[1] ఆ విపత్తు పోయిన తరువాత యెహోవా మోషేతోనూ యాజి అయిన అహరోను కొడుకు ఎలియాజరుతోనూ ఇలా చెప్పాడు:
[2] “మీరు ఇస్రాయేల్ ప్రజల సర్వసమాజంలో వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి యుద్ధానికి వెళ్ళతగ్గవారందరి జనాభా లెక్కలు వ్రాయించండి.”
[3] గనుక వారు మోయాబు మైదానాలలో యెరికో ఎదుట యొర్దాను ఒడ్డున ఉన్నప్పుడు మోషే, యాజి అయిన ఎలియాజరు వారితో ఇలా చెప్పారు:
[4] “యెహోవా మోషేకూ ఈజిప్ట్‌నుంచి వచ్చిన ఇస్రాయేల్ ప్రజలకూ ఆజ్ఞాపించినట్టు ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉన్నవారి పేర్లు నమోదు చేయాలి.”
[5] ఇస్రాయేల్‌కు పెద్ద కొడుకు రూబేను. రూబేను సంతతివారు హనోకు, హనోకు వంశీయులు; పల్లు, పల్లు వంశీయులు;
[6] హెస్రోను, హెస్రోను వంశీయులు; కర్మి, కర్మివంశీయులు.
[7] వీరంతా రూబేను వంశాలు. వారిలో నమోదైన వారి సంఖ్య నలభై మూడు వేల ఏడు వందల ముప్ఫయి.
[8] పల్లు కొడుకు ఏలీయాబు.
[9] ఏలీయాబు కొడుకులు నెమూయేల్, దాతాను, అబీరాం. ఈ దాతాను, అబీరాం సమాజంలో ఎన్నికైనవారై కోరహు బృందం వాళ్ళతో చేరి యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు, మోషే అహరోనులతో వాదించినవారు.
[10] ఆ బృందంవాళ్ళు చనిపోయినప్పుడు భూమి నోరు తెరచి వీరిని కోరహుతోపాటు మింగివేసింది. ఆ సమయంలోనే రెండు వందల యాభైమందిని మంటలు దహించివేశాయి. వారు హెచ్చరిక సూచనగా ఉన్నారు.
[11] కోరహు కొడుకులు అప్పుడు చావలేదు.
[12] షిమ్యోను సంతతివారు, వారి వంశాలప్రకారం, నెమూయేల్, నెమూయేల్ వంశీయులు; యామీను, యామీను వంశీయులు; యాకీను, యాకీను వంశీయులు;
[13] జెరహు, జెరహు వంశీయులు; షావూల్, షావూల్ వంశీయులు.
[14] ఇవి షిమ్యోను వారి వంశాలు. వారి సంఖ్య ఇరవై రెండు వేల రెండు వందలు.
[15] గాదు సంతతివారు, వారి వంశాల ప్రకారం, సెపోను, సెపోను వంశీయులు, హగ్గీ, హగ్గీ వంశీయులు; షూనీ, షూనీ వంశీయులు;
[16] ఓజని, ఓజని వంశీయులు; ఏరీ, ఏరీ వంశీయులు;
[17] ఆరోదు, ఆరోదు వంశీయులు; అరేతీ, అరేతీ వంశీయులు.
[18] ఇవి గాదువారి వంశాలు. వీరిలో నమోదైనవారి సంఖ్య నలభై వేల అయిదు వందలు.
[19] యూదా కొడుకులు ఏర్, ఓనాను. వీరిద్దరూ కనానుదేశంలో చనిపోయారు.
[20] యూదా సంతతివారు, వారి వంశాల ప్రకారం, షేలా, షేలా వంశీయులు; పెరెసు, పెరెసు వంశీయులు; జెరహు, జెరహు వంశీయులు.
[21] పెరెసు సంతతివారు హెస్రోను, హెస్రోను వంశీయులు; హామూల్, హామూల్ వంశీయులు;
[22] ఇవి యూదా వంశాలు. వారి సంఖ్య డెబ్భై ఆరు వేల అయిదు వందలు.
