Skip to content
Opens in a new window

[1] యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి.

[2] యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి! ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!

[3] యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి. యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి.

[4] యెహోవా యాకోబును కోరుతున్నాడు. యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు.

[5] యెహోవా గొప్పవాడని నాకు తెలుసు. మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు!

[6] ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో, అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలను కొంటే అది చేస్తాడు.

[7] భూమికి ప్తెగా మేఘాలను దెవుడు చేస్తాడు. మెరుపులను, వర్షాన్ని దెవుడు చేస్తాడు. దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు.

[8] ఈజిప్టు మనుష్యులలో జ్యేష్టులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు.

[9] దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు. ఫరోకు, అవి అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు.

[10] దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు. బలమైన రాజులను దేవుడు చంపేసాడు.

[11] అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు. బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు. కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు.

[12] వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు.

[13] యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది. యెహోవా, ప్రజలు నిన్ను జనాంగాల్ని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు.

[14] యెహోవా జనాంగాల్ని శిక్షించాడు. కాని తన సేవకుల యెడల దయ చూపించాడు.

[15] ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే. వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే.

[16] ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కానీ అవి మాట్లాడలేవు. కళ్లు వున్నాయి కానీ అవి చూడలేవు.

[17] ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కానీ అవి వినలేవు. ముక్కులు ఉన్నాయి కానీ అవి వాసన చూడలేవు.

[18] మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు. ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు.

[19] ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు! అహరోను వంశమా, యెహోవాను స్తుతించు.

[20] లేవీ వంశమా, యెహోవాను స్తుతించు! యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి.

[21] సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి, యెహోవా స్తుతించబడును గాక! యెహోవాను స్తుతించండి!

కీర్తనల గ్రంథము — Chapters