[1] నా ప్రజలారా నా ఉపదేశాలను వినండి. నేను చెప్పే విషయాలు వినండి.
[2] ఈ కథ మీతో చెబతాను. ఈ పురాతన కథ నేను మీతో చెబతాను.
[3] ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు. మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు.
[4] ఈ కథను మనము మరచిపోము. మన ప్రజలు చివరి తరం వారి వరకు ఈ కథ చెబతారు. మనమంతా యెహోవాను స్తుతిద్దాము. ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి చెబదాము.
[5] యాకోబుతో యెహోవా ఒక ఒడంబడికను చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మ శాస్త్రాన్ని ఇచ్చాడు. మన పూర్వీకులకు దేవుడు ఆదేశాలు ఇచ్చాడు. మన పూర్వీకులు తమ సంతతివారికి న్యాయచట్టం బోధించాలని ఆయన వారితో చెప్పాడు.
[6] ఈ విధంగా ప్రజలు, చివరి తరంవారు సహా ధర్మ శాస్త్రాన్ని తెలుసుకొంటారు. కొత్త తరాలు పుడుతాయి వారు పెద్దవారిగా ఎదుగుతారు. వారు వారి పిల్లలకు ఈ కథ చెబతారు.
[7] కనుక ఆ ప్రజలంతా దేవుని నమ్ముతారు. దేవుడు చేసిన పనులను వారు మరచిపోరు. వారు ఆయన ఆదేశాలకు జాగ్రత్తగా విధేయులవుతారు.
[8] ఒక వేళ ప్రజలు తమ పిల్లలకు దేవుని ఆదేశాలు ఉపదేశిస్తే, అప్పుడు ఆ పిల్లలు తమ పూర్వీకుల్లా ఉండరు. వారి పూర్వీకులు దేవునికి విరోధంగా తిరిగారు. వారు ఆయనకు విధేయులగుటకు తిరస్కరించారు. ఆయన ఆజ్ఞలకు విధేయులగుటలో వారు మొండి ప్రజలు.
[9] ఎఫ్రాయిము కుటుంబ దళంలోని పురుషులు వారి విసురు కర్రలు కలిగి ఉన్నారు. కాని వారు యుద్ధంలో నుండి పారిపోయారు.
[10] వారు యెహోవాతో తమ ఒడంబడికను నిలుపు కోలేదు. దేవుని ఉపదేశాలకు విధేయులగుటకు వారు నిరాకరించారు.
[11] ఎఫ్రాయిముకు చెందిన ఆ ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాలను మరచిపోయారు. ఆయన వారికి చూపించిన అద్భుతకార్యాలను వారు మరిచిపోయారు.
[12] ఈజిప్టులోను, సోయను వద్దను దేవుడు తన మహాశక్తిని వారి తండ్రులకు చూపెట్టాడు.
[13] దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ప్రజలను దాటించాడు. వారికి రెండు వైపులా నీళ్లు బలమైన గోడల్లా నిలబడ్డాయి.
[14] ప్రతిరోజూ మేఘం నీడలో దేవుడు ఆ ప్రజలను నడిపించాడు. ప్రతిరాత్రి అగ్నిస్తంభం నుండి వచ్చే వెలుగు చేత దేవుడు వారిని నడిపించాడు.
[15] అరణ్యంలో దేవుడు బండను చీల్చాడు. భూమి అగాధం నుండి ఆ ప్రజలకు ఆయన నీళ్లు ఇచ్చాడు.
[16] బండ నుండి దేవుడు నీళ్లను ప్రవహింప చేసాడు. అది ఒక నదిలా ఉంది.
[17] కాని ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తూనే పోయారు. అరణ్యంలో కూడ సర్వోన్నతుడైన దేవునికి వారు విరోధంగా తిరిగారు.
[18] అప్పుడు ఆ ప్రజలు దేవుని పరీక్షించాలని తీర్మానించారు. కేవలం వారి ఆకలిని తృప్తి పరచుటకు ఆహారం కోసం వారు దేవుని ఆడిగారు.
