[1] యోసేపు కొడుకుల వంశాలలో గిలాదు వంశీయులు ఉండేవారు (గిలాదు మాకీరు కొడుకు, మనష్షే మనుమడు). ఆ వంశీయుల పెద్దలు మోషే దగ్గరికి వచ్చి మోషేతో ఇస్రాయేల్ ప్రజల పూర్వీకుల వంశాల నాయకులతో మాట్లాడి ఇలా అన్నారు:
[2] “చీట్లు వేసి ఆ దేశాన్ని ఇస్రాయేల్ ప్రజలకు వారసత్వంగా పంచిపెట్టాలని యెహోవా మా యజమానులైన మీకు ఆజ్ఞాపించాడు గదా. అంతేగాక, మా బంధువుడు సెలోపెహాదు వారసత్వాన్ని అతడి కూతుళ్ళకివ్వాలని మా యజమానులైన మీరు యెహోవాచేత ఆజ్ఞ పొందారు.
[3] ఒకవేళ అతడి కూతుళ్ళు ఇస్రాయేల్ ప్రజలలో వేరే గోత్రాలవారిలో ఎవరినైనా పెళ్ళి చేసుకుంటారనుకోండి. అలాంటప్పుడు వారి వారసత్వం మా పూర్వీకుల వారసత్వంలో లేకుండా వారు చేరే గోత్రం వారసత్వంతో కలిసిపోతుంది. చీట్లప్రకారం మాకు దొరికిన వారసత్వంలో నుంచి విడిపోతుందన్నమాట.
[4] ఇస్రాయేల్ ప్రజలకు మహోత్సవ సంవత్సరం వచ్చేటప్పుడు వారి వారసత్వం వారు చేరే గోత్ర వారసత్వంలో కలిసిపోతుంది. ఈ విధంగా మా పూర్వీకుల వారసత్వంలో వారి వారసత్వం లేకుండా పోతుంది.”
[5] యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే ఇస్రాయేల్ ప్రజలను ఇలా ఆదేశించాడు: “యోసేపు కొడుకుల గోత్రికులు చెప్పినది న్యాయమే.
[6] యెహోవా సెలోపెహాదు కూతుళ్ళను గురించి ఆజ్ఞాపించిన మాట ఇదే: వారు తమకు ఇష్టమైనవారిని పెళ్ళి చేసుకోవచ్చు గాని, వారి తండ్రి గోత్ర వంశంలోనే పెళ్ళి చేసుకోవాలి.
[7] ఇస్రాయేల్ ప్రజల వారసత్వం ఒక గోత్రంలోనుంచి ఇంకో గోత్రంలోకి పోకూడదు. ఇస్రాయేల్ ప్రజలలో ప్రతి ఒక్కరూ తమ పూర్వీకుల గోత్ర వారసత్వాన్ని తమ వంశంలోనే ఉంచుకోవాలి.
[8] ఇస్రాయేల్ ప్రజలు వారి వారి పూర్వీకుల వారసత్వం వారి వారి స్వాధీనంలో ఉండిపోయేలా ఇస్రాయేల్ ప్రజల గోత్రాలలో వారసత్వం ఉన్న ప్రతి అమ్మాయీ తన తండ్రి గోత్రంలోనే పెళ్ళి చేసుకోవాలి.
[9] వారసత్వం ఒక గోత్రంనుంచి ఇంకో గోత్రంలోకి పోకూడదు. ఇస్రాయేల్ ప్రజల గోత్రాలవారు తమ తమ వారసత్వాన్ని తమ వంశంలోనే ఉంచుకోవాలి.”
[10] యెహోవా మోషేకు ఆజ్ఞ ఇచ్చినట్టే సెలోపెహాదు కూతుళ్ళు చేశారు.
[11] సెలోపెహాదు కూతుళ్ళైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ పినతండ్రి కొడుకులను వివాహమాడారు.
[12] యోసేపు కొడుకు మనష్షే వంశీయులను వారు వివాహమాడడంవల్ల వారి వారసత్వం వారి తండ్రి గోత్ర వంశంలోనే నిలిచింది.
[13] యెరికోకు ఎదురుగా యొర్దాను దగ్గర ఉన్న మోయాబు మైదానాల ప్రాంతంలో యెహోవా మోషేచేత ఇస్రాయేల్ ప్రజలకు ఆదేశించిన ఆజ్ఞలూ న్యాయ నిర్ణయాలూ ఇవే.