజుల సైన్యాలు పారిపోతున్నాయి. యుద్ధం నుండి సైనికులు తెచ్చే వస్తువులు ఇంటి వద్ద స్త్రీలు పంచుకొంటారు.

[13] ఇంటి దగ్గర ఉండిపోయిన మనుష్యులు ఆ ఐశ్వర్యాలను సంచుకొంటారు. వారు పావురపు రెక్కలకు వెండిపూత పూస్తారు. ఆ రెక్కలను వారు బంగారు పూతతో తళ తళ మెరిపిస్తారు.”

[14] సల్మోను కొండ మీద శత్రురాజులను దేవుడు చెదరగొట్టాడు. వారు పడిపోతున్న మంచులా ఉన్నారు.

[15] బాషాను పర్వతం చాలా గొప్ప పర్వతం, బాషాను పర్వతానికి ఎన్నో శిఖరాలు ఉన్నాయి.

[16] బాషాను పర్వతమా, నీవేల సీయోను కొండను చిన్న చూపు చూస్తున్నావు? దేవుడు ఆ కొండను ప్రేమిస్తున్నాడు. యెహోవా తాను శాశ్వతంగా అక్కడ నివసించాలని నిర్ణయించుకొన్నాడు.

[17] యెహోవా పరిశుద్ధమైన సీయోను కొండకు వస్తున్నాడు. ఆయన వెనుక ఆయన రథాలు లక్షలాదిగా ఉన్నాయి.

[18] ఆయన ఎత్తయిన చోట్లకు వెళ్లాడు. ఆయన తన బందీల బృందాలను నడిపించాడు. ఆయన మనుష్యులనుండి అనగా ఆయనను వ్యతిరేకించిన ప్రజలనుండి కూడ కానుకలు తీసుకొన్నాడు

[19] యెహోవాను స్తుతించండి. మనం మోయాల్సిన బరువులు మోయటంలో ప్రతిరోజూ ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని రక్షిస్తాడు.

[20] ఆయనే మన దేవుడు. ఆయనే మనలను రక్షించే దేవుడు. మన యోహోవా దేవుడు మనల్ని మరణంనుండి రక్షిస్తాడు.

[21] దేవుడు తన శత్రువులను ఓడించినట్టు చూపిస్తాడు. దేవుడు తనకు విరోధంగా పోరాడిన వారిని శిక్షిస్తాడు.

[22] నా ప్రభువు ఇలా చెప్పాడు: “శత్రువును తిరిగి బాషాను నుండి నేను రప్పిస్తాను. సముద్రపు లోతుల నుండి శత్రువును నేను రప్పిస్తాను.

[23] కనుక నీవు వారి రక్తంలో నడువవచ్చు కనుక మీ కుక్కలు వారి రక్తం నాకవచ్చు.”

[24] విజయ ఊరేగింపును దేవుడు నడిపించటం ప్రజలు చూస్తారు. నా పరిశుద్ధ దేవుడు, నా రాజు విజయంతో ఊరేగింపు నడిపించటం ప్రజలు చూస్తారు.

[25] గాయకులు ముందు నడుస్తారు. వారి వెనుక వాయిద్య బృందం నడుస్తారు. మధ్యలో ఆడపడుచులు తంబరలు వాయిస్తారు.

[26] మహా సమాజంలో దేవుని స్తుతించండి. ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను స్తుతించండి.

[27] చిన్న బెన్యామీను వారిని నడిపిస్తున్నాడు. యూదా మహా వంశం అక్కడ ఉంది. జెబూలూను, నఫ్తాలి నాయకులు అక్కడ ఉన్నారు.

[28] దేవా, నీ శక్తి మాకు చూపించుము, దేవా, గత కాలంలో మాకోసం నీవు ఉపయోగించిన నీ శక్తి మాకు చూపించుము.

[29] రాజులు వారి ఐశ్వర్యాలను నీ వద్దకు, యెరూషలేములోని మందిరానికి తీసుకొని వస్తారు.

[30] ఆ “జంతువులు” నీవు చెప్పినట్లు చేసేలా నీ దండాన్ని ఉపయోగించుము. ఆ దేశాలలోని “ఎద్దులు, ఆవులు” నీకు లోబడేలా చేయుము ఆ రాజ్యాలను యుద్ధంలో నీవు ఓడించావు. ఇప్పుడు వారు నీ వద్దకు వెండి తీసుకొని వచ్చు నట్లు చేయుము.

[31] వారు ఈజిప్టు నుండి ఐశ్వర్యం తీసుకొని వచ్చేలా చేయుము. దేవా, ఇథియోపియా (కూషు) వారు వారి ఐశ్వర్యాన్ని నీ వద్దకు తెచ్చేలా చేయుము.

[32] భూ రాజులారా దేవునికి పాడండి. మన యెహోవాకు స్తుతి కీర్తనలు పాడండి.

[33] దేవునికి పాడండి. ప్రాచీన ఆకాశాలలో ఆయన తన రథాల మీద పయనిస్తున్నాడు. ఆయన శక్తిగల స్వరాన్ని ఆలకించండి.

[34] మీ దేవుళ్లు అందరి కంటె యెహోవా ఎక్కువ శక్తిగలవాడు. ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలను బలపరుస్తాడు.

[35] దేవుడు తన ఆలయంలో ఆశ్చర్యకరుడు. ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలకు శక్తి, బలాన్ని ఇస్తాడు. దేవుని స్తుతించండి.

కీర్తనల గ్రంథము — Chapters