Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్‌ప్రజలు ఈజిప్ట్‌దేశంనుంచి వచ్చిన రెండో సంవత్సరం రెండో నెల మొదటి తేది, సీనాయి ఎడారిలో సన్నిధిగుడారంలో, యెహోవా మోషేతో ఇలా అన్నాడు:

[2] “ఇస్రాయేల్ సర్వసమాజ జనాభా లెక్కలు వారి వారి వంశాల ప్రకారం, వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం, నీవూ అహరోనూ వ్రాయించాలి.

[3] ఇస్రాయేల్ ప్రజలలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి యుద్ధానికి వెళ్ళతగ్గ మగవారందరి పేర్లు, వారి వారి సేనల ప్రకారం నమోదు చేయాలి.

[4] మీరు అలా చేసేటప్పుడు ఒక్కొక్క గోత్రంలో తన పూర్వీకుల కుటుంబంలో, ఒక్కొక్క నాయకుడు మీతోకూడా ఉండాలి.

[5] మీకు తోడ్పడవలసిన ఆ మనుషుల పేర్లు ఇవి: రూబేను గోత్రంలో షెదేయూర్ కొడుకు ఏలీసూర్‌;

[6] షిమ్యోను గోత్రంలో సూరీషద్దయి కొడుకు షెలుమీయేల్‌;

[7] యూదా గోత్రంలో అమ్మీనాదాబు కొడుకు నయస్సోను;

[8] ఇశ్శాకారు గోత్రంలో సుయారు కొడుకు నెతనేల్‌;

[9] జెబులూను గోత్రంలో హేలోను కొడుకు ఏలీయాబు;

[10] యోసేపు సంతానంలో, అంటే ఎఫ్రాయిం గోత్రంలో అమీహూదు కొడుకు ఎలీషామా, మనష్షే గోత్రంలో పెదాసూరు కొడుకు గమలీయేల్‌;

[11] బెన్యామీను గోత్రంలో గిద్యోనీ కొడుకు అబీదాను;

[12] దాను గోత్రంలో అమీషద్దాయి కొడుకు అహీయెజరు;

[13] ఆషేరు గోత్రంలో ఒక్రాను కొడుకు పగీయేల్‌;

[14] గాదు గోత్రంలో దెయూవేల్ కొడుకు ఎలాసాఫ్‌;

[15] నఫ్తాలి గోత్రంలో ఏనాను కొడుకు అహీరా.

[16] వీరు సమాజంలో పేరు పొందినవారు, వారి వారి పూర్వీకుల గోత్రాలలో ప్రధానులు, ఇస్రాయేల్ వంశాలకు పెద్దలు.

[17] ఆ పేర్లున్నవారిని మోషే అహరోనులు పిలిచి, రెండో నెల మొదటి తేది సర్వసమాజాన్ని సమకూర్చారు.

[18] ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయస్సు ఉన్నవారు వారి వారి వంశాల ప్రకారం, వారి వారి వంశాలనూ పూర్వీకుల కుటుంబాలనూ పేర్లనూ సంఖ్యనూ తెలియజేశారు.

[19] యెహోవా అతడికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే సీనాయి ఎడారిలో మోషే వారిని లెక్కించాడు.

[20] ఇస్రాయేల్‌కు పెద్ద కొడుకు రూబేను సంతానంలో ఇరవై ఏళ్లు మొదలుకొని పై వయసు ఉండి యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు.

[21] రూబేను గోత్రంలో అలాంటివారి సంఖ్య నలభై ఆరు వేల అయిదు వందలు.

[22] షిమ్యోను సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు.

[23] షిమ్యోను గోత్రంలో అలాంటి వారి సంఖ్య యాభై తొమ్మిది వేల మూడు వందలు.

[24] గాదు సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు.

[25] గాదు గోత్రంలో అలాంటి వారి సంఖ్య నలభై అయిదు వేల ఆరు వందల యాభై.

[26] యూదా సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు.

[27] యూదా గోత్రంలో అలాంటివారి సంఖ్య డెభ్భైనాలుగు వేల ఆరు వందలు.

