[1] “నేను జాగ్రత్తగా నడచుకొంటాను. నా నాలుకతో నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను. నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను నా నోరు మూసుకొంటాను.
[2] మాట్లాడుటకు నేను తిరస్కరించాను. నేనేమి చెప్పలేదు. కానీ నేను నిజంగా తల్లడిల్లిపోయాను.
[3] నాకు కోపం వచ్చింది. దీని విషయం నేను తలంచిన కొలది నాకు మరింత కోపం వచ్చింది. కనుక నేను ఏదో అన్నాను.
[4] యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము. నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము. నిజానికి నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము.
[5] యెహోవా నీవు నాకు కొద్దికాలం జీవితం మాత్రమే ఇచ్చావు. నా జీవితం నీ ఎదుట శూన్యం. ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు.
[6] మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబంబిం వంటిది. మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము. కానీ ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.
[7] కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది? నీవే నా ఆశ.
[8] యెహోవా, నేను చేసిన చెడు కార్యాలనుండి నీవు నన్ను రక్షిస్తావు. దేవునియందు నమ్మకము లేనివానిలా, వెర్రివాడిలా నన్ను యితరులు చూడకుండా నీవు చేస్తావు.
[9] నేను నా నోరు తెరవను. నేను ఏమీ చెప్పను. యెహోవా, నీవు చేయవలసింది చేశావు.
[10] దేవా, నన్ను శిక్షించటం మానివేయుము. నీ శిక్షవల్ల నేను అలసిపోయాను.
[11] యెహోవా, తప్పు చేసిన వారిని నీవు శిక్షించుము. ప్రజలు జీవించాల్సిన సరైన విధానాన్ని నీవు అలా నేర్పిస్తావు. వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె నీవు నాశనం చేస్తావు. మా జీవితాలు అంతలోనే మాయమయ్యే మేఘంలా ఉన్నాయి.
[12] యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. నేను నీకు మొరపెట్టే మాటలు వినుము. నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు. నేను దాటిపోతున్న ఒక అతిథిని. నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని.
[13] యెహోవా, నా వైపు చూడకుము. నేను చనిపోక ముందు నన్ను సంతోషంగా ఉండనిమ్ము. కొంచెంకాలంలో నేను ఉండకుండా పోతాను.