Skip to content
Opens in a new window

[1] యెహోవా సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడిన కాలంలో అహరోను మోషేల వంశవృక్షాలు ఇవి:

[2] అహరోను కొడుకుల పేర్లు నాదాబు (మొదట పుట్టినవాడు), అబీహు, ఎలియాజరు, ఈతామారు.

[3] యాజులుగా అభిషేకం పొందిన అహరోను కొడుకుల పేర్లు అవే. అతడు వారిని యాజులుగా ప్రతిష్ఠించాడు.

[4] నాదాబు, అబీహు సీనాయి ఎడారిలో యెహోవా సన్నిధానంలో నిషిద్ధమైన నిప్పు అర్పించినందుకు వారు యెహోవా సన్నిధానంలో చచ్చారు. వారికి సంతానం కలుగలేదు. తరువాత ఎలియాజరు, ఈతామారు వారి తండ్రి అహరోను ఎదుట యాజులుగా సేవ చేసేవారు.

[5] యెహోవా మోషేతో ఇలా అన్నాడు:

[6] “లేవీగోత్రికులను తీసుకువచ్చి అహరోను ఎదుట నిలబెట్టు. వారు అతడికి పరిచారకులుగా ఉండాలి.

[7] వారు సన్నిధిగుడారం ఎదుట దైవనివాసానికి సంబంధించిన సేవ పూనుకొని అహరోనుకోసం సమాజమంతటికీ సేవ చేస్తారు.

[8] వారు దైవ నివాసానికి సంబంధించిన సేవ పూనుకొని ఇస్రాయేల్ ప్రజల కోసం సన్నిధిగుడారం సామానంతా కాపాడాలి.

[9] నీవు లేవీగోత్రికులను అహరోనుకూ అతడి కొడుకులకూ నియమించాలి. వారు ఇస్రాయేల్ ప్రజలలోనుంచి అహరోనుకు నియమితమైనవారు.

[10] నీవు అహరోనుకూ అతడి కొడుకులకూ యాజి పదవి అప్పగించాలి. వారే దాన్ని నిర్వహించాలి. దాన్ని చేయడానికి ఇంకెవరైనా సమీపిస్తే అతడు మరణశిక్షకు గురికావాలి.”

[11] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు:

[12] “ఈజిప్ట్ దేశస్థులలో మొదట పుట్టినవారినందరినీ నేను నాశనం చేసిన రోజున ఇస్రాయేల్‌ప్రజలలో మొదట పుట్టినవారందరినీ, వారి పశువులలో మొదట పుట్టినవాటన్నిటినీ నా కోసం ప్రతిష్ఠ చేసుకొన్నాను. వారు నావారు, అవి నావి. నేను యెహోవాను.

[13] ఇప్పుడు నేను ఇస్రాయేల్ ప్రజలలో మొదట పుట్టినవారందరికి బదులుగా లేవీ గోత్రికులను ఎన్నుకొంటున్నాను. లేవీగోత్రికులు నావారు.”

[14] సీనాయి ఎడారిలో యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,

[15] “లేవీగోత్రికులను వారి వారి పూర్వీకుల కుటుంబాల, వంశాల ప్రకారం నమోదు చేయించు. ఒక నెల మొదలుకొని పై వయసు గల మగవారందరినీ నమోదు చేయించు.”

[16] యెహోవా ఇచ్చిన ఆ ఆజ్ఞ ప్రకారమే మోషే వారిని నమోదు చేయించాడు.

[17] లేవీ కొడుకుల పేర్లు ఇవి: గెర్షోను, కహాతు, మెరారి.

[18] గెర్షోనువారి వంశకర్తల పేర్లు లిబ్నీ, షిమీ.

[19] కహాతు వారి వంశకర్తల పేర్లు అమ్రాం, ఇసహారు, హెబ్రోను, ఉజ్జీయేల్.

[20] మెరారివారి వంశకర్తల పేర్లు మాహలి, మూషి. వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం ఇవి లేవీ గోత్రికుల వంశాలు.

[21] గెర్షోను వంశస్థులు లిబ్నీవారు, షిమీవారు. గెర్షోను వంశంవారు వీరే.

[22] వారిలో ఒక నెల మొదలుకొని పై వయసు ఉండి నమోదైన మగవారందరి సంఖ్య ఏడు వేల అయిదు వందలు.

[23] గెర్షోనువారి కుటుంబాలు దైవనివాసం వెనుక, అంటే పడమటి దిక్కున మకాం చేయవలసినవారు.

[24] గెర్షోనువారికి నాయకుడు లాయేల్ కొడుకు ఎబయాసాఫ్.

[25] వారు సన్నిధిగుడారంలో వీటికోసం బాధ్యత వహించ వలసినవారు – దైవనివాసం, దాని పైకప్పు, సన్నిధిగుడారం ద్వారానికి ఉన్న తెర,

[26] ఆవరణ అడ్డతెరలు, దైవనివాసానికి బలిపీఠానికి చుట్టూరా ఉన్న ఆవరణద్వారం తెర, దాని త్రాళ్ళన్నీ.

[27] కహాతు వంశస్థులు అమ్రాంవారు, ఇసహారువారు, హెబ్రోనువారు, ఉజ్జీయేల్‌వారు. కహాతు వంశంవారు వీరే.

[28] వారిలో ఒక నెల మొదలుకొని పై వయసు ఉండి నమోదైనవారి సంఖ్య ఎనిమిది వేల ఆరు వందలు. వారు పవిత్ర స్థలంలోని వస్తువుల కోసం బాధ్యత వహించేవారు.

