[1] దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి. ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
[2] యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి. మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
[3] యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు. మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
[4] యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది. ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
[5] యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టును. లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
[6] లెబనోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి. షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
[7] యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
[8] యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది. యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
[9] యెహోవా స్వరం లేడి భయపడేటట్టు చేస్తుంది. ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు. ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
[10] వరదలను యెహోవా అదుపు చేసాడు. మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
[11] యెహోవా తన ప్రజలను కాపాడును గాక. యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.