[19] వారు దేవునికి విరోధంగా మాట్లాడారు. “ఎడారిలో దేవుడు మనకు ఆహారం ఇవ్వగలడా?
[20] దేవుడు బండను కొట్టాడు. కాగా నీళ్ల ప్రవాహం బయటకు వచ్చింది. తప్పక ఆయన మనకు కొంత రొట్టె, మాంసం ఇవ్వగలడు” అని వారన్నారు.
[21] ఆ ప్రజలు చెప్పింది యెహోవా విన్నాడు. యాకోబు మీద దేవునికి చాలా కోపం వచ్చింది. ఇశ్రాయేలు మీద దేవునికి చాల కోపం వచ్చింది.
[22] ఎందుకంటే ఆ ప్రజలు ఆయనయందు నమ్మకముంచలేదు. దేవుడు వారిని రక్షించగలడని వారు విశ్వసించలేదు.
[23] కాని అప్పుడు దేవుడు పైన మేఘాలను తెరిచాడు. వారికి ఆహారంగా ఆయన మన్నా కురిపించాడు. అది ఆకాశపు ద్వారాలు తెరచినట్టు ఆకాశంలోని ధాన్యా గారం నుండి ధాన్యం పోసినట్టు ఉంది.
[25] ప్రజలు దేవదూతల ఆహారం తిన్నారు. ఆ ప్రజలను తృప్తిపరచుటకు దేవుడు సమృద్ధిగా ఆహారం పంపించాడు.
[26] అంతట దేవుడు తూర్పు నుండి ఒక బలమైన గాలి వీచేలా చేశాడు. వర్షం కురిసినట్లుగా పూరేళ్లు వారిమీద వచ్చి పడ్డాయి. దేవుని మహా శక్తి తేమాను నుండి గాలి వీచేలా చేసింది. ఆ పక్షులు చాలా విస్తారంగా ఉండినందుచేత నీలాకాశం నల్లగా మారిపోయింది.
[28] ఆ ప్రజల గుడారాల చుట్టూరా, వారి ఇండ్ల మధ్యలో ఆ పక్షులు వచ్చి పడ్డాయి.
[29] తినేందుకు వారికి సమృద్ధిగా ఉంది. కాని తమ ఆకలి తమని పాపం చేసేలా వారు చేసుకున్నారు.
[30] వారు వారి ఆకలిని అదుపులో పెట్టుకోలేదు. అందు చేత ఆ పక్షుల రక్తం కార్చివేయక ముందే వారు ఆ పూరేళ్లను తినివేసారు.
[31] ఆ ప్రజల మీద దేవునికి చాలా కోపం వచ్చింది వారిలో అనేక మందిని ఆయన చంపివేసాడు. ఆరోగ్యవంతులైన అనేకమంది పడుచువాళ్లు చచ్చేటట్టుగా దేవుడు చేశాడు.
[32] కాని ఆ ప్రజలు యింకా పాపం చేశారు. దేవుడు చేయగల ఆశ్చర్యకరమైన విషయాల మీద వారు ఆధారపడలేదు.
[33] కనుక దేవుడు వారి పనికిమాలిన జీవితాలను ఏదో విపత్తుతో అంతం చేశాడు.
[34] దేవుడు వారిలో కొందరిని చంపినప్పుడల్లా మిగిలిన వారు ఆయన వైపుకు మళ్లుకొన్నారు. వారు పరుగెత్తుకుంటూ దేవుని దగ్గరకు తిరిగి వచ్చారు.
[35] దేవుడే తమ బండ అని ఆ ప్రజలు జ్ఞాపకం చేసుకొంటారు. సర్వోన్నతుడైన దేవుడే తమని రక్షించాడని వారు జ్ఞాపకం చేసుకొంటారు.
[36] వారు ఆయన్ని ప్రేమిస్తున్నామని అన్నారు, కాని వారి మాట నిజంకాదు. వారు అబద్ధం చేప్పారు.
[37] వారి హృదయాలు నిజంగా దేవునితో లేవు. వారు ఒడంబడికకు నమ్మకంగా లేరు.
