[1] “బెన్యామీను వంశంవారలారా! జెరుసలం నుంచి పారిపోండి! తెకోవలో పొట్టేలు కొమ్ము ఊదండి! బేత్‌హకెరెంలో గుర్తును పెట్టండి! ఎందుకంటే, ఉత్తర దిక్కునుంచి విపత్తు వస్తూ ఉంది. గొప్ప నాశనం కలగబోతూ ఉంది.
[2] అందంగా నాజూకుగా ఉన్న సీయోను కుమారిని నేను పూర్తిగా పాడు చేస్తాను.
[3] దానిలోకి కాపరులు మందలను తోలుకువస్తారు, దాని చుట్టూరా తమ డేరాలు వేసుకొంటారు. ఒక్కొక్కరు తమకు ఇష్టం వచ్చినచోట మందను మేపుతారు.”
[4] “దానిమీదికి యుద్ధానికి సిద్ధం కండి! మధ్యాహ్నం దాని పైబడుదాం! లెండి! అయ్యో, ప్రొద్దు క్రుంకుతూ ఉంది. సందెచీకటి నీడలు ఎక్కువవుతున్నాయి.
[5] రాత్రి పూట లేచి దానిపైబడి దాని కోటలను నాశనం చేద్దాం.”
[6] సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, “చెట్లు నరికివేయండి. జెరుసలం చుట్టూ ముట్టడి వేయండి. ఈ నగరం నిండా దురన్యాయం ఉంది. గనుక అది శిక్షకు గురి కావాలి.
[7] ఊటలోనుంచి జలాలూరినట్లు దానిలోనుంచి దాని చెడుగు పెల్లుబుకుతూ ఉంటుంది. దానిలో దౌర్జన్యం, బలాత్కారం చప్పుడు వినబడుతూ ఉంది. దానిలో ఉన్న గాయాలు, దెబ్బలు ఎప్పుడూ నాముందే ఉన్నాయి.
[8] జెరుసలం! హెచ్చరిక పాటించు; లేదా, నీ విషయం నా మనసు విరిగి, నిన్ను నాశనం చేసి, నిర్జన ప్రదేశంగా చేసి విడుస్తాను.”
[9] సేనలప్రభువు యెహోవా ఇలా చెపుతున్నాడు: “ఇస్రాయేల్‌ప్రజలో మిగిలినవాళ్ళను ద్రాక్షపండ్లను పరిగె ఏరినట్టు ఏరుతారు. ద్రాక్షపండ్లను ఏరేవాడు దాని తీగెలమీద మళ్ళీ చేయి వేసినట్టు వాళ్ళమీద చేయి వెయ్యి.”
[10] వాళ్ళ చెవులు మూత పడినవి. వాళ్ళు వినలేరు. నేను ఎవరితోను మాట్లాడాలి? ఎవరిని హెచ్చరించాలి? నేను చెప్పేది ఎవరు వింటారు? యెహోవా వాక్కు అంటే వాళ్ళకు ఏమీ ఇష్టం లేదు. వాళ్ళు దానిని తృణీకరిస్తున్నారు.
[11] నేను యెహోవా కోపంతో నిండి ఉన్నాను. దానిని పట్ట లేనంతగా అలసివున్నాను. యెహోవా ఇలా చెపుతున్నాడు: “ఆ కోపాన్ని వీధుల్లో ఉన్న పిల్లలమీద, యువకుల గుంపులమీద కుమ్మరించు. భార్యాభర్తలనూ వయసు మళ్లిన ముసలివారినీ పట్టుకుపోవడం జరుగుతుంది.
[12] ఈ దేశంలో నివాసముంటున్న వారిమీద నా చెయ్యి చాపేటప్పుడు వారి ఇండ్లు, పొలాలు, వారి భార్యలతోపాటు ఇతరుల వశం అవుతాయి.
[13] “వాళ్ళంతా – అల్పులైనా గొప్పవాళ్ళయినా అన్యాయంగా సంపాదించుకోవాలని చూస్తారు. ప్రవక్తలు, యాజులు అందరూ మోసంగా ప్రవర్తిస్తారు.
[14] శాంతి లేనప్పుడు ‘శాంతి, శాంతి’ అంటూ వాళ్ళు నా ప్రజ గాయాన్ని పైపైనే నయం చేస్తున్నారు.
[15] తమ అసహ్యమైన ప్రవర్తన కారణంగా వాళ్ళు సిగ్గుపడ్డారా? సిగ్గుపడనే లేదు. సిగ్గు అంటే ఏమిటో వాళ్ళకు తెలియదు. గనుక వాళ్ళు కూలిపోయేవాళ్ళతో కూడా కూలుతారు. నేను వాళ్ళను దండించేటప్పుడు వాళ్ళు పడిపోతారు. ఇది యెహోవా వాక్కు.”
