[1] యోషీయా కొడుకూ, యూదా రాజూ అయిన యెహోయాకీం పరిపాలించిన నాలుగో సంవత్సరంలో (బబులోను రాజైన నెబుకద్‌నెజరు పరిపాలనలో మొదటి సంవత్సరం), యూదా ప్రజలందరిని గురించిన వాక్కు యిర్మీయాకు వచ్చింది.
[2] ఆ వాక్కు యిర్మీయాప్రవక్త యూదాప్రజలందరికీ జెరుసలం కాపురస్థులందరికీ ప్రకటించాడు. అదేమిటంటే,
[3] ఆమోను కొడుకూ, యూదా రాజూ అయిన యోషీయా పరిపాలించిన పదమూడో సంవత్సరంనుంచి ఈ రోజువరకు – ఇరవై మూడేళ్ళు – యెహోవానుంచి వాక్కులు నాకు వస్తూ ఉన్నాయి. నేను వాటిని ప్రొద్దున్నే లేచి మీకు ప్రకటిస్తూ వచ్చాను గాని, మీరు పెడచెవిని పెట్టారు.
[4] అంతేగాక యెహోవా తనకు సేవ చేసే తన ప్రవక్తలందరినీ పొద్దున్నే లేచి పంపిస్తూ వచ్చాడు. అయినా మీరు వినలేదు, చెవిని పెట్టలేదు.
[5] వారు అన్నారు గదా, “మీలో ప్రతి ఒక్కరూ మీ చెడ్డ త్రోవలనుంచి, మీ దురాచారాలనుంచి మళ్ళండి. యెహోవా మీకూ మీ పూర్వీకులకూ శాశ్వతమైన ఈవిగా ప్రసాదించిన ఈ దేశంలో మీరు ఉండేలా చేయండి.
[6] ఇతర దేవుళ్ళను, దేవతలను అనుసరించవద్దు, పూజించవద్దు, సేవించవద్దు. మీరు చేతులతో చేసినవాటిచేత నన్ను విసికించవద్దు. అప్పుడు నేను మీకు ఏమీ హాని చేయను.
[7] “అయితే మీరు నా మాట వినలేదు. మీరు చేతులతో చేసిన వాటిమూలంగా నన్ను విసికించి, మీకు మీరే హాని కొనితెచ్చుకొన్నారు” అని యెహోవా అంటున్నాడు.
[8] అందుచేత సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, “మీరు నా మాటలు వినలేదు,
[9] గనుక నేను ఉత్తర దిక్కున ఉన్న జాతులన్నిటినీ నా సేవకుడూ బబులోను రాజూ నెబుకద్‌నెజరునూ పిలవనంపిస్తాను. ఈ దేశంమీదికీ ఇక్కడివాళ్ళమీదికీ దీని చుట్టూరా ఉన్న జనాలమీదికీ వారిని రప్పిస్తాను. నేను ఇక్కడివారిని పూర్తిగా నాశనం చేస్తాను. వారిని అసహ్యకారణంగా చేస్తాను. తిరస్కారానికీ శాశ్వత నాశనానికీ గురి చేస్తాను.
[10] “సంతోషానందాల ధ్వనులూ, పెండ్లికొడుకుల, పెండ్లికూతుళ్ళ స్వరమూ, తిరగటిరాళ్ళు చేసే చప్పుడూ, దీపాల వెలుగూ వారి మధ్య లేకుండా చేస్తాను.
[11] ఈ దేశమంతా పాడైపోతుంది, శిథిలాలవుతుంది. ఈ జనాలు బబులోను రాజుకు డెబ్భై ఏళ్ళు సేవ చేస్తారు.”
[12] యెహోవా ఇంకా అన్నాడు: “ఆ డెబ్భై ఏళ్ళు గడిచిన తరువాత, నేను బబులోను రాజునూ, ఆ జనాన్నీ, కల్దీయదేశాన్నీ వాళ్ళ అపరాధాలకారణంగా దండిస్తాను. ఆ దేశాన్ని ఎప్పటికీ పాడుగా ఉండేలా చేస్తాను.