[38] కాని దేవుడు దయకలిగినవాడు. వారి పాపాల విషయంలో ఆయన వారిని క్షమించాడు. ఆయన వారిని నాశనం చేయలేదు. అనేకసార్లు దేవుడు తన కోపాన్ని అణచుకొన్నాడు. దేవుడు తనకు మరీ ఎక్కువ కోపాన్ని రానీయలేదు.
[39] వారు కేవలం మనుష్య మాత్రులే అని దేవుడు జ్ఞాపకం చేసుకొన్నాడు. మనుష్యులు అప్పుడే వీచి, అంతలోనే మాయమై పోయే గాలి వంటివారు.
[40] అయ్యో, ఎడారిలో ఆ ప్రజలు దేవునికి అనేక తొందరలు కలిగించారు. ఆ ఎడారి దేశంలో వారు ఆయన్ని ఎంతో దుఃఖ పెట్టారు.
[41] ఆ ప్రజలు దేవుని సహనాన్ని మరలా మరలా పరీక్షించారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధునికి నిజంగా వారు ఎంతో బాధ కలిగించారు.
[42] ఆ ప్రజలు దేవుని శక్తిని గూర్చి మరచిపోయారు. శత్రువు బారినుండి దేవుడు తమని అనేకసార్లు రక్షించిన విషయం వారు మరచిపోయారు.
[43] ఈజిప్టులో ఆయన చేసిన అద్భుతాలను వారు మరచిపోయారు. సోయను పొలాలలో జరిగిన అద్భుతాలను వారు మరచిపోయారు.
[44] నదులను దేవుడు రక్తంగా మార్చాడు! ఈజిప్టు వారు నీళ్లు తాగలేకపోయారు.
[45] ఈజిప్టు ప్రజలను కుట్టిన జోరీగల దండులను దేవుడు పంపించాడు. ఈజిప్టు వారి బ్రతుకులను పాడు చేయగలిగిన కప్పలను దేవుడు పంపించాడు.
[46] దేవుడు వారి పంటలను చీడ పురుగులకు అప్పగించాడు. వారి ఇతర మొక్కలను మిడతలకు అప్పగించాడు.
[47] ఈజిప్టు వారి ద్రాక్షాతీగెలను నాశనం చేయటానికి దేవుడు వడగండ్లను వాడుకొన్నాడు. వారి చెట్లను నాశనం చేయుటకు ఆయన హిమమును వాడు కొన్నాడు.
[48] దేవుడు వారి జంతువులను వడగండ్ల చేతను వారి పశుపులను పిడుగుల చేతను చంపేశాడు.
[49] దేవుడు తన భయంకరమైన కోపాన్ని ఈజిప్టువారికి చూపించాడు. నాశనం చేసే తన దేవదూతలను వారికి విరోధంగా ఉండుటకు ఆయన పంపించాడు.
[50] దేవుడు తన కోపాన్ని చూపించుటకు ఒక మార్గం కనుగొన్నాడు. ఆ ప్రజలలో ఎవరినీ ఆయన బతకనివ్వలేదు. వారినందరినీ ఓ భయంకర రోగంతో ఆయన చావనిచ్చాడు.
[51] ఈజిప్టులో ప్రథమ సంతానాన్ని దేవుడు చంపివేసాడు. హాము సంతానంలో ప్రతి మొదటి బిడ్డనీ ఆయన చంపివేసాడు.
[52] తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను గొర్రెల కాపరిలా నడిపించాడు. ఆయన తన ప్రజలను అరణ్యం లోనికి గొర్రెలను నడిపించినట్లుగా నడిపించాడు.
[53] ఆయన తన ప్రజలను క్షేమంగా నడిపించాడు. దేవుని ప్రజలు భయపడాల్సింది. ఏమీ లేదు. వారి శత్రువులను దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి వేసాడు.
[54] దేవుడు తన ప్రజలను తన పవిత్ర దేశానికి నడిపించాడు. తన స్వంత శక్తితో సీయోను పర్వతానికి ఆయన నడిపించాడు.
