Skip to content
Opens in a new window

[1] యెహోవా యెరికోకు ఎదురుగా, యొర్దాను దగ్గర ఉన్న మోయాబు మైదానాల ప్రాంతంలో మోషేతో ఇలా అన్నాడు:

[2] “ఇస్రాయేల్ ప్రజలు తమకు వచ్చే వారసత్వంలో లేవీ గోత్రికులకు నివసించడానికి పట్టణాలు ఇవ్వాలని వారికి ఆజ్ఞాపించు. ఆ పట్టణాల చుట్టూరా ఉన్న పచ్చిక మైదానాలను కూడా లేవీ గోత్రికులకివ్వాలి.

[3] నివసించడానికి ఆ పట్టణాలు వారికి ఉంటాయి. వాటి పచ్చిక మైదానాలు వారి పశువులకూ మందలకూ వారి జంతువులన్నిటికీ ఉంటాయి.

[4] మీరు లేవీగోత్రికులకిచ్చే పట్టణాల గోడల దగ్గరనుంచి వెయ్యి మూరల దూరం, గోడల చుట్టూ ఆ పచ్చి మైదానాలు ఉండాలి.

[5] మీరు ఆ పట్టణాల వెలుపల తూర్పు దిక్కున రెండు వేల మూరలనూ దక్షిణ దిక్కున రెండువేల మూరలనూ పడమటి దిక్కున రెండు వేల మూరలనూ ఉత్తరదిక్కున రెండు వేల మూరలనూ కొలత తీసుకోవాలి. అది వారి పట్టణాలకు మైదానాలుగా ఉంటుంది. పట్టణం మధ్యలో ఉంటుంది.

[6] “మీరు లేవీ గోత్రికులకిచ్చే పట్టణాలలో ఆరు శరణు స్థలాలుగా ఉండాలి. మనిషిని చంపినవాడు పారిపోగల పట్టణాలుగా వాటిని నియమించాలి. ఆ పట్టణాలు గాక నలభై రెండు పట్టణాలను వారికివ్వాలి.

[7] వాటి వాటి పచ్చిక మైదానాలతోపాటు మీరు లేవీ గోత్రికులకు ఇవ్వవలసిన పట్టణాలన్నీ నలభై ఎనిమిది.

[8] మీరు ఇచ్చే పట్టణాలు ఇస్రాయేల్ వారసత్వంలో నుంచి ఇవ్వాలి. ప్రతి గోత్రంవారు వారి వారసత్వం ప్రకారం వారి పట్టణాలలో కొన్ని లేవీ గోత్రికులకు ఇవ్వాలి. మీరు ఎక్కువమంది మధ్యలో ఎక్కువ పట్టణాలను, తక్కువమంది మధ్యలో తక్కువ పట్టణాలను ఎన్నుకోవాలి.”

[9] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,

[10] “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – మీరు యొర్దాను దాటి కనాను వెళ్ళిన తరువాత

[11] శరణు పట్టణాలుగా ఉండడానికి కొన్ని పట్టణాలను ఎన్నుకోవాలి. పొరపాటున మనిషిని చంపినవారు వాటిలోకి పారిపోవచ్చు.

[12] అలా మనిషిని చంపినవాడు తీర్పుకు గురి కావడానికి సమాజం ముందు నిలబడేవరకు మరణశిక్ష పొందకూడదు, గనుక చంపబడ్డ మనిషి సమీప బంధువుడు పగతీర్చుకొనే అవకాశం ఏమీ లేకుండా ఆ పట్టణాలు శరణు స్థలాలుగా ఉండాలి.

[13] మీరు శరణు స్థలాలుగా ఆరు పట్టణాలను నియమించాలి.

[14] వాటిలో యొర్దాను ఇవతల మూడు పట్టణాలను నియమించాలి. అవి మీకు శరణు పట్టణాలుగా ఉంటాయి.

[15] పొరపాటున మనిషిని చంపినవాడెవడైనా – అతడు ఇస్రాయేల్‌వాడు కానివ్వండి, విదేశీయుడు కానివ్వండి, మీ మధ్య నివసించేవాడు ఎవడైనా కానివ్వండి– అతడు పారిపోవడానికి ఆ ఆరు పట్టణాలు శరణు స్థలాలుగా ఉంటాయి.

[16] “ఎవడైనా మనిషిని ఇనుప పనిముట్టుతో కొడితే ఆ మనిషి చనిపోతే, కొట్టినవాడు హంతకుడు. ఆ హంతకుడు మరణశిక్ష పొందితీరాలి.

[17] ఎవడైనా మనిషిని రాయితో కొడితే, ఆ మనిషి చనిపోతే, కొట్టినవాడు హంతకుడు. ఆ హంతకుడు మరణశిక్ష పొందితీరాలి.

