[1] “నేను దేవునికి భయపడను, గౌరవించను” అని దుర్మార్గుడు తనలో తాను చెప్పుకొన్నప్పుడు అతడు చాలా చెడ్డ పని చేస్తున్నాడు.
[2] ఆ మనిషి తనకు తానే అబద్ధం చెప్పుకొంటున్నాడు. ఆ మనిషి తన సొంత తప్పులను చూడడు. కనుక అతడు క్షమాపణ వేడుకోడు.
[3] అతని మాటలు కేవలం పనికిమాలిన ఆబద్ధాలే. అతడు తెలివిగలవాడు కాజాలడు, మేలు చేయడం నేర్చుకోలేడు.
[4] రాత్రిపూట, అతడు పనికిమాలిన సంగతులు తలుస్తూంటాడు. అతడు మేల్కొన్నప్పుడు, ఏ మేలూ చేయడు. ఏ చెడు కార్యాం చేయటానికైనా అతడు నిరాకరించడు.
[5] యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది. నీ నమ్మకత్వం మేఘోలకంటె ఉన్నతం.
[6] యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.” నీ న్యాయం లోతైన మహాసముద్రం కంటే లోతైనది. యెహోవా, నీవు మానవుని, జంతువులను కాపాడుతావు.
[7] ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు. కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.
[8] యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు. అధ్బుతమైన నీ నదిలోనుండి నీవు వారిని తాగనిస్తావు.
[9] యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది. నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది.
[10] యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగిన వారిని ప్రేమించటం కొనసాగించుము. నీకు నమ్మకంగావుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము.
[11] యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము. దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము.
[12] వారి సమాధుల మీద ఈ మాటలు చెక్కుము. “ఇక్కడే దుర్మార్గులు పడిపోయారు. వారు చితుకగొట్టబడ్డారు. వారు మళ్లీ ఎన్నటికీ లేచి నిలబడరు.”