[29] కహాతు కుటుంబాలు దైవనివాసం ప్రక్కన దక్షిణదిక్కుగా మకాం చేయవలసినవారు.

[30] కహాతువారి నాయకుడు ఉజ్జీయేల్ కొడుకు ఎలీషాపాను.

[31] వారు బాధ్యత వహించవలసినవి ఏవంటే పెట్టె, బల్ల, సప్తదీపస్తంభం, వేదికలు, యాజులు సేవలో వినియోగించే పవిత్ర స్థల పాత్రలు, అడ్డతెర, దాని సేవకోసమైన సామానంతా.

[32] అహరోనుయాజి కొడుకు ఎలియాజరు లేవీవారి నాయకులకు నాయకుడు. పవిత్ర స్థలం విషయం బాధ్యత వహించేవారిమీద అతడు పైవిచారణకర్త.

[33] మెరారి వంశస్థులు మాహలివారు, మూషివారు. మెరారి వంశంవారు వీరే.

[34] వారిలో ఒక నెల మొదలుకొని పై వయసు ఉండి నమోదైన మగవారందరి సంఖ్య ఆరు వేల రెండు వందలు.

[35] మెరారివారి నాయకుడు అబీహాయిల్ కొడుకు సూరీయేల్. వారు దైవనివాసం దగ్గర ఉత్తరదిక్కున మకాం చేయవలసినవారు.

[36] మెరారివారు బాధ్యత వహించవలసినవి ఏవంటే దైవనివాసం పలకలు, దాని అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు, దానికి చెందిన అలాంటి సామానంతా,

[37] దాని చుట్టూరా ఉన్న ఆవరణ స్తంభాలు, వాటి దిమ్మలు, వాటి మేకులు, వాటి త్రాళ్ళు.

[38] దైవనివాసం ఎదుట, తూర్పుదిక్కున, సన్నిధిగుడారం ముందుగా, పొద్దు పొడిచే దిక్కున మకాం చేయవలసినవారు మోషే, అహరోను, అహరోను కొడుకులు. వీరు పవిత్ర స్థలం విషయం ఇస్రాయేల్‌ప్రజలకోసం బాధ్యత వహించవలసినవారు. ఇంకెవడైనా పవిత్ర స్థలాన్ని సమీపిస్తే ఆ వ్యక్తి మరణశిక్ష పొందాలి.

[39] యెహోవా మాట ప్రకారం మోషే అహరోనులు వారి వారి వంశాల ప్రకారం నమోదు చేయించిన లేవీగోత్రికుల సంఖ్య – అంటే ఒక నెల మొదలుకొని పైవయసు ఉన్న మగవారందరి సంఖ్య ఇరవై రెండు వేలు.

[40] యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇస్రాయేల్ ప్రజలలో ఒక నెల మొదలుకొని పై వయసు ఉండి, మొదట పుట్టిన మగవారందరి పేర్లు నమోదు చేయించు. వారి సంఖ్యను వ్రాయించు.

[41] ఇస్రాయేల్ ప్రజలలో మొదట పుట్టిన మగవారందరికి బదులుగా నీవు నాకోసం లేవీ గోత్రికులను ఎన్నుకోవాలి. పశువులలో మొదట పుట్టినవాటికి బదులుగా లేవీ వారి పశువులను ఎన్నుకోవాలి. నేను యెహోవాను”.

[42] యెహోవా ఇచ్చిన ఆజ్ఞప్రకారం మోషే ఇస్రాయేల్ ప్రజలలో మొదట పుట్టిన వారందరినీ నమోదు చేయించాడు.

[43] వారిలో నమోదైన వారి సంఖ్య – అంటే, ఒక నెల మొదలుకొని పై వయసు ఉండి, మొదట పుట్టిన మగవారందరి సంఖ్య ఇరవై రెండు వేల రెండు వందల డెబ్భైమూడు.

[44] అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు:

[45] “ఇస్రాయేల్‌ప్రజలలో మొదట పుట్టినవారందరికి బదులుగా లేవీగోత్రికులను, వారి పశువులకు బదులుగా లేవీగోత్రికుల పశువులను ఎన్నుకో. లేవీగోత్రికులు నా వారై ఉంటారు. నేను యెహోవాను.

[46] ఇస్రాయేల్ ప్రజలలో మొదట పుట్టినవారిలో లేవీవారికంటే రెండు వందల డెబ్భై ముగ్గురు ఎక్కువయ్యారు. వెల ఇచ్చి ఆ ఎక్కువైనవారిని విడిపించాలి.

[47] ఒక్కొక్కరికి అయిదేసి తులాల వెండి నీవు తీసుకోవాలి. అది పవిత్రస్థానం తులం ప్రకారం ఉండాలి. ఆ తులం ముప్ఫయి చిన్నాలు.

[48] వారిలో ఎక్కువైనవారి విడుదలకోసం జమ చేసిన డబ్బు, అహరోనుకూ అతడి కొడుకులకూ ఇవ్వాలి.”

[49] కనుక లేవీవారు విడిపించినవారికంటే ఆ ఎక్కువైనవారి విడుదల డబ్బును మోషే వసూలు చేశాడు.

[50] పవిత్రస్థానం తులం ప్రకారం వేయి మూడు వందల అరవై ఐదు తులాలు ఇస్రాయేల్ ప్రజలలో మొదట పుట్టిన వారి దగ్గర తీసుకొన్నాడు.

[51] యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞప్రకారం, యెహోవా చెప్పినట్టే, అతడు అహరోనుకూ అతడి కొడుకులకూ ఆ విడుదల డబ్బును ఇచ్చాడు.

సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు) — Chapters