Skip to content
Opens in a new window

[1] యెహోవా మోషేతో అన్నాడు,

[2] “నీవు ఇస్రాయేల్‌ ప్రజలను ఈ విధంగా ఆదేశించు – మీరు కనానులో ప్రవేశించిన తరువాత మీకు వారసత్వంగా దొరికే ఆ దేశం సరిహద్దులు ఇవి:

[3] మీ దక్షిణప్రదేశం ఎదోం సరిహద్దు దగ్గర ఉన్న సీన్ ఎడారి మొదలుకొని ఉంటుంది. మీ దక్షిణ సరిహద్దు తూర్పు దిక్కుగా ఉప్పుసరస్సు చివరవరకు ఉంటుంది.

[4] అక్కడనుంచి మీ సరిహద్దు దక్షిణ దిక్కుగా అక్రబ్బీం కనుమకు తిరిగి, సీన్ వరకు ఉంటుంది. కాదేష్‌బర్నేయాకు దక్షిణంగా వ్యాపించి హసర్ అద్దారుకు, అక్కడనుంచి అస్మోనువరకు పోతుంది.

[5] అస్మోనునుంచి ఈజిప్ట్‌వాగువరకు ఉంటుంది. అక్కడనుంచి మహా సముద్రంవరకు వ్యాపిస్తుంది.

[6] “పడమటి సరిహద్దు మహా సముద్రం. అదే మీకు పడమటి సరిహద్దు.

[7] “ఉత్తరంగా మీ సరిహద్దును మహా సముద్రంనుంచి హోర్ కొండవరకు,

[8] హోర్ కొండనుంచి హమాతు కనుమవరకు ఏర్పరచుకోవాలి. ఆ సరిహద్దు సెదాదువరకు వ్యాపిస్తుంది.

[9] అక్కడనుంచి సరిహద్దు జిప్రోనువరకు ఉంటుంది. దాని చివర హసర్ ఎనాను దగ్గర ఉంటుంది. అదే మీకు ఉత్తరం సరిహద్దు.

[10] “తూర్పు సరిహద్దును హసర్ ఎనానునుంచి షెపాం వరకు మీరు ఏర్పరచుకోవాలి.

[11] షెపాంనుంచి సరిహద్దు అయీనుకు తూర్పుగా ఉన్న రిబ్లా వరకు ఉంటుంది. ఆ సరిహద్దు దిగి కిన్నెరెతు సరస్సు తూర్పు ఒడ్డున ఆనుకొని ఉంటుంది.

[12] ఆ సరిహద్దు యొర్దానుకు పోతుంది. దాని చివర ఉప్పుసరస్సు. చుట్టూరా ఉన్న ఈ సరిహద్దులలో ఉన్న దేశం మీది అవుతుంది.”

[13] మోషే ఇస్రాయేల్ ప్రజలను ఇలా ఆదేశించాడు: “చీట్లు వేసి మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం ఇది. యెహోవా తొమ్మిది గోత్రాలకూ అర్ధ గోత్రానికీ ఈ దేశాన్ని ఇవ్వాలని ఆజ్ఞాపించాడు.

[14] రూబేను గోత్రికులూ గాదు గోత్రికులూ మనష్షే అర్ధగోత్రంవారూ వారి వారి పూర్వీకుల వంశాల ప్రకారం వారి వారి వారసత్వం పొందారు.

[15] ఆ రెండు గోత్రాలవారూ అర్ధ గోత్రంవారూ యెరికోకు ఎదురుగా యొర్దానుకు పొద్దుపొడిచే దిక్కున ఆ తూర్పు ప్రదేశంలో వారి వారి వారసత్వం పొందారు.”

[16] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,

[17] “ఆ దేశాన్ని మీకు వారసత్వంగా పంచి పెట్టవలసినవారు యాజి అయిన ఎలియాజరు, నూను కొడుకు యెహోషువ.

[18] అంతేగాక, ఆ దేశాన్ని మీకు వారసత్వంగా పంచిపెట్టడానికి ప్రతి గోత్రంలోనుంచీ నాయకుణ్ణి కూడా ఎన్నుకోవాలి.

[19] ఆ నాయకుల పేర్లు: యూదాగోత్రంలో యెఫున్నెకొడుకు కాలేబు;

[20] షిమ్యోను వంశీయుల గోత్రంలో అమీహూదు కొడుకు షెమూయేల్‌;

[21] బెన్యామీను గోత్రంలో కిస్లోను కొడుకు ఎలీదాదు;

[22] దాను వంశీయుల గోత్రంలో యొగ్లి కొడుకు బుక్కీ నాయకుడు;

[23] యోసేపు పుత్రులలో, మనష్షే వంశీయుల గోత్రంలో ఏఫోదు కొడుకు హన్నీయేల్ నాయకుడు;

[24] ఎఫ్రాయిం వంశీయుల గోత్రంలో షిప్తాను కొడుకు కెమూయేల్ నాయకుడు;

[25] జెబూలూను వంశీయుల గోత్రంలో పర్నాకు కొడుకు ఎలీషాపాను నాయకుడు;

[26] ఇశ్శాకారు వంశీయుల గోత్రంలో అజాను కొడుకు పల్తీయేల్ నాయకుడు;

[27] అషేరు వంశీయుల గోత్రంలో షెలోమి కొడుకు అహీహూదు నాయకుడు;

[28] నఫ్తాలి వంశీయుల గోత్రంలో అమీహూదు కొడుకు పదహేల్ నాయకుడు.

[29] కనానుదేశంలో ఇస్రాయేల్ ప్రజలకు వారసత్వం పంచిపెట్టడానికి యెహోవా ఆజ్ఞాపించినవారు వీరే.

సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు) — Chapters