Skip to content
Opens in a new window

[1] యూదా రాజైన యోషీయా కొడుకు యెహోయాకీం పరిపాలన ఆరంభంలో యెహోవానుంచి ఈ వాక్కు వచ్చింది:

[2] “యెహోవా చెప్పేదేమిటంటే, నీవు యెహోవా ఆలయం ఆవరణంలో నిలబడివుండు; యెహోవా ఆలయంలో ఆరాధించడానికి యూదా పట్టణాలన్నిటినుంచీ ప్రజలు వస్తూ ఉంటే, చెప్పమని నేను నీకిచ్చిన మాటలన్నీ వారికి ప్రకటించు. వాటిలో ఒక్క మాట కూడా విడిచిపెట్టకు.

[3] ఒకవేళ వారు విని, ఒక్కొక్కరు తమ చెడ్డ త్రోవలనుంచి మళ్ళితే, వాళ్ళ చెడ్డ పనులకారణంగా నేను వాళ్ళమీదికి రప్పిస్తాననుకొన్న విపత్తు విషయం జాలిపడతాను, దానిని రప్పించకుండా ఉంటాను.

[4] నీవు వాళ్ళతో ఇలా చెప్పు: యెహోవా చెప్పేదేమిటంటే, మీరు నా మాటలు వినకపోతే, నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తించకపోతే,

[5] నేను పొద్దున్నే లేచి మీదగ్గరికి పంపిన నా సేవకులైన ప్రవక్తల మాటలు మీరు వినకపోతే (ఇదివరకు మీరు పెడచెవిని పెట్టారు),

[6] నేను ఈ ఆలయాన్ని షిలోహులాగా చేస్తాను. భూమిమీద ఉన్న అన్ని దేశాలవారికీ ఈ నగరాన్ని శాపంగా చేస్తాను.”

[7] యిర్మీయా యెహోవా ఆలయంలో ఈ మాటలు పలుకుతూ ఉండగా యాజులు, ప్రవక్తలు, ప్రజలంతా విన్నారు.

[8] అయితే యిర్మీయా యెహోవా చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ ప్రజలందరికీ చెప్పడం ముగించాక, యాజులు, ప్రవక్తలు, ప్రజలంతా అతణ్ణి పట్టుకొన్నారు, “నీవు చావాలి!

[9] ఈ ఆలయం షిలోహులాగా అవుతుందనీ ఈ నగరం నిర్జనమై పాడైపోతుందనీ నీవెందుకు యెహోవా పేర పలుకుతున్నావు?” అన్నారు. యెహోవా ఆలయంలో ప్రజలంతా యిర్మీయా చుట్టూ గుమికూడారు.

[10] యూదా అధికారులు ఈ విషయం విన్నారు. వెంటనే వాళ్ళు రాజు నగరునుంచి యెహోవా ఆలయానికి వచ్చి, యెహోవా ఆలయం “క్రొత్త ద్వారం” ప్రవేశంలో ఆసీనులు అయ్యారు.

[11] అప్పుడు యాజులూ ప్రవక్తలూ అధికారులతో, ప్రజలందరితో “ఈ మనిషి ఈ నగరానికి వ్యతిరేకంగా ప్రవక్తగా ప్రకటించాడు. మీరు చెవులారా విన్నారు గదా. వాడికి మరణశిక్ష విధించాలి” అన్నారు.

[12] అందుకు యిర్మీయా అధికారులందరితో, ప్రజలతో ఇలా చెప్పాడు: “మీరు విన్న మాటలన్నీ యెహోవా నన్ను ఈ ఆలయానికీ నగరానికీ వ్యతిరేకంగా దైవావేశపూర్వకంగా ప్రకటించుమని నన్ను పంపాడు.

