[1] సిద్కియారాజు మల్కీయా కొడుకైన పషూరునూ మయశేయా కొడుకైన జెఫన్యాయాజినీ ఈ మనవితో యిర్మీయాదగ్గరికి పంపాడు:
[2] “బబులోను రాజైన నెబుకద్‌నెజరు మనమీద యుద్ధం చేస్తున్నాడు. యెహోవా అద్భుతాలు చేసేవాడు. నెబుకద్‌నెజరు మనదగ్గరనుంచి వెళ్ళిపోయేలా ఒకవేళ యెహోవా తన అద్భుత క్రియలన్నిటి ప్రకారం మనకోసం జరిగిస్తాడేమో. దయచేసి, మాకోసం యెహోవాదగ్గర విచారణ చేయండి.”
[3] అప్పుడు యెహోవానుంచి వచ్చిన వాక్కు యిర్మీయా వాళ్ళతో చెప్పాడు: “మీరు ఈ విధంగా సిద్కియాతో చెప్పాలి:
[4] ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, ప్రాకారం వెలుపల మిమ్ములను ముట్టడి వేస్తూ ఉన్న బబులోను రాజుతో, కల్దీయవాళ్ళతో యుద్ధంలో మీరు ప్రయోగిస్తున్న ఆయుధాలను వెనక్కు మళ్ళేట్టు చేస్తాను. వాటిని ఈ నగరం మధ్యలో పోగు చేయిస్తాను.
[5] నేనే చేయి చాపి, బలంగల నా హస్తంతో, కోపంతో, తీవ్రమైన ఆగ్రహంతో, ప్రచండమైన ఉగ్రతతో మీమీద యుద్ధం చేస్తాను.
[6] ఈ నగరంలో ఉంటున్న మనుషులనూ పశువులనూ మొత్తుతాను. వాళ్ళు భయంకరమైన అంటురోగానికి గురి అయి చస్తారు.
[7] యెహోవా చెప్పేదేమిటంటే, ఆ తరువాత రోగంచేత, ఖడ్గంచేత కరవుచేత చావకుండా, నగరంలో మిగిలిన ప్రజలనూ, యూదా రాజు సిద్కియానూ, అతడి సిబ్బందినీ బబులోను రాజు నెబుకద్‌నెజరు వశం, వాళ్ళ ప్రాణం తీయజూచేవాళ్ళ శత్రువుల వశం చేస్తాను. అతడు ఈ ప్రజమీద ఏమీ కనికరం, కరుణ, జాలి చూపడు. వాళ్ళను ఖడ్గంతో హతం చేయిస్తాడు.
[8] “ఈ ప్రజతో ఇలా చెప్పు: యెహోవా చెప్పేదేమిటంటే, ఇదిగో, జీవ మార్గం, మరణ మార్గం రెండూ మీ ఎదుట ఉంచుతున్నాను.
[9] ఈ నగరంలో ఉండబోయేవాళ్ళు ఖడ్గానికీ కరవుకూ అంటురోగానికీ గురియై చస్తారు. నగరం బయటికి వెళ్ళి, మిమ్ములను ముట్టడి వేస్తూ ఉన్న కల్దీయవాళ్ళకు లోబడిపోయేవాళ్ళు బ్రతుకుతారు. దోపిడీలాగా వాళ్ళ ప్రాణం దక్కుతుంది.
[10] నేను ఈ నగరాన్ని దయ చూడను. విపత్తు కలిగిస్తాను. ఇది బబులోను రాజు వశమవుతుంది. అతడు దానిని మంటలతో నాశనం చేస్తాడు. ఇది యెహోవా వాక్కు.
[11] “తరువాత యూదా రాజ వంశీయులకు ఇలా చెప్పు: యెహోవా వాక్కు వినండి!
[12] దావీదు వంశీయులారా! యెహోవా చెప్పేదేమిటంటే ఉదయకాలం న్యాయం జరిగించండి. దోచుకోబడ్డవారిని దౌర్జన్యపరుల చేతిలోనుంచి విడిపించండి. లేకపోతే, మీరు చేసిన చెడుగుకారణంగా నా కోపం మంటలాగా బయలుదేరుతుంది. ఎవ్వరూ ఆర్పడానికి వీలులేకుండా అది మండుతూనే ఉంటుంది.
[13] ఈ కొండల సందులో, శిలామయమైన ఈ ఎత్తయిన మైదానంలో కూర్చుని ఉన్న జెరుసలమా! నీవు అంటున్నావు గదా ‘మామీదికి ఎవరు రాగలరు? మా ఇండ్లలో ఎవరు అడుగు పెట్టగలరు?’ నేను నీకు విరోధినయ్యాను. ఇది యెహోవా వాక్కు.
[14] నీ పనులకు అనుగుణంగా నిన్ను దండిస్తాను. నీ అడవులకు జ్వాలలంటిస్తాను. అవి చుట్టూ ఉన్నదంతా కాల్చివేస్తుంది. ఇది యెహోవా వాక్కు.”