Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్ ప్రజ అతారీం గుండా వస్తున్నారని అరాదులో ఉన్న రాజు విన్నాడు. ఆ రాజు కనానుజాతివాడు, దక్షిణ ప్రదేశం నివాసి. అతడు ఇస్రాయేల్ ప్రజలతో యుద్ధం చేసి వారిలో కొంతమందిని బందీలుగా తీసుకువెళ్ళాడు.

[2] అందుచేత ఇస్రాయేల్ ప్రజలు యెహోవాకు “నీవు ఈ జనాన్ని పూర్తిగా మా వశం చేస్తే మేము వాళ్ళ పట్టణాలను నాశనం చేసితీరుతామ” ని మొక్కుబడి చేశారు.

[3] యెహోవా వారి ప్రార్థన ఆలకించి ఆ కనానువాళ్ళను వారి వశం చేశాడు. వారు వాళ్ళనూ వాళ్ళ పట్టణాలనూ సర్వనాశనం చేశారు. అందుచేత ఆ స్థలం పేరు “హోర్మా”.

[4] తరువాత ఇస్రాయేల్ ప్రజలు ఎదోం చుట్టూరా వెళ్ళాలని హోరు పర్వతంనుంచి ఎర్రసముద్రానికి వెళ్ళే త్రోవ పట్టి ప్రయాణం చేశారు. మార్గాయాసంచేత ప్రజలు ఓపిక పట్టలేక,

[5] దేవునికీ మోషేకూ విరోధంగా మాట్లాడి, “ఈ ఎడారిలో మేము చనిపోవాలని ఈజిప్ట్‌నుంచి మీరు మమ్మల్ని రప్పించారెందుకు? ఇక్కడ తిండి లేదు, నీళ్ళూ లేవు. ఈ చప్పని రొట్టెలు చూసి మాకు వెగటు పుడతుంది” అన్నారు.

[6] అందుచేత ప్రజలమధ్యకు యెహోవా విషం గల పాములను పంపించాడు. అవి వారిని కరిచాయి, గనుక ఇస్రాయేల్ ప్రజల్లో చాలామంది చనిపోయారు.

[7] అయితే ప్రజలు మోషేదగ్గరికి వచ్చి, “మేము యెహోవాకూ నీకూ విరోధంగా మాట్లాడి తప్పిదం చేశాం, యెహోవా మా మధ్యనుంచి ఈ పాములను తొలగించేలా ఆయనను వేడుకో” అన్నారు. ప్రజలకోసం మోషే ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతడితో ఇలా అన్నాడు:

[8] “నీవు విషం గల పాములాంటి రూపాన్ని చేయించి స్తంభంమీద పెట్టు. పాము కరిచినవారెవరైనా సరే ఆ రూపం వైపు చూస్తే బ్రతుకుతారు.

[9] అందుచేత మోషే కంచు పామును చేయించి స్తంభంమీద ఉంచాడు. పాము కరించిన వారెవరైనా సరే ఆ కంచు పామును చూచినప్పుడు బ్రతికారు.

[10] తరువాత ఇస్రాయేల్ ప్రజలు ప్రయాణం చేసి ఓబోతులో దిగారు.

[11] ఓబోతునుంచి ప్రయాణమైపోయి ఈయె–అబారీం దగ్గర దిగారు. అది తూర్పుదిక్కుగా ఉన్న మోయాబు ఎదుట ఉన్న ఎడారిలో ఉంది.

[12] అక్కడనుంచి వారు ప్రయాణం చేసి జెరెద్ లోయలో దిగారు.

[13] అక్కడనుంచి ప్రయాణం చేసి ఎడారిలో అర్నోను నది అవతలి ఒడ్డున దిగారు. ఆ నది అమోరీవాళ్ళ దేశ సరిహద్దులనుంచి పారుతుంది. అర్నోను నది మోయాబుకూ అమోరీవాళ్ళ దేశానికీ మధ్య ఉన్న మోయాబు సరిహద్దు.

[14] అందుచేత “యెహోవా యుద్ధాలు” అనే పుస్తకంలో

[15] “సూషాలో ఉన్న వాహేబ్, అర్నోనులోయలు, ఆర్ అనే స్థలంవరకు ఉన్న అర్నోను కనుమలు, మోయాబు సరిహద్దుకు సమీపంగా ఉన్న ఆ కనుమలు” అని వ్రాసి ఉంది.

[16] అక్కడనుంచి వారు బెయేర్‌కు వెళ్ళారు. అక్కడి బావిని గురించి యెహోవా మోషేతో, “ఈ ప్రజలను సమకూర్చు. నేను వారికి నీళ్ళు ఇస్తాను” అన్నాడు.

[17] అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఈ పాట పాడారు: “బావీ! పైకి ఉబుకు! ఈ బావిని ప్రజల నాయకులు తవ్వారు. వారి అధికార దండాలతో, వారి చేతికర్రలతో దీనిని తవ్వారు. ఈ బావికి పాడండి”.

