[1] ఈజిప్ట్‌దేశం నుంచి ఇస్రాయేల్ ప్రజ వచ్చిన తరువాత రెండో సంవత్సరం మొదటి నెల యెహోవా సీనాయి ఎడారిలో మోషేతో ఇలా అన్నాడు:
[2] “ఇస్రాయేల్ ప్రజలు పస్కా పండుగను దాని నియామక కాలంలో ఆచరించాలి.
[3] ఈ నెల పద్నాలుగో రోజున సాయంకాల సమయంలో దాని నియామక కాలంలో దాని చట్టం, నిర్ణయం ప్రకారం దానిని ఆచరించాలి.”
[4] అందుచేత “పస్కా పండుగ ఆచరించండి” అని మోషే ఇస్రాయేల్‌ప్రజతో చెప్పాడు.
[5] వారు మొదటి నెల పద్నాలుగో రోజున సాయంకాలం సీనాయి ఎడారిలో పస్కా పండుగ ఆచరించారు. యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇస్రాయేల్‌ప్రజలు అంతా చేశారు.
[6] అయితే కొంతమంది చనిపోయినవాడి శవాన్ని తాకడం వల్ల అశుద్ధంగా ఉండి ఆ రోజున పస్కాపండుగ ఆచరించలేకపోయారు. గనుక ఆ రోజు వారు మోషే అహరోనుల దగ్గరికి వచ్చి మోషేతో,
[7] “చనిపోయినవాడి శవాన్ని తాకడం వల్ల అశుద్ధంగా ఉన్నాం. అయినా మేము యెహోవా అర్పణ దాని నియామక కాలంలో తక్కిన ఇస్రాయేల్‌ప్రజలతో ఎందుకు అర్పించకూడదు? ఈ ఆటంకం ఎందుకు ఉండాలి?” అన్నారు.
[8] అందుకు మోషే “ఇక్కడే ఉండండి. మీ విషయం యెహోవా ఏం చెప్తాడో నేను తెలుసుకొంటాను” అన్నాడు.
[9] యెహోవా మోషేతో చెప్పినది ఇదే:
[10] “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఇలా చెప్పు – మీలో గానీ మీ సంతానంలో గానీ ఎవరైనా శవాన్ని ముట్టడం వల్ల అశుద్ధంగా ఉన్నా, దూర ప్రయాణం మీద ఉన్నా ఆ వ్యక్తి పస్కాపండుగ ఆచరించవచ్చు.
[11] అయితే అలాంటివారు రెండో నెల పద్నాలుగో రోజున సాయంకాల సమయంలో దానిని ఆచరించాలి. వారు పస్కాబలిని పొంగని రొట్టెతో చేదుకూర మొక్కలతో తినాలి.
[12] వారు మరుసటి ఉదయం వరకు దానిలో కొంచెమైనా మిగలనివ్వకూడదు, దాని ఎముకలలో దేన్నీ విరగ్గొట్టకూడదు. పస్కాపండుగను గురించిన ప్రతి చట్టం అనుసరించి దాన్ని ఆచరించాలి.
[13] ఎవరైనా ప్రయాణం చేయకుండా, శుద్ధంగా ఉండి, పస్కాపండుగ ఆచరించకపోతే, ఆ వ్యక్తిని ప్రజలలో లేకుండా చేయాలి. ఆ వ్యక్తి యెహోవా అర్పణ నియామక కాలంలో అర్పించలేదు, గనుక తన అపరాధం తానే భరించాలి.
[14] “మీ మధ్య కాపురమున్న విదేశీయుడు యెహోవా పస్కాపండుగ ఆచరించాలనుకొంటే ఆ వ్యక్తి కూడా పస్కా చట్టం, నిర్ణయం ప్రకారం దానిని ఆచరించాలి. విదేశస్తుడు కానివ్వండి, స్వదేశస్తుడు కానివ్వండి, మీ కందరికీ ఒకటే చట్టం ఉండాలి”.
[15] దైవనివాసాన్ని నిలబెట్టిన రోజున శాసనాల గుడారమైన దైవనివాసాన్ని దేవుని మేఘం కమ్మింది. సాయంకాలం నుంచి ఉదయం వరకు దైవనివాసం మీద మంటల్లాంటి ప్రకాశం ఉంది.
[16] ఎల్లప్పుడూ అలాగే జరిగింది. దైవ నివాసాన్ని మేఘం కమ్మింది. రాత్రివేళ ఆ మేఘం మంటల్లాంటి ప్రకాశంలాగా ఉంది.
[17] ఆ మేఘం గుడారం మీద నుండి పైకెక్కినప్పుడెల్లా ఇస్రాయేల్‌ప్రజలు ప్రయాణం కట్టేవారు; మేఘం నిలిచి నప్పుడెల్లా నిలిచిన స్థలంలోనే వారు దిగేవారు.
[18] ఇస్రాయేల్‌ప్రజలు యెహోవా మాట ప్రకారమే ప్రయాణాలు చేసేవారు, డేరాలు వేసుకొనేవారు. మేఘం దైవనివాసం మీద నిలిచే రోజులన్నీ వారు ఆగేవారు.
[19] మేఘం చాలా రోజులు దైవనివాసం మీద నిలిస్తే ఇస్రాయేల్‌ప్రజలు యెహోవా ఇచ్చిన ఆదేశం పాటించి ప్రయాణం చేసేవారు కారు.
[20] మేఘం కొన్ని రోజులు దైవనివాసం మీద నిలిస్తే వారూ నిలిచారు. యెహోవా మాట ప్రకారమే వారు నిలిచేవారు, ప్రయాణం చేసేవారు.
[21] మేఘం సాయంకాలం నుంచి ఉదయం వరకు మాత్రమే నిలిస్తే ఉదయం మేఘం పైకెక్కినప్పుడు వారు ప్రయాణం చేశారు. పగలైనా రాత్రి అయినా మేఘం పైకెక్కినప్పుడెల్లా వారు ప్రయాణం చేసేవారు.
[22] మేఘం రెండు రోజులు గానీ నెల గానీ సంవత్సరం గానీ ఉండిపోయి దైవనివాసం మీద నిలిస్తే ఇస్రాయేల్ ప్రజలు పయనించకుండా ఉండిపోయేవారు. మేఘం పైకెక్కినప్పుడు మాత్రమే వారు ప్రయాణం చేసేవారు.
[23] యెహోవా మాట ప్రకారమే వారు ఉండిపోయేవారు, ప్రయాణం చేసేవారు. మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞననుసరించి యెహోవా ఆదేశం పాటించేవారు.