[1] దేవా నీ నమ్మకమైన ప్రేమ మూలంగా నా మీద దయ చూపించుము. నీ మహా దయ మూలంగా నా పాపాలన్నీ తుడిచివేయుము.
[2] దేవా, నా దోషం అంతా తీసివేయుము. నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
[3] నేను పాపం చేశానని నాకు తెలుసు. నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
[4] తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను. దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను. కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే. నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
[5] నేను పాపంలో పుట్టాను. పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
[6] దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు. అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
[7] హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము. నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
[8] నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము. నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
[9] నా పాపాలను చూడకుము! వాటన్నింటినీ తుడిచి వేయుము.
[10] దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
[11] నన్ను తోసివేయకుము! నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
[12] నీచేత రక్షించబడుట మూలంగా కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము! నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
[13] నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను. వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు.
[14] దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము. నా దేవా, నీవే నా రక్షకుడవు. నీవు ఎంత మంచివాడవోనని నన్ను పాడనిమ్ము.
[15] నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము.
[16] నీవు బలులు కోరటం లేదు. లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు.
[17] దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.
[18] దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము. యెరూషలేము గోడలను కట్టుము.
[19] అప్పుడు నీవు సరియైన బలులను, సంపూర్ణ దహనబలులను అనుభవిస్తావు. మరియు ప్రజలు మరల నీ బలిపీఠం మీద ఎద్దులను అర్పిస్తారు.