[1] యెహోవా మోషేతో “మిద్యానువాళ్ళు ఇస్రాయేల్ ప్రజలకు చేసినదానికి ప్రతీకారం చేసితీరాలి.
[2] ఆ తరువాత నీవు పూర్వీకుల దగ్గరికి చేరుతావు” అన్నాడు.
[3] అందుచేత మోషే ప్రజలతో ఇలా అన్నాడు: “మిద్యానువాళ్ళ పై పడడానికి మీలో కొందరు ఆయుధాలు ధరించాలి. యెహోవా నిర్ణయించిన ప్రతీకారం వారు మిద్యానువాళ్ళకు చేయాలి.
[4] ఇస్రాయేల్‌ప్రజల ప్రతి గోత్రంలోనుంచీ వెయ్యిమందిని మీరు ఆ యుద్ధానికి పంపించాలి.”
[5] ఇస్రాయేల్ ప్రజల సేనలలో ప్రతి గోత్రంలోనుంచీ వెయ్యిమంది ప్రకారం, మొత్తం పన్నెండు వేలమంది యుద్ధసన్నద్ధులను వారు ఎన్నుకొన్నారు.
[6] ప్రతి గోత్రంనుంచీ ఎన్నికైన ఆ మనుషులను మోషే యుద్ధానికీ పంపించాడు. వారితో కూడా యుద్ధానికి వెళ్ళడానికి యాజి అయిన ఎలియాజరు కొడుకు ఫీనెహాసును పంపించాడు. ఫీనెహాసు పవిత్ర పాత్రలనూ, ఊదడానికి బూరలనూ తీసుకుపోయాడు.
[7] యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు వారు మిద్యానువాళ్ళతో యుద్ధం చేశారు, మగవారందరినీ చంపారు.
[8] ఆ హతమైనవాళ్ళతోపాటు మిద్యాను రాజులను కూడా చంపారు. వారు చంపిన అయిదుగురు మిద్యానురాజుల పేర్లు ఎవీ, రేకెం, సూర్, హూర్, రేబ. బెయోరు కొడుకు బిలాంను కూడా ఖడ్గంతో చంపారు.
[9] ఇస్రాయేల్‌ప్రజలు మిద్యాను స్త్రీలనూ చిన్నవాళ్ళనూ పట్టారు. వాళ్ళ పశువులనూ గొర్రె మేకలన్నిటినీ వాళ్ళ యావదాస్తినీ దోచుకొన్నారు.
[10] మిద్యానువాళ్ళు నివసించిన పట్టణాలన్నీ వాళ్ళ శిబిరాలన్నీ తగలబెట్టారు.
[11] చెరపట్టుకొన్న వాళ్ళందరినీ దోచుకొన్న జంతువులన్నిటినీ తీసుకువెళ్ళారు.
[12] ఆ బందీలనూ పశుసంపదనూ కొల్లసొమ్మునూ శిబిరంలో ఉన్న మోషే దగ్గరికీ ఎలియాజరుయాజి దగ్గరికీ ఇస్రాయేల్ ప్రజల సమాజం దగ్గరికీ తెచ్చారు. శిబిరం యెరికో ఎదుట, యొర్దాను దగ్గర, మోయాబు మైదానాల ప్రాంతంలో ఉంది.
[13] మోషే, ఎలియాజరుయాజి, సమాజ నాయకులందరూ వారిని కలుసుకోవడానికి శిబిరం వెలుపలికి వెళ్ళారు.
[14] అయితే మోషే దండయాత్రనుంచి వచ్చిన సేనానాయకులమీద కోపపడ్డాడు. (వారు వెయ్యిమందికి లేక వందమందికి అధిపతులు.)
[15] అతడు వారితో ఇలా అన్నాడు: “మీరు ఆడవారిని బ్రతకనిచ్చారేం!
