Skip to content
Opens in a new window

[1] “యూదావారి అపరాధం ఇనుప కలంతో వ్రాసి ఉంది. వారి హృదయమనే పలకమీద, వారి బలిపీఠాల కొమ్ములమీద వజ్రం కొనతో చెక్కి ఉంది.

[2] వారి సంతానం కూడా పచ్చని చెట్లక్రింద, ఎత్తయిన కొండలమీద ఉన్న వారి బలిపీఠాలనూ అషేరాదేవతా స్తంభాలనూ జ్ఞాపకం ఉంచుకొంటారు.

[3] మీ దేశమంతటా మీరు చేసిన పాపాలకారణంగా నేను ఈ సరిహద్దులలో ఉన్న నా పర్వతాన్నీ మీ సంపదనూ విలువైన వస్తువులన్నిటినీ మీ ఎత్తయిన పూజాస్థలాలనూ దోపిడీగా ఇతరులకు ఇచ్చివేస్తాను.

[4] నేను మీకిచ్చిన వారసత్వాన్ని మీకారణంగానే మీరు పోగొట్టుకొంటారు. మీరు నా కోపాగ్ని రగులబెట్టారు. అది ఎప్పటికీ మండుతూ ఉంటుంది. మీకు తెలియని దేశంలో మీ విరోధులకు మిమ్ములను దాసులుగా చేస్తాను.”

[5] యెహోవా ఇంకా చెప్పేదేమిటంటే, “మనిషిమీద నమ్మకం పెట్టి, శరీరులను తనకు బలంగా చేసుకొని, యెహోవానుంచి మనసు మళ్ళుకొన్నవారు శాపగ్రస్తులు.

[6] అలాంటివారు ఎండిన ప్రదేశంలో ఉన్న పొదలాగా ఉంటారు. క్షేమం కలిగితే అది వారికి కనిపించదు. ఎడారిలో బాగా ఎండిపోయిన స్థలంలో, నిర్జనమై చవిటి ప్రదేశంలో ఉండిపోతారు.

[7] ఎవరైతే యెహోవామీద నమ్మకం ఉంచుతారో, ఎవరికైతే యెహోవా ఆశ్రయంగా ఉన్నాడో వారు ధన్యులు.

[8] వారు నీళ్ళదగ్గర నాటబడి, కాలువ ఓరను వేళ్ళు తన్నిన చెట్టులాగా ఉంటారు. ఎండ వచ్చినా ఆ చెట్టు భయపడదు. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. వాన లేని సంవత్సరంలో కూడా అది ఏమీ కంగారుపడదు, కాయడం మానదు.

[9] “హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి ఘోరమైన రోగం ఉంది. దానిని ఎవరు గ్రహించగలరు?

[10] నేను – యెహోవాను – హృదయాన్ని పరిశోధిస్తాను, మనసును పరీక్షిస్తాను. ప్రతి ఒక్కరికీ వారి ప్రవర్తన ప్రకారం, వారి క్రియలకు తగినట్టుగా ఇస్తాను.”

[11] కౌజుపిట్ట తాను పెట్టని గుడ్లను పొదుగుతుంది. అక్రమంగా ధనం సంపాదించుకొనేవాడు ఆ పిట్టలాంటివాడే, నడిమి వయసులో ఆ ధనం వాణ్ణి వదలివేస్తుంది. చివరగా వాడు తెలివితక్కువవాడని తేలుతుంది.

[12] ఆరంభంనుంచి మా పవిత్రాలయం ఉన్నస్థలం ఘనమైన, గంబీరమైన సింహాసనంలాంటిది.

[13] యెహోవా! ఇస్రాయేల్ ప్రజకు ఆశాభావం నీవే. నిన్ను విడిచి పెట్టినవాళ్ళందరూ సిగ్గుపాలవుతారు. నీనుంచి వైదొలగిన వాళ్ళు జీవప్రదమైన నీటి ఊట అయి ఉన్న యెహోవాను విడిచిపెట్టారు, గనుక వాళ్ళు ఇసుకమీద వ్రాతలాగా ఉంటారు.

[14] యెహోవా! నన్ను బాగు చెయ్యి. అప్పుడు నేను బాగుపడుతాను. నన్ను విముక్తుణ్ణి చెయ్యి. అప్పుడు విముక్తుణ్ణి అవుతాను. నేను కీర్తించేది నిన్నే.

