Skip to content
Opens in a new window

[1] యెహోవా మోషే అహరోనులతో ఇంకా అన్నాడు,

[2] “ఇస్రాయేల్‌ప్రజలలో ఒక్కొక్కరూ వారి వారి పూర్వీకుల కుటుంబాల టెక్కేల దగ్గర, వారి వారి ధ్వజాల క్రింద డేరాలు వేసుకోవాలి. వారు సన్నిధిగుడారానికి కొంత దూరంలో దాని చుట్టూరా దిగాలి.

[3] పొద్దు పొడిచే తూర్పుదిక్కున యూదా శిబిర ధ్వజం ఉన్నవారు వారి వారి సేన ప్రకారం దిగాలి. యూదా గోత్రికులకు నాయకుడు అమ్మీనాదాబు కొడుకైన నయస్సోను.

[4] అతడి సేనలో నమోదైనవారు డెబ్భై నాలుగు వేల ఆరు వందలమంది.

[5] యూదా గోత్రానికి దగ్గర ఇశ్శాకారు గోత్రం దిగాలి. ఇశ్శాకారు గోత్రికులకు నాయకుడు సూయారు కొడుకైన నెతనేల్.

[6] అతడి సేనలో నమోదైనవారు యాభై నాలుగు వేల నాలుగు వందల మంది.

[7] జెబూలూను గోత్రికులకు నాయకుడు హేలోను కొడుకైన ఏలీయాబు.

[8] అతడి సేనలో నమోదైనవారి సంఖ్య యాభైయేడు వేల నాలుగు వందలు.

[9] యూదా శిబిరంలో నమోదైనవారి సంఖ్య, వారి సేనల ప్రకారం మొత్తం లక్ష ఎనభైయారు వేల నాలుగు వందలు. ప్రయాణంలో వారు ముందుగా బయలుదేరి వెళ్ళాలి.

[10] “రూబేను శిబిర ధ్వజం ఉన్నవారు వారి వారి సేనల ప్రకారం దక్షిణ దిక్కున ఉండాలి. రూబేను గోత్రికులకు నాయకుడు షెదేయూర్ కొడుకు ఎలీసూరు.

[11] అతడి సేనలో నమోదైనవారి సంఖ్య నలభై ఆరు వేల అయిదు వందలు.

[12] రూబేను గోత్రానికి దగ్గర షిమ్యోను గోత్రం దిగాలి. షిమ్యోను గోత్రికులకు నాయకుడు సూరీషదాయి కొడుకు షెలుమీయేల్.

[13] అతడి సేనలో నమోదైనవారి సంఖ్య యాభైతొమ్మిది వేల మూడు వందలు.

[14] గాదు గోత్రికులకు నాయకుడు రగూయేల్ కొడుకు ఏలియాపాను.

[15] అతడి సేనలో నమోదైనవారి సంఖ్య నలభై అయిదువేల ఆరు వందల యాభై.

[16] రూబేను శిబిరంలో నమోదైనవారి సంఖ్య వారి సేనల ప్రకారం మొత్తం లక్ష యాభై ఒక్క వేల నాలుగు వందల యాభై. వారు రెండో గుంపుగా బయలుదేరి వెళ్ళాలి.

[17] “లేవీ శిబిరం సన్నిధి గుడారంతో ఇతర శిబిరాల మధ్య బయలుదేరి వెళ్ళాలి. వారు ఏ విధంగా దిగుతారో ఆ విధంగా వారి వారి ధ్వజాల ప్రకారం ఒక్కొక్కరూ వారి వారి వరుసలో బయలుదేరి వెళ్ళాలి.

[18] “ఎఫ్రాయిం శిబిర ధ్వజం ఉన్నవారు వారి వారి సేనల ప్రకారం పడమటి దిక్కున ఉండాలి. ఎఫ్రాయిం గోత్రికులకు నాయకుడు అమీహూదు కొడుకు ఎలీషామా.

[19] అతడి సేనలో నమోదైన వారి సంఖ్య నలభై వేల అయిదు వందలు.

[20] ఎఫ్రాయిం గోత్రానికి దగ్గర మనష్షే గోత్రం ఉండాలి. మనష్షే గోత్రికులకు నాయకుడు పెదాసూరు కొడుకు గమలీయేల్.

[21] అతడి సేనలో నమోదైనవారి సంఖ్య ముప్ఫయి రెండు వేల రెండు వందలు.

[22] బెన్యామీను గోత్రికులకు నాయకుడు గిద్యోనీ కొడుకు అబీదాను.

[23] అతడి సేవలో నమోదైనవారి సంఖ్య ముప్ఫయి అయిదు వేల నాలుగు వందలు.

[24] ఎఫ్రాయిం శిబిరంలో నమోదైనవారి సంఖ్య, వారి సేనల ప్రకారం మొత్తం లక్ష ఎనిమిది వేల ఒక వంద. వారు మూడో గుంపుగా బయలుదేరి వెళ్ళాలి.

[25] “దాను శిబిర ధ్వజం ఉన్నవారు వారి సేనల ప్రకారం ఉత్తర దిక్కున ఉండాలి. దాను గోత్రికులకు నాయకుడు అమీషదాయి కొడుకు అహీయెజెరు.

[26] అతడి సేనలో నమోదైనవారి సంఖ్య అరవై రెండు వేల ఏడు వందలు.

[27] దాను గోత్రానికి దగ్గర ఆషేరు గోత్రం దిగాలి. ఆషేరు గోత్రికులకు నాయకుడు ఒక్రాను కొడుకు పగీయేల్.

[28] అతడి సేనలో నమోదైనవారి సంఖ్య నలభై ఒక వేయి అయిదు వందలు.

[29] నఫ్తాలి గోత్రికులకు నాయకుడు ఏనాను కొడుకు అహీర.

[30] అతడి సేనలో నమోదైనవారి సంఖ్య యాభై మూడు వేల నాలుగు వందలు.

[31] దాను శిబిరంలో నమోదైనవారి సంఖ్య మొత్తం లక్ష యాభై ఏడు వేల ఆరు వందలు. వారు వారి ధ్వజాల ప్రకారం చివరి గుంపుగా బయలుదేరి వెళ్ళాలి.”

[32] వీరు వారి వారి పూర్వీకుల వంశాల ప్రకారం ఇస్రాయేల్ ప్రజలలో నమోదైనవారు. వారి వారి సేనల ప్రకారం వారి వారి శిబిరాలలో నమోదైనవారి సంఖ్య మొత్తం ఆరు లక్షల మూడు వేల అయిదు వందల యాభై.

[33] అయితే యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం లేవీ గోత్రికులు ఇస్రాయేల్ ప్రజలలో తమ పేర్లు నమోదు చేయించుకోలేదు.

[34] ఆ విధంగా, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టెల్లా ఇస్రాయేల్ ప్రజలు చేశారు. వారి వారి వంశాలు, పూర్వీకుల కుటుంబాల ప్రకారం ఒక్కొక్కరూ వారి వారి ధ్వజాల దగ్గర డేరాలు వేసేవారు, బయలుదేరి వెళ్ళేవారు.

సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు) — Chapters