[23] ఇశ్శాకారు సంతతివారు, వారి వంశాల ప్రకారం, తోలా, తోలా వంశీయులు; పువ్వా, పువ్వా వంశీయులు;
[24] యాషూబ్, యాషూబ్ వంశీయులు; షిమ్రోను, షిమ్రోను వంశీయులు.
[25] ఇవి ఇశ్శాకారువారి వంశాలు. నమోదైనవారి సంఖ్య అరవై నాలుగు వేల మూడు వందలు.
[26] జెబూలూను సంతతివారు, వారి వంశాల ప్రకారం, సెరెదు, సెరెదు వంశీయులు; ఏలోను, ఏలోను వంశీయులు; యహలేల్, యహలేల్ వంశీయులు.
[27] ఇవి జెబూలూనువారి వంశాలు. నమోదైన వారి సంఖ్య అరవై వేల అయిదు వందలు.
[28] యోసేపు సంతతివారు, వారి వంశాలప్రకారం, మనష్షే, ఎఫ్రాయిం.
[29] మనష్షే సంతతివారు మాకీరు, మాకీరు వంశీయులు; (గిలాదు మాకీరు కొడుకు) గిలాదు, గిలాదు వంశీయులు.
[30] గిలాదు సంతతివారు ఈజరు, ఈజరు వంశీయులు; హెలకు, హెలకు వంశీయులు.
[31] అశ్రీయేల్, అశ్రీయేల్ వంశీయులు; షెకెం, షెకెం వంశీయులు;
[32] షెమీదా, షెమీదా వంశీయులు; హెపెరు, హెపెరు వంశీయులు.
[33] (హెపెరు కొడుకు సెలోపెహాదుకు కొడుకులు లేరు. కూతుళ్ళు జన్మించారు. సెలోపెహాదు కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా).
[34] ఇవి మనష్షేవారి వంశాలు. వారిలో నమోదైన వారి సంఖ్య యాభై రెండువేల ఏడు వందలు.
[35] ఎఫ్రాయిం సంతతివారు, వారి వంశాలప్రకారం, షూతలహు, షూతలహు వంశీయులు; బకేరు, బకేరు వంశీయులు; తాహను, తాహను వంశీయులు.
[36] షూతలహు సంతతివారు ఏరాను, ఏరాను వంశీయులు.
[37] ఇవి ఎఫ్రాయింవారి వంశాలు. వారిలో నమోదైనవారి సంఖ్య ముప్ఫయి రెండు వేల అయిదు వందలు. వారి వంశాల ప్రకారం వీరు యోసేపు సంతతివారు.
[38] బెన్యామీను సంతతివారు, వారి వంశాల ప్రకారం, బెల, బెల వంశీయులు; అష్బేల, అష్బేల వంశీయులు; అహీరాం, అహీరాం వంశీయులు;
[39] షూప్పం, షూప్పం వంశీయులు; హుప్పం, హుప్పం వంశీయులు.
[40] బెల సంతతివారు ఆర్డు, నయమాను, ఆర్డు వంశీయులు, నయమాను వంశీయులు.
[41] వారి వంశాల ప్రకారం వీరు బెన్యామీను సంతతివారు. వారిలో నమోదైనవారి సంఖ్య నలభై ఐదు వేల ఆరు వందలు.
[42] దాను సంతతివారు, వారి వంశాలప్రకారం, షూహాం, షూహాం వంశీయులు; వారి వంశాల ప్రకారం, వీరు దాను వంశీయులు.
[43] షూహాం వంశస్థులందరిలో నమోదైనవారి సంఖ్య అరవై నాలుగు వేల నాలుగు వందలు.
[44] ఆషేరు సంతతివారు, వారి వంశాలప్రకారం, యిమ్నా, యిమ్నా వంశీయులు; ఇష్వీ, ఇష్వీ వంశీయులు; బెరీయా, బెరీయా వంశీయులు.
[45] బెరీయా సంతతివారు హెబెరు, హెబెరు వంశీయులు; మల్కియేల్, మల్కియేల్ వంశీయులు.
