[1] యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు నాకు ఎంతో సంతోషం.
[2] సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం.
[3] నేను దాదాపు చనిపోయాను. మరణ పాశాలు నన్ను చుట్టుకొన్నాయి. సమాధి నా చుట్టూరా మూసికొంటుంది. నేను భయపడి చింతపడ్డాను.
[4] అప్పుడు నేను యెహోవా నామం స్మరించి, “యెహోవా, నన్ను రక్షించుము.” అని అన్నాను.
[5] యెహోవా మంచి వాడు, జాలిగల వాడు. యెహోవా దయగలవాడు.
[6] నిస్సహాయ ప్రజలను గూర్చి యెహోవా శ్రద్ధతీసుకొంటాడు. నేను సహాయం లేకుండా ఉన్నాను, యెహోవా నన్ను రక్షించాడు.
[7] నా ఆత్మా, విశ్రమించు! యెహోవా నిన్ను గూర్చి శ్రద్ధ తీసుకొంటాడు.
[8] దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు. నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు. నేను పడిపోకుండా నీవు నన్ను పట్టికొన్నావు.
[9] సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.
[10] “నేను నాశనమయ్యాను!” అని నేను చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొనే ఉన్నాను.
[11] నేను భయపడి “మనుష్యులంతా అబద్ధీకులే” అని చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొంటూనే ఉన్నాను.
[12] యెహోవాకు నేను ఏమివ్వగలను? నాకు ఉన్నదంతా యెహోవాయే నాకిచ్చాడు.
[13] నన్ను రక్షించినందుకు నేను ఆయనకు పానార్పణం యిస్తాను. యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
[14] నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను. ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి యెదుటికి వెళ్తాను.
[15] యెహోవా అనుచరులలో ఎవరి మరణమైనా ఆయనకు ఎంతో దుఃఖకరము. యెహోవా, నేను నీ సేవకుల్లో ఒకడ్ని.
[16] నేను నీ సేవకుడను. నీ సేవకులలో ఒకరి కుమారుడ్ని నేను. యెహోవా, నీవే నా మొదటి గురువు.
[17] నేను నీకు కృతజ్ఞత అర్పణ యిస్తాను. యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
[18] నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను. ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి ఎదుటికి వెళ్తాను.
[19] యెరూషలేములో ఆయన ఆలయానికి నేను వెళ్తాను. యెహోవాను స్తుతించండి!