Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్ ప్రజలను దీవించడమే యెహోవాకు ఇష్టమని బిలాం తెలుసుకొన్నాడు, గనుక మునుపటిలాగా అతడు శకునాలను చూడడానికి ఎక్కడికీ వెళ్ళకుండా ఆ ఎడారివైపు తిరిగాడు.

[2] అక్కడ క్రమంగా వరుసగా దిగివున్న ఇస్రాయేల్ ప్రజల గోత్రాలను బిలాం చూశాడు. అప్పుడు దేవుని ఆత్మ అతణ్ణి ఆవరించాడు. అతడు కావ్యరూపంలో ఇలా పలికాడు:

[3] “బెయోరు కుమారుడు బిలాంకు వచ్చిన దేవోక్తి. కండ్లు తెరిచిన వాడి దేవోక్తి

[4] దేవుని పలుకులు విన్నవాడి దేవోక్తి పరవశుడై కనువిప్పు కలిగినవాడై అమిత శక్తిగల దేవుని దర్శనం పొందినవాడి దేవోక్తి ఇదే.

[5] యాకోబుజనమా! నీ గుడారాలు, ఇస్రాయేల్ ప్రజా! నీ నివాస స్థలాలు ఎంత చక్కనివి!

[6] అవి వ్యాపించి ఉన్న ప్రవాహాలు గల మైదానాలలాంటివి, నది ఒడ్డున ఉన్న తోటలలాంటివి, యెహోవా నాటిన అగరు చెట్లలాంటివి, నీళ్ళ దగ్గర ఉన్న దేవదారు వృక్షాలలాంటివి.

[7] ఆ ప్రజల బొక్కెనల అంచుల పైనుంచి నీళ్ళు పొర్లిపారుతాయి. వారి సంతానం అనేక జలాల దగ్గర కాపురముంటారు. వారి రాజు రాజైన అగగుకంటే మించినవాడవుతాడు. వారి రాజ్యం ఘనంగా ఉంటుంది.

[8] దేవుడు ఈజిప్ట్‌నుంచి వారిని తీసుకువచ్చాడు. గురుపోతు బలంలాంటి బలం ఆయన వారికిచ్చాడు. వారు తమ శత్రువులైన జనాలను మింగివేస్తారు. వాళ్ళ ఎముకలు విరగ్గొట్టివేస్తారు. వారి బాణాలు వాళ్ళకు గుచ్చుకొంటాయి.

[9] ముందుకు వంగి పడుకొన్న సింహంలాగా, ఆడసింహంలాగా వారు పడుకుంటారు. వారిని లేపడానికి ఎవరు తెగిస్తారు? మిమ్మల్ని దీవించేవాడు దీవెన పొందుతాడు. మిమ్మల్ని శపించేవాడు శాపానికి గురి అవుతాడు.

[10] అప్పుడు బాలాకు బిలాంమీద కోపంతో మండిపడి చేతులు చరుచుకొని బిలాంతో ఇలా అన్నాడు: “నా శత్రువుల్ని శపించడానికి మిమ్మల్ని పిలిస్తే మీరు ఈ మూడు సార్లు వారిని గొప్పగా దీవించారు.

[11] ఇప్పుడు మీ స్థలానికి పారిపోండి. మిమ్మల్ని అధికంగా ఘనపరచాలనుకొన్నాను గాని మీరు ఘనత పొందకుండా యెహోవా చేశాడు.”

[12] అందుకు బిలాం బాలాకుతో అన్నాడు,

[13] “బాలాకు తన భవనాన్ని వెండి బంగారాలతో నింపి నాకిచ్చినా యెహోవా ఆజ్ఞను మీరను; దాని కంటే మంచిది గానీ చెడ్డది గానీ చెయ్యను, యెహోవా చెప్పేమాటలే నేను చెప్తానని మీరు నాదగ్గరికి పంపించిన వార్తాహరులతో చెప్పాను గదా.

[14] ఇప్పుడు నేను నా ప్రజలదగ్గరికి వెళ్తాను. అయితే చివరి రోజుల్లో ఈ ప్రజలు నీ ప్రజలకు ఏం చేస్తారో అది నీకు తెలియజేస్తాను.”

[15] అప్పుడతడు కావ్యరూపంలో ఇలా పలికాడు: “బెయోరు కుమారుడు బిలాం దేవోక్తి కనువిప్పు కలిగిన వాడి దేవోక్తి

[16] దేవుని పలుకులు విన్నవాడి దేవోక్తి సర్వాతీతుడైన దేవుని గురించిన జ్ఞానం గలవాడి దేవోక్తి, పరవశుడై కనువిప్పు కలిగినవాడై అమిత శక్తిగల దేవుని దర్శనం పొందినవాడి దేవోక్తి ఇదే:

[17] నక్షత్రం యాకోబు జనంలో ఉదయిస్తుంది. రాజదండం ఇస్రాయేల్ ప్రజలో లేస్తుంది. ఆయనను చూస్తున్నాను గాని, ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూస్తున్నాను గాని, సమీపంలో ఉన్నట్టు కాదు. ఆయన మోయాబు ప్రాంతాలను మొత్తుతాడు. అల్లరిమూకనంతటినీ నాశనం చేస్తాడు.

[18] ఆయనకు విరోధంగా ఉన్న సేయీరు, ఎదోందేశం ఆయన స్వాధీనం అవుతాయి. ఇస్రాయేల్ ప్రజలు పరాక్రమాన్ని కనుపరుస్తారు.

[19] యాకోబుజనంలో పరిపాలకుడు జన్మిస్తాడు. ఇక్కడి పట్టణాలనుంచి పారిపోయిన వారందరినీ ఆయన నాశనం చేస్తాడు.”

[20] బిలాం అమాలేకుజాతివాళ్ళ ప్రదేశం వైపు చూచి తన కావ్యం ఇలా పలికాడు: “జాతులలో అమాలేకు మొదటిది. వాళ్ళ అంతం సర్వనాశనం.”

[21] అతడు కేనువాళ్ళ ప్రదేశంవైపు చూచి తన కావ్యం ఇలా పలికాడు: “మీ నివాస స్థలం దృఢమైనది. మీ గూడు నిటారు రాతికొండమీద కట్టి ఉంది.

[22] అయినా కేనువాళ్ళు నాశనమవుతారు. అష్షూరువాళ్ళు వాళ్ళను చెరపట్టేవరకు ఎంతకాలం ఉంటుంది?”

[23] అతడు కావ్యరూపంలో ఇంకా అన్నాడు: “అయ్యో! దేవుడు ఇలా చేసేటప్పుడు ఎవరు బ్రతకగలరు?

[24] కిత్తీం దేశతీరంనుంచి ఓడలు వస్తాయి. వాటివల్ల అష్షూరువాళ్ళకూ ఏబెరువాళ్ళకూ బాధ కలుగుతుంది. వారు సర్వనాశనమవుతారు.”

[25] అప్పుడు బిలాం లేచి స్వస్థలానికి తిరిగివెళ్ళాడు. బాలాకు కూడా తన దారిన వెళ్ళాడు.

సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు) — Chapters