[1] యెహోవా మోషేతో,
[2] “నేను ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చే కనాను దేశాన్ని సంచరించి చూడడానికి నీవు మనుషులను పంపు. వారి పూర్వీకుల గోత్రాలనుంచి, ఒక్కొక్క గోత్రంనుంచి ఒక్కొక్క ప్రముఖుణ్ణి పంపాలి” అన్నాడు.
[3] యెహోవా ఇచ్చిన ఆజ్ఞప్రకారమే మోషే పారాను ఎడారినుంచి వారిని పంపాడు. వారిలో ఒక్కొక్కరూ ఇస్రాయేల్ ప్రజలలో ప్రముఖులు.
[4] వారి పేర్లు ఇవి: రూబేనుగోత్రంలో జక్కూర్ కొడుకు షమ్మూయ,
[5] షిమ్యోనుగోత్రంలో హోరీ కొడుకు షాపాతు,
[6] యూదాగోత్రంలో యెఫున్నె కొడుకు కాలేబు,
[7] ఇశ్శాకారుగోత్రంలో యోసేపు కొడుకు ఇగాలు,
[8] ఎఫ్రాయింగోత్రంలో నూను కొడుకు హోషేయ,
[9] బెన్యామీనుగోత్రంలో రాఫు కొడుకు పల్తీ,
[10] జెబూలూనుగోత్రంలో సోరి కొడుకు గదీయేల్,
[11] యోసేపుగోత్రంలో, అంటే మనష్షే గోత్రంలో సూసీ కొడుకు గదీ,
[12] దానుగోత్రంలో గెమలి కొడుకు అమ్మీయేల్,
[13] ఆషేరుగోత్రంలో మిఖాయేల్ కొడుకు సెతూర్,
[14] నఫ్తాలిగోత్రంలో వాపెసీ కొడుకు నహబీ,
[15] గాదుగోత్రంలో మాకీ కొడుకు గెయూవేల్.
[16] ఆ దేశాన్ని చూడడానికి మోషే పంపించిన మనుషుల పేర్లు అవి. అయితే నూను కొడుకు హోషేయకు యెహోషువ అనే పేరు పెట్టాడు మోషే.
[17] కనానుదేశాన్ని సంచరించి చూడడానికి మోషే వారిని పంపిస్తూ ఇలా అన్నాడు: “మీరు ఆ దేశంలో దక్షిణ దిక్కున ప్రవేశించండి. తరువాత కొండసీమలకు వెళ్ళండి.
[18] ఆ దేశం ఎలాంటిదో చూడండి. అక్కడి ప్రజలకు బలం ఉందో లేదో, వారి సంఖ్య అధికమో కాదో,
[19] వారు కాపురమున్న దేశం మంచిదో చెడ్డదో, వారు ఉంటున్న పట్టణాలు ప్రాకారాలు గలవో కావో,
[20] ఆ దేశం సారవంతమో కాదో, దానిలో చెట్లున్నాయో లేవో కనిపెట్టండి. ఆ దేశం పండ్లలో కొన్ని తీసుకురండి.” (అది మొదటి ద్రాక్షపండ్ల కాలం.)
[21] వారు వెళ్ళి సీన్ ఎడారినుంచి హమాతు కనుమదగ్గర ఉన్న రెహాబువరకు ఆ దేశాన్ని చూశారు.
[22] దక్షిణ దిక్కున ప్రవేశించి హెబ్రోనుకు వచ్చారు. హెబ్రోనులో అహీమాన్, షేషయి, తల్మయి జాతులవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనాకు వంశస్థులు. హెబ్రోను ఈజిప్ట్‌లో ఉన్న సోయన్ కంటే ఏడేళ్ళు ముందుగా కట్టిన పట్టణం.
[23] ఆ ప్రముఖులు ఎష్కోల్ లోయలోకి వెళ్ళి అక్కడ ఒకే గెల ఉన్న ద్రాక్షచెట్టు కొమ్మను నరికారు. దానిని కర్రతో ఇద్దరు మోశారు. వారు కొన్ని దానిమ్మ పళ్ళూ కొన్ని అంజూర పళ్ళూ కూడా తీసుకువచ్చారు.
[24] ఇస్రాయేల్‌వారు అక్కడ ద్రాక్షగెల నరికినందుకే ఆ స్థలానికి ఎష్కోల్ లోయ అని పేరు.
[25] వారు నలభై రోజులు ఆ దేశాన్ని సంచరించి చూచి తిరిగి వచ్చారు.
[26] మోషే, అహరోను, ఇస్రాయేల్ సర్వ సమాజం పారాను ఎడారిలో కాదేషులో ఉన్నారు. ఆ ప్రముఖులు వారిదగ్గరికి చేరి మోషే అహరోనులకూ సర్వ సమాజానికీ సమాచారం తెలియజేశారు, ఆ దేశం పళ్ళను వారికి చూపెట్టారు.
[27] వారు మోషేతో చెప్పిన సంగతి ఇది: “నీవు మమ్మల్ని పంపిన దేశానికి చేరుకున్నాం. అది పాలు తేనెలు నదులై పారుతున్న దేశమే. ఇదిగో ఆ దేశం పళ్ళు ఇవి.
[28] అయితే ఆ దేశవాసులు బలిష్ఠులు. వాళ్ళ పట్టణాలు చాలా పెద్దవి. వాటికి ప్రాకారాలున్నాయి. అంతేగాక, అక్కడ అనాకు వాళ్ళను చూశాం.
[29] అమాలేకువాళ్ళు దక్షిణ ప్రాంతంలో ఉంటున్నారు. హిత్తి, యోబూసి, అమోరీ జాతులవారు కొండసీమల్లో కాపురముంటున్నారు. కనానువాళ్ళు సముద్రందగ్గర, యొర్దాను నది ఒడ్డున కాపురముంటున్నారు.”
[30] కాలేబు మోషే ఎదుట ప్రజలను శాంతపరచి “మనం తప్పకుండా వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి. నిస్సందేహంగా దానిని జయించగలం” అన్నాడు.
[31] కాని అతడితోపాటు వెళ్లిన ఆ మనుషులు “ఆ ప్రజలు మనకంటే బలాఢ్యులు. మనం వాళ్ళమీదికి వెళ్ళలేము” అన్నారు.
[32] అంతేగాక తాము చూచిన ఆ దేశాన్ని గురించి చెడ్డ సమాచారం ఇస్రాయేల్ ప్రజలకు చెప్తూ ఇలా అన్నారు: “మేము సంచరించి చూచిన ఆ దేశం తన నివాసులను దిగమింగేస్తుంది. ఆ దేశంలో మాకు కనిపించిన వాళ్ళంతా బ్రహ్మాండమైనవాళ్ళు.
[33] అక్కడ నెఫీలిజాతివాళ్ళను చూశాం (నెఫీలివాళ్ళు అనాకు వంశస్థులు). వాళ్ళను చూస్తే మా దృష్టిలో మేము మిడతలంత చిన్నగా ఉన్నాం, వాళ్ళ దృష్టికి కూడా అంతే.”