Skip to content
Opens in a new window

[1] నా ప్రాణమా, యెహోవాను స్తుతించు! యెహోవా, నా దేవా, నీవు ఎంతో గొప్పవాడవు. మహిమ, ఘనత నీవు వస్త్రాలుగా ధరించావు.

[2] ఒక వ్యక్తి నిలువుపాటి అంగీ ధరించినట్లుగా నీవు వెలుగును ధరిస్తావు. ఆకాశాలను నీవు తెరగా పరుస్తావు.

[3] దేవా వాటికి పైగా నీవు నీ ఇంటిని నిర్మించావు. దట్టమైన మేఘాలను నీవు నీ రథంగా ఉపయోగిస్తావు. గాలి రెక్కల మీద నీవు ఆకాశంలో ప్రయాణం చేస్తావు.

[4] దేవా, నీ దూతలను నీవు గాలిలా చేశావు. నీ సేవకులను అగ్నిలా చేశావు.

[5] దేవా, భూమిని దాని పునాదులపై నీవు నిర్మించావు. కనుక అది ఎప్పటికీ నాశనం చేయబడదు.

[6] దుప్పటి కప్పినట్టుగా నీవు భూమిని నీళ్లతో కప్పివేశావు. నీళ్లు పర్వతాలను కప్పివేశాయి.

[7] కానీ నీవు ఆజ్ఞ ఇవ్వగానే, నీళ్లు వేగంగా వెళ్లిపోయాయి. దేవా, నీవు నీళ్లతో చెప్పగానే నీళ్లు వెంటనే వెళ్లిపోయాయి.

[8] పర్వతాలనుండి లోయల్లోనికి, ఆ తరువాత నీవు వాటికోసం చేసిన స్థలాల్లోకి నీళ్లు ప్రవహించాయి.

[9] సముద్రానికి నీవు హద్దులు నియమించావు. నీళ్లు భూమిని కప్పివేసేట్టుగా మరల ఎన్నటికీ ఉప్పొంగవు.

[10] దేవా, నీటి ఊటలనుండి నీటి కాలవలలోనికి నీవే నీళ్లను ప్రవహింప చేస్తావు. పర్వతాల జలధారల ద్వారా నీవు నీటిని కిందికి కాలువలా ప్రవహింపజేసావు.

[11] నీటి ప్రవాహాలు అడవి జంతువులన్నిటికీ నీళ్లను ఇస్తాయి. అక్కడ నీళ్లు తాగటానికి అడవి గాడిదలు కూడ వస్తాయి.

[12] నీటి మడుగుల చెంత నివసించుటకు అడవి పక్షులు వస్తాయి. సమీపంలో ఉన్న చెట్ల కొమ్మల మీద నుండి అవి పాడుతాయి.

[13] దేవుడు పర్వతాల మీదికి వర్షం పంపిస్తాడు. దేవుడు చేసిన పనులు భూమికి అవసరమైన ప్రతి దాన్నీ ఇస్తాయి.

[14] దేవా, పశువులకు ఆహారంగా గడ్డి ఎదిగేలా నీవు చేస్తావు. మేము పెంచుటకు ప్రయాసపడే మొక్కల్ని నీవు మాకిస్తావు. ఆ మొక్కలే ఈ భూమి మీద నుండి మాకు లభించే ఆహారం.

[15] దేవా, మమ్మల్ని సంతోషపెట్టే ద్రాక్షారసం నీవు మాకు ఇస్తావు. మా చర్మాన్ని నునుపు చేసే తైలాన్ని నీవు మాకిస్తావు. మమ్మల్ని బలంగలవారిగా చేయుటకు నీవు మాకు భోజనం ఇస్తావు.

[16] లెబానోను మహా దేవదారు వృక్షాలను దేవుడు నాటాడు. ఆ మహా వృక్షాలు ఎదుగుటకు వాటికి సమృద్ధిగా నీళ్లున్నాయి.