[13] నేను ఆ దేశానికి వ్యతిరేకంగా చెప్పిన మాటలన్నిటి ప్రకారం దానిపట్ల నెరవేరుస్తాను. ఆ సంగతులన్నీ ఈ గ్రంథంలో వ్రాసివున్నాయి. వాటిని యిర్మీయా జాతులన్నిటికీ వ్యతిరేకంగా దైవావేశ పూర్వకంగా పలికాడు.
[14] బబులోనువాళ్ళ పనులకూ, వాళ్ళు చేతులతో చేసినవాటికీ అనుగుణంగా వాళ్ళకు ప్రతీకారం చేస్తాను. అనేక దేశాలవాళ్ళు, గొప్ప రాజులు వాళ్ళను తమకు దాసులుగా చేస్తారు.”
[15] ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నా చేతిలోని ఈ ద్రాక్షరసం పాత్ర కోపంతో నిండి ఉంది. నీవు దానిని చేతపట్టుకో. నేను నిన్ను పంపిన జనాలన్నిటిచేతా అది త్రాగించు.
[16] దానిని త్రాగి వాళ్ళు తూలుతూ పిచ్చివారిలాగా అయిపోతారు. దానికి కారణం నేను వాళ్ళమధ్యకు పంపిన ఖడ్గం.”
[17] అలాగే యెహోవా చేతిలో ఉన్న ఆ పాత్రను నేను చేతపట్టుకొన్నాను, యెహోవా నన్ను పంపిన జనాలన్నిటిచేతా అది త్రాగించాను.
[18] జెరుసలంనూ, యూదా పట్టణాలనూ, వాటి రాజులనూ, అధికారులనూ, త్రాగేలా చేశాను. వారూ అవీ నాశనమై, అసహ్యకారణంగా ఉండి, తిరస్కారానికీ శాపానికీ గురి కావాలని యెహోవా సంకల్పించాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది.
[19] నేను త్రాగేలా చేసిన ఇతరులెవరంటే, ఈజిప్ట్‌రాజు ఫరో, అతడి పరివారం, అధికారులు, అతడి ప్రజలంతా, అక్కడ ఉన్న విదేశీయులంతా;
[20] ఊజు దేశం రాజులందరూ; ఫిలిష్తీయ దేశం రాజులందరూ (అష్కెలోను రాజు, గాజా రాజు, ఎక్రోను రాజు, అష్డోదులో మిగిలినవాళ్ళ రాజు);
[21] ఎదోంవాళ్ళు, మోయాబువాళ్ళు, అమ్మోను సంతతివాళ్ళు;
[22] తూరుదేశం రాజులంతా; సీదోనునగర రాజులంతా; సముద్రం అవతలి తీరాల రాజులు;
[23] దదానువాళ్ళు, తేమావాళ్ళు, బూజువాళ్ళు, గడ్డం ప్రక్కలు గొరిగించుకొన్న వారంతా;
[24] అరేబియా రాజులంతా, ఎడారిలో ఉంటున్న విదేశీ రాజులంతా;
[25] జిమ్రీ, ఏలాం, మాదీయ రాజులందరూ;
[26] ఉత్తర దిక్కున దగ్గరగా, దూరంగా ఉన్న రాజులందరూ – ఒకడి తరువాత ఒకడు, భూమిమీద ఉన్న లోక రాజ్యాలన్నీ ఆ పాత్రలోది త్రాగేలా చేశాను. వాళ్ళ తరువాత త్రాగవలసినది షీషక్ రాజు.