[46] ఆషేరు కూతురు పేరు శెరహు.
[47] ఇవి ఆషేరువారి వంశాలు. వారిలో నమోదైన వారి సంఖ్య యాభై మూడు వేల నాలుగు వందలు.
[48] నఫ్తాలి సంతతివారు, వారి వంశాలప్రకారం, యహసయేల్, యహసయేల్ వంశీయులు; గూనీ, గూనీ వంశీయులు;
[49] యేసేరు, యేసేరు వంశీయులు; షిల్లేం, షిల్లేం వంశీయులు.
[50] ఇవి నఫ్తాలివారి వంశాలు. వారిలో నమోదైనవారి సంఖ్య నలభై ఐదు వేల నాలుగు వందలు.
[51] ఇస్రాయేల్ ప్రజలలో నమోదైనవారి సంఖ్య ఆరు లక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్ఫయి.
[52] యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
[53] “వీరి పేర్ల లెక్కప్రకారం కనానుదేశాన్ని వీరికి వారసత్వంగా పంచిపెట్టాలి.
[54] ఎక్కువమందికి ఎక్కువ వారసత్వం ఇవ్వాలి. తక్కువమందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. ప్రతి గోత్రానికి దాని జనసంఖ్య ప్రకారం వారసత్వం ఇవ్వాలి.
[55] అయితే చీట్లు వేసి ఆ భూమిని పంచి పెట్టాలి. వారు తమ తమ పూర్వీకుల గోత్రాల పేర్ల ప్రకారం వారసత్వం పొందాలి.
[56] ఎక్కువమందికి గానీ తక్కువమందికి గానీ చీట్లు వేసి, ఎవరి వారసత్వం వారికి పంచిపెట్టాలి.”
[57] లేవీ గోత్రికులలో నమోదైనవారు, వారి వారి వంశాలప్రకారం, గెర్షోను వంశీయులు, కహాతు వంశీయులు, మెరారి వంశీయులు.
[58] ఇవి లేవీ వంశాలు: లిబ్నివారి వంశం, హెబ్రోనువారి వంశం, మహల్‌వారి వంశం, మూషువారి వంశం, కోరహు వారి వంశం. కహాతుకు అమ్రాం జన్మించాడు.
[59] అమ్రాం భార్య పేరు యోకెబెదు. ఆమె లేవీ సంతానం. ఈజిప్ట్‌లో ఆమె లేవీవంశంలో జన్మించింది. ఆమె అమ్రాంవల్ల అహరోనునూ మోషేనూ వారి తోబుట్టువు మిర్యాంనూ కన్నది.
[60] అహరోనుకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు జన్మించారు.
[61] నాదాబు అబీహులు నిషిద్ధమైన నిప్పును యెహోవా సన్నిధానంలో అర్పించి చనిపోయారు.
[62] లేవీగోత్రికులలో నెల మొదలుకొని పై వయస్సు ఉండి నమోదైనవారి సంఖ్య ఇరవై మూడు వేలు. ఇస్రాయేల్‌ప్రజలలో వారికి వారసత్వం ఇవ్వబడలేదు గనుక వారు ఇస్రాయేల్‌ప్రజలలో నమోదైనవారు కారు.
[63] మోషే, ఎలియాజరుయాజి నమోదు చేసిన వారు వీరే. వారు ఇస్రాయేల్ ప్రజల పేర్లు యెరికో ఎదుట, యొర్దాను దగ్గర, మోయాబు మైదానాలలో నమోదు చేశారు.
[64] మోషే అహరోనులు సీనాయి ఎడారిలో ఇస్రాయేల్ ప్రజలను నమోదు చేసినప్పుడు నమోదైనవారిలో ఒక్కడైనా వీరిలో లేడు.
[65] వారిని గురించి యెహోవా “వారు ఎడారిలో తప్పకుండా చనిపోతారు” అన్నాడు. గనుక యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప వారిలో ఒక్కడూ మిగలలేదు.