[17] పక్షులు ఆ వృక్షాలపై గూళ్లు పెడతాయి. పెద్దకొంగలు దేవదారు వృక్షాలలో నివాసం చేస్తాయి.

[18] పెద్ద కొండలు అడవి మేకలకు నివాసం, పెద్ద బండలు కుందేళ్లు దాక్కొనే చోట్లు.

[19] దేవా, కాల సూచికగా ఉండుటకు నీవు మాకు చంద్రుణ్ణిచ్చావు. దాని మూలంగా పండుగ రోజులను తెలుసుకోగలుగుతాము. ఎక్కడ అస్తమించాలో సూర్యునికి ఎల్లప్పుడూ తెలుసు.

[20] చీకటిని నీవు రాత్రిగా చేశావు. ఆ సమయాన అడవి జంతువులు బయటికి వచ్చి చుట్టూరా సంచరిస్తాయి.

[21] సింహాలు దాడి చేసేటప్పుడు గర్జిస్తాయి. అవి దేవుడు వాటికిచ్చే ఆహారంకోసం ఆయనను ఆడుగుతున్నట్టు ఉంటుంది.

[22] మరల సూర్యుడు ఉదయించినప్పుడు ఆ జంతువులు తిరిగి వాటి నివాసాలకు వెళ్లి విశ్రమిస్తాయి.

[23] అప్పుడు ప్రజలు వారి పనుల కోసం బయటకు వెళ్తారు. సాయంత్రం వరకు వారు పని చేస్తారు.

[24] యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు. భూమి నీ కార్యాలతో నిండిపోయింది. నీవు చేసే ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు.

[25] మహా సముద్రాన్ని చూడు. అది ఎంతో పెద్దది మహా సముద్రంలో రకరకాల ప్రాణులు నివసిస్తాయి. వాటిలో కొన్ని ప్రాణులు పెద్దవి కొన్ని చిన్నవి. మహా సముద్రంలో ఉండే వాటిని లెక్కించుటకు అవి చాలా విస్తారంగా ఉన్నాయి.

[26] మహా సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తాయి. నీవు చేసిన సముద్ర ప్రాణి మకరం ఆ సముద్రంలో ఆడుకుంటుంది.

[27] దేవా, ఆ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి. దేవా, వాటికి సరియైన సమయంలో నీవు ఆహారంయిస్తావు.

[28] దేవా, జీవించే ప్రాణులన్నీ తినే ఆహారం నీవే వాటికి ఇస్తావు. మంచి భోజనంతో నిండిన నీ గుప్పిళ్లు నీవు విప్పగా అవి కడుపు నిండేంత వరకు భోజనము చేస్తాయి.

[29] నీవు వాటి నుండి తిరిగిపోయినప్పుడు అవి భయపడిపోతాయి. వాటి ప్రాణం వాటిని విడిచి నప్పుడు అవి బలహీనమై చస్తాయి. మరియు అవి మరలమట్టి అయిపోతాయి.

[30] కాని యెహోవా, నీ ఆత్మను పంపినపుడు, అవి మరల ఆరోగ్యంగా ఉంటాయి. భూమి మరల కొత్తదిగా అవుతుంది.

[31] యెహోవా మహిమ శాశ్వతంగా కొనసాగును గాక. యెహోవా చేసిన వాటిని ఆయన అనుభవించునుగాక.

[32] యెహోవా భూమివైపు చూసేటప్పుడు అది వణకుతుంది. ఆయన పర్వతాలను ముట్టేటప్పుడు వాటినుండి పొగ లేవటానికి ప్రారంభిస్తుంది.

[33] నా జీవితకాలం అంతా నేను యెహోవాకు పాడుతాను. నేను బతికి ఉండగా యెహోవాకు స్తుతులు పాడుతాను.

[34] నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోషపెడతాయని నేను ఆశిస్తున్నాను. యెహోవా విషయమై నేను సంతోషిస్తున్నాను.

[35] భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును గాక. దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు గాక. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు! యెహోవాను స్తుతించు!

కీర్తనల గ్రంథము — Chapters