[28] ఇశ్శాకారు సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు.

[29] ఇశ్శాకారు గోత్రంలో అలాంటివారి సంఖ్య యాభైనాలుగు వేల నాలుగు వందలు.

[30] జెబూలూను సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు.

[31] జెబులూను గోత్రంలో అలాంటి వారి సంఖ్య యాభై ఏడు వేల నాలుగు వందలు.

[32] యోసేపు సంతానంలో, అంటే ఎఫ్రాయిం సంతానంలో, ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు.

[33] ఎఫ్రాయిం గోత్రంలో అలాంటి వారి సంఖ్య నలభై వేల అయిదు వందలు.

[34] మనష్షే సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు.

[35] మనష్షే గోత్రంలో అలాంటి వారి సంఖ్య ముప్ఫయి రెండువేల రెండు వందలు.

[36] బెన్యామీను సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు.

[37] బెన్యామీను గోత్రంలో అలాంటివారి సంఖ్య ముఫ్పై అయిదు వేల నాలుగు వందలు.

[38] దాను సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు.

[39] దాను గోత్రంలో అలాంటివారి సంఖ్య అరవై రెండు వేల ఏడు వందలు.

[40] ఆషేరు సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు.

[41] ఆషేరు గోత్రంలో అలాంటివారి సంఖ్య నలభై ఒక్క వేల అయిదు వందలు.

[42] నఫ్తాలి సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళ తగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు.

[43] నఫ్తాలి గోత్రంలో అలాంటి వారి సంఖ్య యాభై మూడు వేల నాలుగు వందలు.

[44] వీరు నమోదైనవారు. నమోదు చేసినది మోషే, అహరోను, ఇస్రాయేల్‌ప్రజలలో తమ తమ పూర్వీకుల కుటుంబాలకు ప్రతినిధులుగా ఉన్న పన్నెండుగురు ప్రధానులు.

[45] ఇస్రాయేల్‌ప్రజలలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గవారు తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం నమోదయ్యారు.

[46] నమోదయిన వారందరి సంఖ్య ఆరు లక్షల మూడు వేల అయిదు వందల యాభై.

[47] అయితే లేవీగోత్రికులు తమ పూర్వీకుల గోత్రం ప్రకారం వారితో పాటు నమోదు కాలేదు.

[48] అంతకు ముందు యెహోవా మోషేతో ఇలా అన్నాడు:

[49] “నీవు లేవీ గోత్రాన్ని నమోదు చేయకూడదు. ఇస్రాయేల్‌ప్రజ జనాభా లెక్కించేటప్పుడు వారి జనాభా లెక్కించకూడదు.

[50] శాసనాల గుడారం మీద, దాని సామానంతటిమీద, దానికి చెందిన వాటన్నిటిమీద లేవీ గోత్రికులను నియమించు. వారే దైవనివాసాన్ని, దాని సామానంతా మోయాలి. వారు దైవనివాసాన్ని చూచుకోవాలి. దాని చుట్టూరా తమ డేరాలు వేసుకోవాలి.

[51] బయలుదేరే సమయంలో లేవీవారే దైవనివాసాన్ని విప్పాలి. అది దిగితే లేవీవారే దాన్ని వేయాలి. లేవీ గోత్రికుడు కానివాడెవడైనా దానిని సమీపిస్తే వాడు మరణశిక్ష పొందాలి.

[52] ఇస్రాయేల్ ప్రజలో ప్రతి ఒక్కరూ వారి వారి సేనల ప్రకారం వారి వారి శిబిరంలో వారి వారి ధ్వజం దగ్గర డేరాలు వేయాలి.

[53] అయితే ఇస్రాయేల్ ప్రజల సమాజం మీదికి నా కోపం రాకుండేలా లేవీగోత్రికులు మాత్రమే శాసనాల దైవనివాసం చుట్టూరా దగ్గరగా తమ డేరాలు వేయాలి; శాసనాల దైవ నివాసాన్ని కాపాడాలి.”

[54] యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇస్రాయేల్ ప్రజలు చేశారు.

సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు) — Chapters