[55] ఇతర రాజ్యాలు ఆ దేశాన్ని విడిచిపెట్టేటట్టు దేవుడు వారిని బలవంతం చేసాడు. దేవుడు తన ప్రజలకు వారి వంతు దేశాన్ని ఇచ్చాడు. అందుచేత ఇశ్రాయేలీయులు వారి స్వంత గృహాలలో నివసించారు.
[56] కానీ ఇశ్రాయేలు ప్రజలు సర్వోన్నతుడైన దేవున్ని ఇంకను పరీక్షించి ఆయన్ని దుఃఖ పెట్టారు. ఆ ప్రజలు దేవుని ఆదేశాలకు విధేయులు కాలేదు.
[57] ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి మళ్లు కొన్నారు. వారు వారి తండ్రుల్లాగే ద్రోహులుగాను, అపనమ్మ కస్తులుగాను ఉన్నారు. వారు మోసకరమైన విల్లులా వంకర తిరిగారు.
[58] ఇశ్రాయేలు ప్రజలు ఎత్తయిన గోపురాలు నిర్మించి దేవునికి కోపం పుట్టించారు. దేవతల విగ్రహాలను వారు తయారు చేసి దేవునికి రోషం పుట్టించారు.
[59] దేవుడు ఇది విని చాలా కోపగించాడు. మరియు ఇశ్రాయేలీయులను దేవుడు పూర్తిగా తిరస్కరించాడు.
[60] షిలోహులో పవిత్ర గుడారాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు. ఇది ప్రజల మధ్య నివసించిన దేవుని గుడారం.
[61] అప్పుడు దేవుడు ఇతర రాజ్యాల ద్వారా తన ప్రజలను బందీలుగా చేయనిచ్చాడు. దేవుని “అందమైన ఆభరణాన్ని” శత్రువులు తీసుకొన్నారు.
[62] తన ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తన కోపం చూపించాడు. ఆయన వారిని యుద్ధంలో చంపబడనిచ్చాడు.
[63] యువకులు చనిపోయేవరకు కాల్చబడ్డారు. పెళ్లి కావాల్సిన యువతులు పెళ్లిపాటలు ఏమి పాడలేదు.
[64] యాజకులు చంపివేయబడ్డారు. కాని విధవలు వారి కోసం ఏడ్వలేదు.
[65] తాగి కేకలువేసే బలాఢ్యుడైన మనిషివలె, నిద్రనుండి మేల్కోన్న మనిషివలె ప్రభువు లేచాడు.
[66] దేవుడు తన శత్రువును వెనుకకు తరిమి వారిని ఓడించాడు. దేవుడు తన శత్రువులను ఓడించి, శాశ్వతంగా వారిని అవమానించాడు.
[67] కానీ యోసేపు కుటుంబాన్ని దేవుడు నిరాకరించాడు. ఎఫ్రాయిము కుటుంబాన్ని దేవుడు కోరుకోలేదు.
[68] దేవుడు యూదావారిని ఎంచుకొన్నాడు. మరియు దేవుడు తనకు ప్రియమైన సీయోను పర్వతాన్ని కోరుకొన్నాడు.
[69] ఆ పర్వతం మీద ఎత్తుగా దేవుడు తన పవిత్ర ఆలయాన్ని నిర్మించాడు. భూమిలాగే, తన పవిత్ర ఆలయం శాశ్వతంగా ఉండేటట్టు దేవుడు నిర్మించాడు.
[70] తర్వాత తన ప్రత్యేక సేవకునిగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొన్నాడు. దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అతన్ని ఆ పని నుండి తీసివేసాడు.
[71] గొర్రెలను కాపాడే పని నుండి దేవుడు దావీదును తొలగించి, తన ప్రజలను, యాకోబు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, దేవుని సొత్తును కాపాడే పని దావీదుకు యిచ్చాడు.
[72] మరియు దావీదు పవిత్ర హృదయంతో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. అతడు చాలా జ్ఞానంతో వారిని నడిపించాడు.