Skip to content
Opens in a new window

[1] దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను. దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.

[2] దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను. నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను. నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.

[3] దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను. నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.

[4] యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక! నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.

[5] ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను. యెహోవా మహిమ గొప్పది.

[6] దేవుడు గొప్పవాడు. అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు. గర్వష్టులు చేసే పనులు యెహోవాకు తెలుసు. కానీ ఆయన వారికి సన్ని హితంగా ఉండడు.

[7] దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బతికించుము. నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.

[8] యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము. యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.

కీర్తనల గ్రంథము — Chapters