[19] వారు ఆ ఎడారినుంచి మత్తానుకు, మత్తాను నుంచి నహలీయేల్‌కు, నహలీయేల్ నుంచి బామోతుకు పయనించారు.

[20] బామోతు నుంచి నిర్జన ప్రదేశానికి ఎదురుగా ఉన్న పిస్గా పర్వతం దగ్గర ఉన్న మోయాబు లోయకు ప్రయాణం చేశారు.

[21] అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు అమోరీవాళ్ళ రాజైన సీహోను దగ్గరికి రాయబారులను పంపి ఇలా మనవి చేశారు:

[22] “మమ్ములను మీ దేశం మీదుగా దాటిపోనివ్వండి. పొలాలలో ద్రాక్షతోటలలో పడి వెళ్ళము. బావుల నీళ్ళు త్రాగము. మీ దేశం సరిహద్దును దాటేవరకూ రాజమార్గంలోనే సాగిపోతాం”.

[23] అయితే ఇస్రాయేల్ ప్రజలను తన సరిహద్దు దాటడానికి సీహోను అనుమతించలేదు. దానికి బదులు అతడు తన సైన్యాన్నంతా పోగు చేసి ఇస్రాయేల్‌ప్రజలను ఎదుర్కోవడానికి ఎడారిలోకి వచ్చి యాహజుకు చేరి వారితో యుద్ధం చేశాడు.

[24] ఇస్రాయేల్ ప్రజలు వాణ్ణి ఖడ్గంచేత రూపుమాపి వాడి దేశాన్ని అర్నోను నదినుంచి యబ్బోకు సెలయేరు వరకు స్వాధీనం చేసుకొన్నారు. యబ్బోకు అమ్మోనువాళ్ళ సరిహద్దు. ఆ సరిహద్దుకు బలమైన కోటలూ బురుజులూ ఉన్నాయి.

[25] ఇస్రాయేల్ ప్రజలు అమోరీవాళ్ళ పట్టణాలన్నీ పట్టుకొన్నారు. వాళ్ళ పట్టణాలన్నిటిలో హెష్బోనులో దాని చుట్టు ఉన్న గ్రామాలన్నిటిలో ఉండిపోయారు.

[26] హెష్బోను అమోరీవాళ్ళ రాజు సీహోను పట్టణం. సీహోను అంతకుముందు మోయాబురాజుతో యుద్ధం చేసి అర్నోనునది వరకు ఉన్న ప్రదేశమంతా పట్టుకొన్నాడు.

[27] అందుచేత కవులు చెప్తారు: “హెష్బోనుకు రండి! సీహోను పట్టణాన్ని నిర్మించాలి! దానిని స్థాపించాలి!

[28] హెష్బోనునుంచి అగ్ని బయలుదేరింది. సీహోను పట్టణంనుంచి మంటలు ప్రజ్వలించాయి. అవి మోయాబులోని ఆర్‌ను కాల్చివేశాయి. అర్మోను దగ్గర ఉన్న ఎత్తయిన స్థలాలను తగలబెట్టాయి.

[29] మోయాబూ, నీకు బాధ! కెమోషు ప్రజలారా, మీరు నాశనమయ్యారు! వాడు తన కొడుకుల్ని పలాయితుల్ని చేశాడు. తన కూతుళ్ళను అమోరీవాళ్ళ రాజైన సీహోనుదగ్గరికి బందీలుగా వెళ్ళనిచ్చాడు.

[30] వాటిమీద గురిపెట్టి కొట్టాం. దీబోనువరకు హెష్బోను నాశనమైంది. నోఫహు వరకు దేశాన్ని పాడు చేశాం. మంటలు మేదెబా వరకు వ్యాపించాయి.”

[31] ఈ విధంగా ఇస్రాయేల్ ప్రజలు అమోరీవాళ్ళ దేశంలో ఉండిపోయారు.

[32] యాజెరును చూడడానికి మోషే గూఢచారులను పంపించాడు. ఇస్రాయేల్ ప్రజలు ఆ పట్టణాన్నీ దాని చుట్టూరా ఉన్న గ్రామాలనూ పట్టుకొన్నారు. అక్కడ ఉన్న అమోరీవాళ్ళను పారదోలారు.

[33] తరువాత బాషాను దేశంవైపు తిరిగి, ఆ దిక్కుగా సాగిపోయారు. బాషాను రాజైన ఓగు తన ప్రజలందరితోపాటు ఎద్రెయీ దగ్గర ఇస్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయడానికి వారికి ఎదురుగా బయలుదేరాడు.

[34] అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “వాడికి భయపడకు. నేనే వాణ్ణీ వాడి జనులందరినీ వాడి దేశాన్నీ నీ వశం చేశాను. హెష్బోనులో నివసించిన అమోరీవాళ్ళ రాజైన సీహోనుకు నీవు చేసినట్టు వాడికి చేస్తావు.

[35] అలాగే వారు వాణ్ణీ వాడి కొడుకులనూ వాడికి ఎవ్వడూ మిగలకుండా వాడి జనాన్నీ కూలగొట్టారు. వాడి దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు.

సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు) — Chapters