[27] “అప్పుడు నీవు వాళ్ళకు ఇలా చెప్పాలి: ఇస్రాయేల్‌ప్రజల దేవుడూ, సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, త్రాగండి! మత్తెక్కేవరకు త్రాగి కక్కండి! నేను మీమధ్యకు పంపించే ఖడ్గంవల్ల పడి, ఇక ఎప్పటికీ లేవకుండా ఉండండి!
[28] వాళ్ళు నీ చేతిలో ఉన్న పాత్రను చూచి ‘త్రాగము’ అంటే, నీవు వాళ్ళతో ఇలా చెప్పు: సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, మీరు త్రాగితీరాలి.
[29] ఇదిగో, నా పేరు ఉన్న నగరం మీదికి విపత్తు రప్పించడం ఆరంభం చేస్తున్నాను. మీరు దండన తప్పించుకొంటాం అనుకొంటున్నారా? మీరు తప్పించుకోరు. ఎందుకంటే భూమిమీద ఉంటున్న వాళ్ళందరిమీదికీ నేను ఖడ్గం రప్పిస్తున్నాను. ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు.
[30] “గనుక నీవు వాళ్ళకు వ్యతిరేకంగా ఈ మాటలన్నీ ప్రకటించి చెప్పాలి: యెహోవా పైనుంచి గర్జిస్తాడు. తన పవిత్ర నివాసంనుంచి స్వరమెత్తి పలుకుతాడు. తన దేశానికి వ్యతిరేకంగా ఆయన బిగ్గరగా గర్జిస్తాడు. ద్రాక్షగానుగ తొట్టి త్రొక్కేవాళ్ళలాగా కేకలు వేస్తాడు. భూమిమీద నివాసముంటున్న వాళ్ళందరికీ వ్యతిరేకంగా కేకలు వేస్తాడు.
[31] ఆ ఘోష భూమి కొనలవరకూ చేరుతుంది. ఎందుకంటే, యెహోవా జనాలమీద నేరారోపణ చేస్తాడు, మనుషులందరికీ తీర్పు తీరుస్తాడు, దుర్మార్గులను ఖడ్గానికి గురి చేస్తాడు. ఇది యెహోవా వాక్కు.”
[32] సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, “ఇదిగో! ఒక జనం దగ్గరనుంచి ఇంకో జనందగ్గరికి కీడు వ్యాపిస్తూ ఉంది. భూమి అంచులనుంచి గొప్ప తుఫాను చెలరేగుతుంది.
[33] ఆ రోజు యెహోవాచేత హతం అయినవాళ్ళు భూమి ఆ కొననుంచి ఈ కొనవరకు ఉంటారు. వాళ్ళకోసం ఎవరూ ఏడవరు. వాళ్ళను పోగు చేయరు, పాతిపెట్టరు. భూతలంమీద పెంటలాగా వాళ్ళు పడి ఉంటారు.”
[34] కాపరులారా! ఏడ్వండి! కేకలు పెట్టండి! మందలో నాయకులారా! బూడిదలో పొర్లాడండి! ఎందుకంటే, మీరు హతమయ్యే రోజులు వచ్చాయి. మీరు చెదరిపోయే రోజులు వచ్చాయి. ప్రశస్త పాత్రలాగా మీరు పడుతారు.
[35] ఈ కాపరులకు దాక్కోవడానికి చోటు ఉండదు.
[36] కాపరుల కేకలు, మంద నాయకుల ఏడుపు వినబడుతూ ఉన్నాయి! యెహోవా వాళ్ళ పచ్చిక మైదానాల్ని నాశనం చేస్తున్నాడు.
[37] ప్రశాంతంగా ఉన్న మైదానాలు యెహోవా కోపాగ్నికి పాడైపోతున్నాయి.
[38] గుహలోనుంచి సింహం వచ్చినట్టు ఆయన బయలుదేరాడు. దౌర్జన్యపరుల ఖడ్గం చేత, యెహోవా కోపాగ్నికి, వాళ్ళ దేశం పాడైపోతుంది.