[16] చూడండి, బిలాం ఇచ్చిన సలహా మూలంగా పెయోర్ విషయంలో ఇస్రాయేల్ ప్రజలు యెహోవామీద తిరుగబడేలా చేసినవారు వీరే గదా! వీరివల్లేగా యెహోవా సమాజంలోకి విపత్తు వచ్చింది!
[17] గనుక చిన్నవాళ్ళలో ప్రతి మగవాణ్ణీ, పురుషుడి స్పర్శ ఎరిగిన ప్రతి స్త్రీనీ మీరు చంపాలి.
[18] పురుషుడితో పోని ఆడ పిల్లలందరినీ మీ కోసం బతకనివ్వాలి.
[19] మనిషిని చంపినవారూ, హతమైనవాళ్ళ శవాలను తాకినవారూ మీమధ్య ఉన్నారు గదా! అలాంటి మీరు ఏడు రోజులు శిబిరం బయట ఉండాలి. మూడో రోజున, ఏడోరోజున మీరు మిమ్మల్నీ మీరు చెరపట్టినవాళ్ళనూ పవిత్రం చేసుకోవాలి.
[20] అంతేగాక బట్టలన్నీ చర్మంతో చేసిన వస్తువులన్నీ మేక వెండ్రుకలతో చేసిన వస్తువులన్నీ కొయ్య వస్తువులన్నీ కూడా పవిత్రం చేయాలి.”
[21] యుద్ధానికి వెళ్ళిన సైనికులతో ఎలియాజరుయాజి ఇలా అన్నాడు: “యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన చట్టం ఇది:
[22] మంటలచేత చెడని ప్రతి వస్తువూ – అది బంగారం కానివ్వండి, వెండి, కంచు, ఇనుము, తగరం, సీసం కానివ్వండి –
[23] శుద్ధం అయ్యేలా మీరు దానిని మంటల్లో వేసి తీయాలి. అశుద్ధతను తొలగించే నీళ్ళతో కూడా ఆ వస్తువును శుద్ధం చేయాలి. అయితే మంటల చేత చెడిపోయే ప్రతి వస్తువునూ నీళ్ళలో వేసి తీయాలి.
[24] ఏడో రోజున మీరు బట్టలు ఉతుక్కొని శుద్ధం అవుతారు. ఆ తరువాత శిబిరంలోకి రావచ్చు”.
[25] యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
[26] “నీవూ ఎలియాజరుయాజీ సమాజంలో పూర్వీకుల వంశాల నాయకులూ ఈ విధంగా చేయాలి – ప్రజలు బందీలుగా పట్టినవాళ్ళనూ దోచుకొన్న జంతువులనూ అంతా లెక్కించాలి.
[27] రెండు భాగాలుగా చేయాలి. యుద్ధానికి సైన్యంలో వెళ్ళినవారికి సగం, సమాజమంతటికీ సగం పంచిపెట్టాలి.
[28] అప్పుడు యుద్ధానికి వెళ్ళిన సైనికులమీద యెహోవాకు పన్ను కట్టాలి. ఆ వ్యక్తులలో, పశువులలో, గాడిదలలో, గొర్రెమేకలలో అయిదు వందలకు ఒకటి ప్రకారం ఆ సైనికుల సగంలోనుంచి తీసుకొని
[29] యెహోవాకు అర్పణగా ఎలియాజరుయాజికి ఇవ్వాలి.
[30] ఇస్రాయేల్ ప్రజల సగంనుంచి వ్యక్తులలో గానీ అన్ని రకాల జంతువులలో గానీ – పశువులు కానివ్వండి, గాడిదలు, గొర్రెమేకలు కానివ్వండి – యాభైకి ఒకటి ప్రకారం తీసుకొని యెహోవా నివాసం బాధ్యత వహించిన లేవీ గోత్రికులకివ్వాలి.”
[31] యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే మోషే, ఎలియాజరుయాజి చేశారు.