[16] యెహోవా చెప్పేదేమిటంటే, “అడ్డుత్రోవల దగ్గర నిలబడి చూస్తూ ఉండండి. పాత త్రోవలను గురించి అడగండి. మంచి మార్గమేదో అని అడిగి అందులో నడుచు కోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. అయితే వాళ్ళు ‘మేము అందులో నడవమ’ని బదులు చెప్పారు.
[17] నేను మీమీద కావలివారిని నియమించి ‘పొట్టేలు కొమ్ము బూర ధ్వని వినండి’ అన్నాను. అయితే వాళ్ళు ‘మేము వినమ’ని బదులు చెప్పారు.
[18] ఇతర జనాల్లారా! వినండి! సాక్షులారా! వారికేమి జరగబోతుందో తెలుసుకోండి.
[19] భూమి, విను! ఈ ప్రజ నా మాటలు పెడచెవిని పెట్టారు. నా ధర్మశాస్త్రాన్ని నిరాకరించారు గనుక వాళ్ళ దురాలోచనల ఫలంగా వాళ్ళమీదికి విపత్తు తెప్పిస్తున్నాను.
[20] నా జనమా! షేబ ప్రాంతంనుంచి వచ్చే సాంబ్రాణి ధూపం నాకెందుకు? మీ హోమాలు నాకు అంగీకారం కావు, మీ బలులు ఇష్టమైనవి కావు.”
[21] అందుచేత యెహోవా చెప్పేదేమిటంటే, “ఈ ప్రజ ఎదుట అడ్డంకులు ఉంచుతాను. వాటివల్ల తండ్రులూ కొడుకులూ ఏకంగా తొట్రుపడతారు. పొరుగువాళ్ళూ స్నేహితులూ నాశనం అవుతారు.”
[22] యెహోవా ఇలా చెపుతున్నాడు: “ఇదిగో, వినండి: ఉత్తర దేశంనుంచి ఒక సైన్యం వస్తూ ఉంది. భూమి కొనలలో బలంగల జనం లేస్తూ ఉంది.
[23] వాళ్ళు విండ్లు, ఈటెలు చేతపట్టుకొని వస్తున్నారు. వాళ్ళు క్రూరులూ, జాలిలేనివాళ్లూ. వాళ్ళు చేసే చప్పుడు సముద్ర ఘోషలాంటిది. వాళ్ళు గుర్రాలెక్కి, సైన్యవ్యూహం తీరి ఉన్నారు. సీయోను కుమారీ, వాళ్ళు నీమీదికి వస్తున్నారు.”
[24] దాని గురించిన వార్త మాకు వినబడింది. మా చేతులు పడిపొయ్యాయి. స్త్రీకి కలిగే ప్రసవ వేదనలాంటి బాధ మాకు పట్టుకొంది.
[25] పొలానికి వెళ్ళవద్దు, దారిన నడవవద్దు. ఎందుకంటే శత్రువు చేతిలో కత్తి ఉంది. ఎటు చూచినా భయం తాండవిస్తుంది.
[26] నా ప్రజలారా, అకస్మాత్తుగా నాశనం చేసేవాడు మనమీదికి వస్తాడు, గనుక గోనెపట్ట కట్టుకొని, బూడిదలో దొర్లండి. ఒకే ఒక కొడుకు చనిపోతే శోకించినట్టు శోకించండి. మహా రోదనం చేయండి.
[27] “నీవు నా ప్రజ విధానాలను పరీక్షించి తెలుసుకోవాలని వారిమధ్య నిన్ను నాణ్యం చూచేవాడులాగా, లోహం పరీక్షించే వాడులాగా నియమించాను.
[28] వాళ్ళంతా బాగా తిరుగుబాటు చేసేవాళ్ళు, చాడీకోరులు. వాళ్ళు ఇనుము ఇత్తడిలాంటివాళ్ళు. వాళ్ళంతా వినాశకారులు.
[29] నిప్పులో సీసం కరిగిపోయేలా కొలిమి తిత్తులు బాగా ఊదుతూ ఉన్నాయి. అయితే శుద్ధి క్రియ వ్యర్థంగా సాగుతూ ఉంది – దుర్మార్గులు వేరుపడడం లేదు.
[30] యెహోవా వాళ్ళను విసర్జించాడు గనుక వాళ్ళను ‘విసర్జించిన వెండి’ అంటారు.”