[1] యెహోవా చెప్పేదేమిటంటే, “ఆ కాలంలో యూదా రాజుల ఎముకలను, అధికారుల ఎముకలను, యాజుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, జెరుసలం కాపురస్థుల ఎముకలను వాళ్ళ సమాధుల్లోనుంచి వెలుపలికి తీసివేయడం జరుగుతుంది.
[2] వాళ్ళు ప్రేమిస్తూ, సేవిస్తూ, సంప్రదిస్తూ, అనుసరిస్తూ, పూజిస్తూ వచ్చిన సూర్యచంద్ర నక్షత్ర సమూహాల ఎదుట ఆ ఎముకలను పరవడం జరుగుతుంది. వాటిని సమకూర్చరు. పాతిపెట్టరు. అవి భూమిమీద పెంటలాగా పడి ఉంటాయి.
[3] ఈ చెడ్డ వంశంలో మిగిలినవాళ్ళను నేను చెదరగొట్టినతరువాత, వాళ్ళు ఉన్న ప్రతి స్థలంలో అందరూ బ్రతుకుకు బదులు చావును కోరుకొంటారు. ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు.
[4] “నీవు వాళ్ళతో ఇలా అను: యెహోవా చెప్పేదేమిటంటే, మనుషులు పడిపోతే మళ్ళీ లేవకుండా ఉంటారా? త్రోవ తప్పినవాడు తిరిగి రాకుండా ఉంటాడా?
[5] మరి ఈ జెరుసలం ప్రజలు త్రోవ తప్పి తిరిగి రాకుండా ఉండడం ఎందుకని? వాళ్ళు మోసాన్ని అంటిపెట్టుకొని ఉంటారు, విడవరు. తిరిగి రావడానికి ఒప్పుకోకుండా ఉంటారు.
[6] నేను వంగి చెవులారా ఆలకించాను – వాళ్ళు సరిగా మాట్లాడలేదు. ‘నేనేం చేశాను?’ అని చెప్పి ఒక్కడు కూడా పశ్చాత్తాపపడడం లేదు. గుర్రం యుద్ధానికి చొరబడినట్లు ప్రతివాడూ తన సొంత త్రోవలోబడి పోతూ ఉన్నాడు.
[7] గాలిలో ఎగిరే సంకుబుడి కొంగకు దాని నియామక కాలాలు తెలుసు. గువ్వకు, మంగలకత్తిపిట్టకు, ఓదెకొరుకుపిట్టకు వాటి వాటి రాకపోకల సమయాలు తెలుసు. అయితే నా ప్రజకు యెహోవా నియమాలు తెలియకుండా పొయ్యాయి.
[8] ‘మేము జ్ఞానులం, మాకు యెహోవా ఉపదేశం ఉంది’ అని మీరు ఎలా చెపుతారు? నిజమే, గాని ధర్మశాస్త్రులు మోసం చేసి, తమ వ్రాతల్లో దానిని అపార్థానికి గురి చేశారు.
[9] “జ్ఞానులు సిగ్గు పాలవుతారు, భయంతో చిక్కు పడిపోతారు. యెహోవా వాక్కును వాళ్ళు తిరస్కరించారు, మరి వాళ్ళకు ఉన్న జ్ఞానం ఏపాటిది?
[10] అందుచేత నేను వాళ్ళ భార్యలను పరాధీనం చేస్తాను. వాళ్ళ పొలాలను ఇతరులు ఆక్రమిస్తారు. వాళ్ళంతా – అల్పులైనా గొప్పవాళ్ళైనా – అన్యాయంగా సంపాదించుకోవాలని చూస్తారు. ప్రవక్తలు, యాజులు అందరూ మోసంగా వ్యవహరిస్తారు.
[11] శాంతి లేనప్పుడు ‘శాంతి, శాంతి’ అంటూ వాళ్ళు నా ప్రజ గాయాన్ని పైపైనే నయం చేస్తున్నారు.
[12] తమ అసహ్యమైన ప్రవర్తన కారణంగా వాళ్ళు సిగ్గుపడ్డారా? సిగ్గుపడనే లేదు. సిగ్గు అంటే ఏమిటో వాళ్ళకు తెలియదు. కనుక వాళ్ళు కూలిపోయే వాళ్ళతోకూడా కూలుతారు. నేను వాళ్ళను దండించేటప్పుడు వాళ్ళు పడిపోతారు. ఇది యెహోవా వాక్కు.
[13] నేను వాళ్ళ పంటను తీసివేస్తాను. ద్రాక్షచెట్లకు పండ్లు ఉండవు. అంజూరుచెట్లకూ ఉండవు. వాటి ఆకులు వాడిపోతాయి. వాళ్ళను నాశనం చేసే వాళ్ళను నేను పంపిస్తున్నాను. ఇది యెహోవా వాక్కు.”
[14] “మనమిక్కడ ఎందుకు కూర్చుని ఉన్నాం? సమకూడుదాం రండి! ప్రాకారాలున్న పట్టణాలకు వెళ్ళి అక్కడే చనిపోదాం. మనం యెహోవాకు వ్యతిరేకంగా అపరాధం చేశాం గనుక మన దేవుడు యెహోవా మనలను నాశనానికి అప్పగించి విష జలం మనకు త్రాగించాడు.
[15] శాంతికోసం ఎదురు చూశాం గాని, మంచి ఏమీ జరగలేదు. క్షేమంకోసం చూశాం గాని, భయమే ప్రాప్తించింది.
[16] దాను ప్రాంతంమీదుగా వస్తూ ఉన్న వాళ్ళ గుర్రాల బుసలు వినబడుతూ ఉన్నాయి. వాళ్ళ యుద్ధాశ్వాల సకిలింపుకు దేశమంతా వణకుతూ ఉంది. వాళ్ళు వచ్చి దేశాన్ని, ఇందులో ఉన్న సమస్తాన్ని, పట్టణాలను, వాటిలో కాపురస్థులను నాశనం చేస్తారు.”
[17] యెహోవా చెప్పేదేమిటంటే, “నేను మీమధ్యకు విష సర్పాలను, మిణ్ణాగులను పంపిస్తాను. అవి మిమ్మల్ని కరుస్తాయి. వాటి కాటుకు నివారణ మంత్రమేమీ లేదు.”
[18] నాకు మనసులో క్రుంగిపోయినట్లు ఉంది. నా దుఃఖం ఎలా మటుమాయమవుతుంది?
[19] దూర దేశంనుంచి నా ప్రజ చేసే ఆక్రందన వినబడుతూ ఉంది: “యెహోవా సీయోనులో లేడా? దాని రాజు అక్కడ లేడా?” “వాళ్ళు ఎందుకు పోతపోసిన విగ్రహాలను, ఇతర దేశాల వ్యర్థ దేవుళ్ళను పెట్టుకొని నన్ను విసికించారు?”
[20] “కోతకాలం గడిచిపోయింది. పంట కూర్చుకొనే కాలం దాటిపోయింది. ఇంకా మనకు విముక్తి లేదు.”
[21] నా ప్రజ నశించిన స్థితిలో ఉన్న కారణంగా నేనూ నశించాను. నేను శోకిస్తూ ఉన్నాను. నాకు చాలా భయం పట్టుకొంది.
[22] గిలాదు ప్రదేశంలో మందు లేదా? అక్కడ వైద్యుడెవ్వడూ లేడా? నా ప్రజకు ఆరోగ్యం ఎందుకు కలగలేదు?