[1] రూబేను గోత్రికులకూ గాదు గోత్రికులకూ చాలా పశువులు ఉన్నాయి. పశువులకోసం యాజెరు, గిలాదు ప్రదేశాలు మంచివని తెలుసుకొని,
[2] వారు వచ్చి మోషేతో, ఎలియాజరుయాజితో, సమాజనాయకులతో ఇలా అన్నారు:
[3] “ఇస్రాయేల్‌ప్రజల సమాజం ఎదుట యెహోవా జయించిన ఈ ప్రాంతాలు – ఈ అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఏలాలే, షెబాం, నెబో, బెయోను –
[4] ఇస్రాయేల్ ప్రజల ఎదుట యెహోవా మొత్తిన ప్రాంతాలు పశువులకోసం చాలా మంచి ప్రాంతాలు. మీ సేవకులైన మాకు పశువులున్నాయి గదా.
[5] మీరు మమ్మల్ని దయ చూస్తుంటే, మమ్మల్ని యొర్దాను అవతలికి దాటించకుండా, మీ సేవకులైన మాకు ఈ దేశాన్ని వారసత్వంగా ఇవ్వండి.”
[6] మోషే గాదుగోత్రికులకూ రూబేనుగోత్రికులకూ ఇలా జవాబిచ్చాడు: “మీ స్వజనులు యుద్ధానికి వెళ్ళిపోతే మీరు ఇక్కడ కూర్చోవచ్చా?
[7] యెహోవా ఇస్రాయేల్ ప్రజలకిచ్చిన దేశానికి వారు వెళ్ళకుండేలా మీరు వారిని అధైర్యపరుస్తారెందుకు?
[8] ఆ దేశాన్ని చూడడానికి కాదేష్‌బర్నేయనుంచి నేను మీ తండ్రులను పంపించిన కాలంలో వారు ఇలా చేశారు గదా!
[9] వారు ఎష్కోల్ లోయలోకి వెళ్ళి ఆ దేశాన్ని చూచి యెహోవా ఇస్రాయేల్ ప్రజలకిచ్చిన దేశానికి వారిని వెళ్ళకుండేలా అధైర్యపరచారు.
[10] ఆ రోజున యెహోవా కోపాగ్ని రగులుకొంది. ఆయన ఇలా శపథం చేశాడు:
[11] ఇరవై ఏండ్లు మొదలుకొని పై వయసు ఉండి ఈజిప్ట్‌దేశంనుంచి వచ్చినవారిలో కెనెజీవాడైన యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ మాత్రమే యెహోవాను పూర్తిగా అనుసరించారు.
[12] మిగతావారు నన్ను పూర్తిగా అనుసరించలేదు. అందుచేత ఇస్తానని నేను అబ్రాహాముకూ ఇస్సాకుకూ యాకోబుకూ వాగ్దానం చేసిన దేశాన్ని వారిలో ఎవ్వరూ చూడరు. కాలేబు, యెహోషువ మాత్రమే చూస్తారు.
[13] యెహోవా కోపాగ్ని ఇస్రాయేల్ ప్రజలమీద రగులుకొంది. యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించిన ఆ తరంవారంతా నాశనమయ్యేవరకూ ఎడారిలో నలభై ఏండ్లు వారు తిరుగాడేలా ఆయన చేశాడు.
[14] ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజల పట్ల యెహోవాకు కోపం మరి ఎక్కువగా రేపడానికి మీరు మీ తండ్రుల స్థానంలో లేచారు. మీరు పాపిష్ఠి సంతానం.
[15] మీరు యెహోవాను అనుసరించకుండా వెనుకకు తిరిగితే ఆయన ఈ ప్రజలను ఈ ఎడారిలో ఇంకా ఉండిపోయేలా చేస్తాడు. ఈ విధంగా మీరు మీ ప్రజలందరి నాశనానికీ కారకులవుతారు.”
[16] అప్పుడు వారు దగ్గరికి వచ్చి అతడితో ఇలా అన్నారు: “మేము ఇక్కడ మా పశువులకోసం దొడ్లనూ, మా పిల్లలకోసం గ్రామాలనూ కట్టుకొంటాం.
[17] మేమైతే యుద్ధానికి సంసిద్ధులమై ఇస్రాయేల్ ప్రజలను వారివారి స్థలాలకు చేర్చేవరకూ వారి ముందట సాగిపోతాం. అయితే మా పిల్లలు ఈ దేశవాసుల భయంచేత ప్రాకారాలు గల ఊళ్ళలో ఉండిపోవాలి.
[18] ఇస్రాయేల్ ప్రజల్లో ప్రతి ఒక్కరూ తమ వారసత్వం స్వాధీనం చేసుకొనేవరకూ మా ఇండ్లకు తిరిగి రాము.
[19] యొర్దానుకు ఇవతల ఈ తూర్పు ప్రదేశంలో మాకు వారసత్వం దొరికిన కారణంగా యొర్దాను అవతల ప్రదేశాలలో వారితో వారసత్వం పొందము.”