[15] ఇదిగో వారు నాతో “యెహోవా వాక్కు ఎక్కడుంది? ఇప్పుడు అది నెరవేరుతుంది గాక!” అంటున్నారు.

[16] నేను నిన్ను అనుసరిస్తూ, కాపరిగా ఉండడం మానుకోలేదు. నిరాశ కాలం రావాలని నేను ఆశించలేదు. నీకు తెలుసు. నా పెదవులు దాటి వచ్చిన మాటలు నీ ఎదుటే ఉన్నాయి గదా.

[17] నీవు నాకు భయకారణంగా ఉండబోకు. దుర్దినంలో నాకు ఆశ్రయం నీవే.

[18] నాకు ఆశాభంగం కలగనియ్యకు. నన్ను హింసించేవాళ్ళకే ఆశాభంగం కలిగించు. నాకు కాదు వాళ్ళకే భయం వేసేలా చెయ్యి. దుర్దినం వాళ్ళమీదికి రప్పించి రెండంతల నాశనం వారిమీదికి రప్పించు!”

[19] యెహోవా నాతో ఇలా చెప్పాడు: “యూదా రాజులు నగరంలోకి ప్రవేశిస్తూ, బయటికి వెళ్ళిపోతూ ఉండే ప్రజాద్వారంలో నీవు వెళ్ళి నిలబడు. తరువాత జెరుసలం ద్వారాలన్నిటిలో నిలబడాలి.

[20] నీవు ఇలా ప్రకటన చెయ్యి: యూదా రాజులారా! యూదా ప్రజలారా! జెరుసలం నివాసులారా! ఈ ద్వారాలగుండా ప్రవేశించేవారలారా! మీరందరూ యెహోవా వాక్కు వినండి!

[21] యెహోవా చెప్పేదేమిటంటే, మీరు జాగ్రత్తగా ఉండి, విశ్రాంతి దినాన బరువులు మోయవద్దు. జెరుసలం ద్వారాలగుండా వాటిని తీసుకురావద్దు.

[22] విశ్రాంతి దినాన మీ ఇండ్లలోనుంచి బరువులు మోసుకుపోవద్దు, మరే పనీ చేయకూడదు. నేను మీ పూర్వీకులకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినం పవిత్ర దినంగా పరిగణించండి.

[23] మీ పూర్వీకులు పెడచెవిని పెట్టి నా మాట వినలేదు. తలబిరుసుగా ఉండి, వాళ్ళు విని హెచ్చరిక పాటించలేదు.

[24] “మీరైనా నా మాట జాగ్రత్తగా విని, విశ్రాంతిదినాన నగరద్వారాల గుండా ఏ బరువూ తీసుకురాకుండా, విశ్రాంతి దినం పవిత్ర దినంగా ఎంచి, ఆ రోజున ఏ పనీ చేయకుండా ఉంటే, అప్పుడు ఇలా జరుగుతుంది –

[25] దావీదు సింహాసనమెక్కే రాజులు అధిపతులతోపాటు ఈ నగర ద్వారాలగుండా ప్రవేశిస్తారు; వారూ వారి అధిపతులూ రథాలమీద, గుర్రాలమీద వస్తూ పోతూ ఉంటారు; వారివెంట యూదావారూ జెరుసలం నివాసులూ వస్తారు, ఈ నగరం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

[26] ప్రజలు యూదా పట్టణాలనుంచి, జెరుసలం పరిసరాలనుంచి, బెన్యామీను ప్రదేశంనుంచి, పడమటి మైదానాలనుంచి, కొండసీమనుంచి, దక్షిణప్రదేశంనుంచి వస్తారు. వారు యెహోవా ఆలయానికి హోమాలు, బలులు, నైవేద్యాలు ధూపద్రవ్యం, కృతజ్ఞతార్పణలు తెస్తారు.

[27] అయితే విశ్రాంతిదినం జెరుసలం ద్వారాలగుండా బరువులు మోసుకురాకుండా, విశ్రాంతిదినం పవిత్ర దినంగా ఎంచాలని నేను చెప్పిన మాట మీరు వినకపోతే, నేను జెరుసలం ద్వారాలలో మంట రాజబెట్టిస్తాను. అది దాని నగరులను కాల్చివేస్తుంది. దానిని ఆర్పడానికి ఎవరి తరం కాదు.”

యిర్మీయా — Chapters