[1] సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి. ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
[2] సంగీతం ప్రారంభించండి గిలక తప్పెట వాయించండి. స్వరమండలం, సితారాల శ్రావ్యంగా వాయించండి.
[3] నెలవంక నాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి. పౌర్ణమినాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
[4] అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం. ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
[5] ఈజిప్టునుండి యోసేపును దేవుడు తీసుకొనిపోయిన సమయంలో దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు. ఈజిప్టులో నేను గ్రహించని భాషవిన్నాను.
[6] దేవుడు ఇలా చెపుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను. నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
[7] మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను. తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను. నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”
[8] “నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక నేను మీకు యిస్తాను. ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
[9] విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను ఎవరినీ ఆరాధించవద్దు.
[10] నేను యెహోవాను, నేనే మీ దేవుడను. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే. ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు, నేను దానిని నింపుతాను.
[11] “కాని నా ప్రజలు నా మాట వినలేదు. ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
[12] కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను. ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
[13] ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
[14] అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను. ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
[15] యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు, అందుచేత వారు శిక్షించబడతారు.
[16] దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు. తన ప్రజలకు తృప్తి కలిగెంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”