[32] సైనికులు తమ కోసం ఉంచుకొన్న దోపిడీ సొమ్ము గాక వారు కొల్లపెట్టినది ఆరు లక్షల డెబ్భై అయిదు వేల గొర్రెమేకలూ
[33] డెబ్భై రెండు వేల పశువులూ
[34] అరవై యొక్క వేల గాడిదలూ
[35] పురుషుడి స్పర్శ ఎరగని ముప్ఫయి రెండు వేలమంది ఆడవారూ.
[36] ఆ మొత్తంలో సగం యుద్ధానికి వెళ్ళినవారికి చెందినది. వారికి చెందిన గొర్రెమేకల లెక్క మూడు లక్షల ముప్ఫయి ఏడు వేల అయిదు వందలు.
[37] వాటిలో యెహోవాకు చెల్లిన సుంకం ఆరు వందల డెబ్భై అయిదు.
[38] పశువులు ముప్ఫయి ఆరు వేలు. వాటిలో యెహోవా సుంకం డెబ్భై రెండు.
[39] గాడిదలు ముప్ఫయి వేల అయిదు వందలు. వాటిలో యెహోవా సుంకం అరవై ఒకటి.
[40] జనం పదహారు వేలమంది. వాళ్ళలో యెహోవా సుంకం ముప్ఫయి ఇద్దరు.
[41] యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టు మోషే ఆ సుంకం యెహోవాకు అర్పణగా యాజి అయిన ఎలియాజరుకు ఇచ్చాడు.
[42] సైనికులదగ్గర సగం తీసుకొని మోషే ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు.
[43] సమాజానికి చెందిన ఆ సగం మూడు లక్షల ముప్ఫయి ఏడు వేల అయిదు వందల గొర్రెమేకలూ
[44] ముప్ఫయి ఆరు వేల పశువులూ
[45] ముప్ఫై వేల అయిదు వందల గాడిదలూ
[46] పదహారు వేలమంది వ్యక్తులూ.
[47] ఇస్రాయేల్ ప్రజలకు వచ్చిన సగంనుంచి జనంలో గానీ జంతువులలో గానీ – యాభైకి ఒకటి ప్రకారం తీసుకొని మోషే యెహోవా నివాసం బాధ్యత వహించిన లేవీవారికి ఇచ్చాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే చేశాడు.
[48] అప్పుడు ఆ సేనానాయకులు (వేయిమందికి లేక వందమందికి అధిపతులు) మోషే దగ్గరికి వచ్చి ఇలా అన్నారు:
[49] “మీ సేవకులైన మేము మా చేతికింద ఉన్న సైనికుల మొత్తం లెక్కించాం. మాలో ఒక్కడైనా మొత్తానికి తక్కువ కాలేదు.
[50] గనుక మేము యెహోవాకు అర్పణ తెచ్చాం. మాకోసం యెహోవా సన్నిధానంలో ప్రాయశ్చిత్తం కలిగేలా, మాలో ప్రతి ఒక్కరికీ దొరికిన బంగారు నగలూ గొలుసులూ గాజులూ ఉంగరాలూ పోగులూ పతకాలూ అర్పణగా యెహోవా దగ్గరికి తెచ్చాం.”
[51] బంగారంతో చేసిన ఆ ఆభరణాలను మోషే, ఎలియాజరుయాజి వారిదగ్గర తీసుకొన్నారు.
[52] వేయిమందికి లేక వందమందికి అధిపతులు యెహోవాకు అర్పణగా తెచ్చిన బంగారమంతా పదహారు వేల ఏడు వందల యాభై తులాలు.
[53] ఆ సైనికులలో ప్రతి ఒక్కడూ తనమట్టుకు తాను కొల్లసొమ్ము తెచ్చుకొనేవాడు.
[54] వేయిమందికి లేక వందమందికి అధిపతుల దగ్గర మోషే, ఎలియాజరుయాజి ఆ బంగారం తీసుకొని యెహోవా సన్నిధానంలో ఇస్రాయేల్‌ప్రజలకు స్మృతిచిహ్నంగా సన్నిధిగుడారంలో ఉంచారు.