[20] మోషే వారితో అన్నాడు, “మీరు అలా చేస్తే, యెహోవా సన్నిధానంలో యుద్ధానికి సిద్ధపడితే,
[21] యెహోవా తన ముందునుంచి తన శత్రువులను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని జయించేవరకూ ఆయన సన్నిధానంలో ఆయుధాలు ధరించిన మీరంతా యొర్దాను అవతలికి వెళ్ళిపోతే,
[22] తరువాత మీరు ఇక్కడికి రావచ్చు. అప్పుడు మీరు యెహోవా దృష్టిలో ఇస్రాయేల్ ప్రజల దృష్టిలో నిర్దోషులుగా ఉంటారు, ఈ ప్రదేశం యెహోవా సన్నిధానంలో మీకు వారసత్వం అవుతుంది.
[23] కాని, మీరు ఆ విధంగా చేయకపోతే యెహోవాకు విరోధంగా పాపం చేసినవారవుతారు. అలాంటప్పుడు మీ పాపం మిమ్ములను పట్టుకొంటుందని తెలుసుకోండి.
[24] ఇప్పుడు మీ చిన్నవారికోసం గ్రామాలను, మీ మందలకోసం దొడ్లను కట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారమే చేయండి.”
[25] గాదు గోత్రికులూ రూబేను గోత్రికులూ మోషేకు ఇలా జవాబిచ్చారు: “మా యజమానులైన మీరు ఆజ్ఞాపించినట్టే మీ సేవకులైన మేము చేస్తాం.
[26] మా చిన్నవారు, మా భార్యలు, మా మందలు, మా పశువులంతా గిలాదు ఊళ్ళలో ఉండాలి.
[27] అయితే మీ సేవకులైన మామధ్య ఆయుధాలు ధరించినవారంతా మా యజమానులైన మీరు చెప్పినట్టే యెహోవా సన్నిధానంలో యుద్ధం చేయడానికి యొర్దాను అవతలికి వస్తారు.”
[28] కాబట్టి వారిని గురించి యాజి అయిన ఎలియాజరుకూ నూను కొడుకు యెహోషువకూ ఇస్రాయేల్ ప్రజల గోత్రాల పూర్వీకుల కుటుంబాల నాయకులకూ మోషే ఇలా ఆజ్ఞాపించాడు:
[29] “గాదు రూబేను గోత్రికులలో యెహోవా సన్నిధానంలో యుద్ధానికి ఆయుధాలు ధరించివారంతా మీతో యొర్దాను అవతలికి వెళ్ళిపోతే, ఆ దేశం మీ వశం అయ్యాక మీరు ఈ గిలాదు ప్రదేశాన్ని వారికి వారసత్వంగా ఇవ్వాలి.
[30] కానీ వారు మీతోపాటు ఆయుధాలతో అవతలికి వెళ్ళకపోతే, వారు కనానుదేశంలోనే మీ మధ్య వారసత్వం పొందాలి.”
[31] అందుకు గాదు రూబేను గోత్రికులు ఇలా ప్రత్యుత్తరమిచ్చారు: “మీ దాసులైన మాతో యెహోవా చెప్పినట్టే చేస్తాం.
[32] మేము యెహోవా సన్నిధానంలో ఆయుధాలు ధరించి నది దాటి కనానుదేశంలోకి వస్తాం. అప్పుడు యొర్దాను ఇవతల మేము వారసత్వం పొందుతాం.”
[33] అప్పుడు మోషే గాదువారికీ రూబేను వారికీ యోసేపు కొడుకు మనష్షే అర్ధ గోత్రంవారికీ అమోరీవాళ్ళ రాజైన సీహోను రాజ్యాన్నీ బాషాను రాజైన ఓగు రాజ్యాన్నీ ఇచ్చాడు. ఆ ప్రాంతాలనూ వాటి పట్టణాలనూ పట్టణాల చుట్టూ ఉన్న భూములనూ వారికిచ్చాడు.
[34] గాదు గోత్రికులు దీబోను, అతారోతు, అరోయేర్,
[36] బేత్‌నిమ్రా, బేత్‌హారాను అనే ప్రాకారాలు ఉన్న పట్టణాలను కట్టారు. మందల దొడ్లను కూడా వేసుకొన్నారు.
[37] రూబేను గోత్రికులు హెష్బోను, ఏలాలె, కిర్యతాయిం,
[38] నెబో బేల్‌మెయోను (వాటి పేర్లు మార్చబడ్డాయి), సిబ్మా అనే పట్టణాలను కట్టారు. తాము కట్టిన ఆ పట్టణాలకు వేరే పేర్లు పెట్టారు.
[39] మనష్షే కొడుకు మాకీరు వంశీయులు గిలాదు ప్రదేశానికి వెళ్ళి దానిని జయించి దానిలో ఉన్న అమోరీవాళ్ళను తరిమారు.
[40] గనుక మనష్షే కొడుకు మాకీరు వంశీయులకు మోషే గిలాదు ఇచ్చాడు. ఆ వంశంవాళ్ళు అక్కడ కాపురమేర్పరచుకొన్నారు.
[41] మనష్షే వంశీయుడు యాయీరు వెళ్ళి అక్కడి గ్రామాలను పట్టుకొని వాటికి హవోత్‌యాయీరు అనే పేరు పెట్టాడు.
[42] నోబహు వెళ్ళి కెనాతునూ దాని గ్రామాలనూ పట్టుకొని దానికి నోబహు అనే తన పేరు పెట్టాడు.