[18] ఎవడైనా మనిషిని చేతికర్రతో కొడితే, ఆ మనిషి చనిపోతే, కొట్టినవాడు హంతకుడు. ఆ హంతకుడు మరణశిక్ష పొందితీరాలి.

[19] హతమైనవాడి విషయం పగతీర్చుకోదలచే అతడి సమీప బంధువుడు ఆ హంతకుణ్ణి చంపాలి. వాణ్ణి కనుగొంటే వాణ్ణి చంపాలి.

[20] ఎవడైనా మనిషిని పగపట్టి పొడిచినా, పొంచివుండి అతడిమీద ఏదైనా వేసినా,

[21] ద్వేషభావంతో చేతితో అతణ్ణి కొట్టినా, ఆ మనిషి చనిపోతే, అలా చేసినవాడు హంతకుడు. ఆ హంతకుడు మరణశిక్ష పొందితీరాలి. హతమైనవాడి విషయం పగతీర్చుకోదలచే అతడి సమీప బంధువుడు ఆ హంతకుణ్ణి కనుగొంటే వాణ్ణి చంపాలి.

[22] “కాని, పగపట్టక హఠాత్తుగా మనిషిని పొడిచినా, పొంచివుండక అతడిమీద ఏదైనా వేసినా,

[23] అతణ్ణి చూడక అతడిమీద రాయి పడవేసినా దెబ్బతిన్నవాడు చనిపోతే, అతణ్ణి చంపినవాడు అతనిమీద పగపట్టనివాడు, హాని చేయదలచనివాడు.

[24] గనుక సమాజం ఈ న్యాయనిర్ణయాల ప్రకారం చంపినవాడికీ హత్య విషయం పగతీర్చుకోదలచే సమీప బంధువుడికీ మధ్య తీర్పు తీర్చాలి.

[25] పగ తీర్చుకొనేవాడి చేతిలోనుంచి సమాజం మనిషిని చంపినవాణ్ణి విడిపించాలి. అతడు ఆశ్రయాన్ని కోరుతూ పారిపోయిన శరణు పట్టణానికి సమాజంవారు అతణ్ణి మళ్ళీ పంపించాలి. పవిత్ర తైలంతో అభిషేకం పొందిన ప్రముఖ యాజి చనిపోయేవరకు మనిషిని చంపిన ఆ వ్యక్తి ఆ శరణు పట్టణంలోనే ఉండిపోవాలి.

[26] ఒక వేళ చంపినవాడు తాను పారిపోయిన శరణు పట్టణం సరిహద్దులను ఎప్పుడైనా దాటిపోతాడనుకోండి.

[27] శరణు పట్టణం సరిహద్దుల వెలుపల ఉన్నప్పుడు పగతీర్చుకొనేవాడు అతణ్ణి కనుగొంటే, పగతీర్చుకొనేవాడు అతణ్ణి చంపినా హత్య దోషం ఉండదు.

[28] ఎందుకంటే, ప్రముఖ యాజి చనిపోయేవరకు అతడు శరణు పట్టణంలోనే ఉండిపోవాలి. ప్రముఖయాజి చనిపోయిన తరువాత చంపినవాడు తన ఆస్తి ఉన్న స్వస్థలానికి తిరిగి వెళ్ళవచ్చు.

[29] మీరు ఎక్కడ నివసించినా, మీ తరతరాలకూ, ఈ న్యాయనిర్ణయం అనుసరించాలి.

[30] “ఎవడైనా మనిషిని హత్య చేస్తే సాక్షుల నోటి మాటమీద ఆ హంతకుడికి మరణశిక్ష విధించాలి. ఒకే సాక్షి మాటమీద ఎవరికీ మరణశిక్ష విధించకూడదు.

[31] చావతగ్గ హంతకుడి ప్రాణానికి బదులుగా విడుదల వెలను అంగీకరించకూడదు. వాడికి మరణశిక్ష విధించితీరాలి.

[32] అంతేగాక, యాజి చనిపోయేముందు శరణు పట్టణానికి పారిపోయినవాడు తిరిగి వచ్చి స్వస్థలంలో నివసించేలా అతణ్ణి విడిపించే వెలను అంగీకరించకూడదు.

[33] మీరు ఉండే దేశాన్ని అపవిత్రం చేయకూడదు. రక్తపాతం దేశాన్ని అపవిత్రం చేస్తుంది. దేశంలో రక్తపాతం చేసినవాణ్ణి చంపడంవల్లే దేశానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతే గాని మరి దేనివల్లా కలగదు.

[34] నేను ఆ దేశం మధ్య నివసిస్తాను. మీరు నివసించే ఆ దేశాన్ని అశుద్ధం చేయకూడదు. నేను యెహోవాను. ఇస్రాయేల్ ప్రజల మధ్య నివసించేవాడను.”

సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు) — Chapters