Skip to content
Opens in a new window

[1] యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు నీవు నన్ను సరిదిద్దేటప్పుడు కోపగించకుము.

[2] యెహోవా, నీవు నన్ను బాధించావు. నీ బాణాలు లోతుగా నాలో గుచ్చుకొన్నాయి.

[3] నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది. నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి.

[4] నేను చెడు కార్యాలు చేసిన దోషిని, ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది.

[5] నేను తెలివి తక్కువగా ఉన్నాను. ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి.

[6] నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను. రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను.

[7] నా నడుము వేడిగా కాలిపోతోంది. నా శరీరం అంతా బాధగా ఉంది.

[8] నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను. నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను.

[9] ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు. నా నిట్టూర్పులు నీకు మరుగు కాలేదు.

[10] నా గుండె తడబడచున్నది. నా బలం పోయింది. నా చూపు దాదాపు పోయింది.

[11] నా రోగం మూలంగా నా స్నేహితులు, నా పొరుగువారు నన్ను చూసేందుకు రావటం లేదు. నా కుటుంబం నా దగ్గరకు రాదు.

[12] నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు. నాకు హాని చేయగోరేవారు నా నాశనం గూర్చి మాట్లాడు కొంటున్నారు. వారు రోజంతా అబద్ధాలు చెప్తున్నారు.

[13] అయితే నేను వినబడని చెవిటి వానిలా ఉన్నాను. మాట్లాడలేని మూగవానిలా నేను ఉన్నాను.

[14] ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటి వానిలా నేను ఉన్నాను. నేను వాదించి, నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను.

[15] కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను. నా దేవా, నా ప్రభువా నా శత్రువులకు సత్యం చెప్పుము.

[16] నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు. నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు.

[17] నేను పడిపోయేటట్టు ఉన్నాను. నేను నా బాధను మరచిపోలేను.

[18] యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, నేను నీకు చెప్పాను. నా పాపాలను గూర్చి నేను విచారిస్తున్నాను.

[19] నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు, వారు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు.

[20] నా శత్రువులు నాకు కీడు చేస్తారు, నేను వారికి మంచి పనులు మాత్రమే చేశాను. మంచి పనులు చేయటానికి మాత్రమే నేను ప్రయత్నించాను. కానీ ఆ మనుష్యులు నాకు విరోధం అయ్యారు.

[21] యెహోవా, నన్ను విడిచిపెట్టకు. నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు.

[22] త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము. నా దేవా నన్ను రక్షించుము.

కీర్తనల గ్రంథము — Chapters