Skip to content
Opens in a new window

[1] దేవా నా ప్రార్థన వినుము. దయచేసి నాకు విముఖుడవు కావద్దు.

[2] దేవా దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము. నా ఇబ్బందులు నీతో చెప్పుకోనిమ్ము.

[3] నా శత్రువులు నాకు విరోధముగా చెప్పిన దాన్ని బట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను. నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు. వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు.

[4] నాలో నా గుండె ఆదురుతోంది. నాకు చచ్చి పోయేటంత భయంగా ఉంది.

[5] నాకు భయము మరియు వణకుగా ఉంది. నేను భయపడిపోయాను.

[6] ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది. నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా.

[7] నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును.

[8] నేను పరుగెత్తి పోదును. నేను తప్పించుకొని పారిపోదును. ఈ కష్టాల తుఫాను నుండి నేను పారిపోదును.

[9] నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము. ఈ పట్టణంలో చాలా బలాత్కారం పోట్లాటలను నేను చూస్తున్నాను.

[10] పట్టణం చుట్టూ దాని గోడల మీద రాత్రింబగళ్లు బలాత్కారము, యుద్ధము నడుస్తున్నాయి. ఈ పట్టణంలో దారుణమైన సంగతులు జరుగుతున్నాయి.

[11] వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది. ఎక్కడ చూచినా మనుష్యులు అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.

[12] ఒకవేళ శత్రువు నన్ను అవమానించటమే అయితే దానిని నేను భరించగలను. ఒకవేళ నా శత్రువులు నాపై దాడిచేస్తే నేను దాక్కోగలను.

[13] కానీ, అది నీవే అవటంవల్ల నేను భయపడను. ఎందుకంటే నీవు, నాకు తగినవాడవు, నా సహవాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు కలిగిస్తున్నావు.

[14] మనం కలిసి మధుర సంభాషణ చేసే వాళ్లము. దేవుని ఆలయంలో మనము కలిసి సహవాసంలో నడిచాము.

[15] నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను. వారు సజీవంగానే సమాధి చేయబడ్తారని ఆశిస్తాను. ఎందుచేతనంటే వారు తమ ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు వేస్తారు.

[16] నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను. యెహోవా నాకు జవాబు ఇస్తాడు.

[17] సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోపణలు దేవునికి నేను చెబతాను. ఆయన నా మాట వింటాడు.

[18] నేను చాలా యుద్ధాలు చేశాను. కానీ దేవుడు నన్ను రక్షిస్తాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన నన్ను తిరిగి తీసుకొని వస్తాడు.

[19] దేవుడు అనాటి కాలంనుండి సింహాసనాసీనుడు. నా మొర వింటాడు. ఆయన నా శత్రువులను ఓడిస్తాడు. నా శత్రువులు వారి బతుకులు మార్చుకోరు. వారు దేవునికి భయపడరు, గౌరవించరు.

[20] నా స్నేహితుడు తన స్నేహితుల మీద దాడి చేసాడు. అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు.

[21] అతడు వెన్నవలె మెత్తగా మాట్లాడుతాడు. కాని నిజానికి వాడు యుద్ధం తలపెడతాడు. వాని మాటలు నూనె అంత నునుపుగా ఉంటాయి కాని ఆ మాటలు కత్తిలా కోస్తాయి.

[22] నీ చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించు ఆయన నీ విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు. మంచి మనష్యులను ఎన్నడూ ఓడిపోనివ్వడు.

[23] కాని దేవా! దుష్టులను దుర్నీతి అనే గుంటలోనికి అణచివేస్తావు. రక్తం చిందించే మనుష్యులు, విశ్వాసఘాతకులు అర్థకాలమైనా జీవించరు. కానీ నేనైతే నీయందే విశ్వ సిస్తాను.

కీర్తనల గ్రంథము — Chapters