[1] యెహోవాను స్తుతించండి! పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
[2] సకల దూతలారా, యెహోవాను స్తుతించండి! ఆయన సర్వ సైనికులారా ఆయనను స్తుతించండి!
[3] సూర్యచంద్రులారా యెహోవాను స్తుతించండి. ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
[4] మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి. ఆకాశం పైగా ఉన్న జలములారా ఆయనను స్తుతించండి.
[5] యెహోవా నామాన్ని స్తుతించండి. ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
[6] ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు. ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
[7] భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు! మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా యెహోవాను స్తుతించండి.
[8] అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి, తుఫాను గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
[9] పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను, దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
[10] అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
[11] భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు. నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
[12] యువతీ యువకులను దేవుడు చేశాడు. వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
[13] యెహోవా నామాన్ని స్తుతించండి! ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి! భూమిపైన, ఆకాశంలోను ఉన్న సమస్తం ఆయనను స్తుతించండి!
[14] దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు. దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు. ఎవరి పక్షంగా ఆయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!