[13] గనుక ఇప్పుడైనా మీ త్రోవలనూ ప్రవర్తననూ సరిదిద్దుకోండి. మీ దేవుడైన యెహోవాకు లోబడండి. అలా చేస్తే, యెహోవా మీమీదికి తేవాలనుకొన్న ఆపద రాకుండా చేస్తాడు. జాలిపడుతాడు.

[14] నా సంగతి అంటారా? నేనైతే ఇదిగో, మీ చేతుల్లో ఉన్నాను. మీకు ఏది మంచిదీ న్యాయమైనదీ అని తోస్తే అది చేయండి.

[15] అయితే ఒక విషయం బాగా తెలుసుకోండి – ఈ మాటలన్నీ మీరు వినేలా చెప్పడానికి నిజంగా యెహోవా నన్ను పంపాడు గనుక మీరు నన్ను చంపితే నిర్దోషి రక్తాపరాధం మీమీదికీ ఈ నగరంమీదికీ ఇక్కడి కాపురస్థులమీదికీ తెచ్చుకొన్న వారవుతారు.”

[16] అప్పుడు అధికారులు, ప్రజలందరూ యాజులతో, ప్రవక్తలతో ఇలా అన్నారు: “ఈ మనిషి మన దేవుడైన యెహోవా పేర మనతో మాట్లాడాడు గనుక ఇతడు మరణశిక్షకు తగినవాడు కాడు.”

[17] దేశంలో పెద్దల్లో కొంతమంది లేచి అక్కడ సమకూడిన ప్రజలందరితో ఇలా చెప్పారు:

[18] “యూదా రాజైన హిజ్కియా రోజుల్లో మోరషతు గ్రామంవాడైన మీకా ప్రవక్తగా పలికాడు, సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, సీయోనును పొలంలాగా దున్నడం జరుగుతుంది. జెరుసలం పాడు దిబ్బలు అవుతుంది. ఆలయమున్న పర్వతం అడవి కొండలాగా అవుతుంది” అని యూదా ప్రజలందరితో చెప్పాడు.

[19] యూదా రాజు హిజ్కియా గానీ, యూదాప్రజలు గానీ అతణ్ణి చంపారా? హిజ్కియా యెహోవాకు భయపడి, దయ చూపమని యెహోవాను ప్రాధేయపడ్డాడు గదా. వాళ్ళకు వ్యతిరేకంగా చెప్పిన ఆపద విషయం యెహోవా జాలిపడి ఆ ఆపదను రప్పించలేదు గదా. అయితే మనకు మనమే గొప్ప కీడు కొనితెచ్చుకుంటున్నాం!”

[20] (కిర్యత్‌యారీం పురవాసి షెమయా కొడుకు ఊరియా కూడా ప్రవక్తగా యెహోవా పేర పలికేవాడు. అతడు ఈ నగరానికీ ఈ దేశానికీ వ్యతిరేకంగా పలికినది యిర్మీయా మాటలలాంటివే.

[21] యెహోయాకీం రాజు, అతడి యుద్ధ వీరులందరూ, అధికారులందరూ ఆ విషయం విన్నప్పుడు రాజు అతణ్ణి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఊరియా దానిని గురించి విని, భయంతో ఈజిప్ట్‌కు పారిపోయాడు.

[22] అయితే యెహోయాకీంరాజు, అక్బోరు కొడుకైన ఎల్‌నాతానునూ అతడితోకూడా మరి కొంతమందినీ ఈజిప్ట్‌కు పంపాడు.

[23] వాళ్ళు అతణ్ణి ఈజిప్ట్‌నుంచి యెహోయాకీంరాజు దగ్గరికి పట్టుకువచ్చారు. రాజు అతణ్ణి ఖడ్గంతో హతం చేయించాడు. అతడి మృతదేహాన్ని సామాన్య ప్రజల సమాధుల మధ్య పారవేయించాడు.)

[24] అయినా షాఫాను కొడుకు అహీకాం యిర్మీయాకు సహాయపడ్డాడు, గనుక వాళ్ళు అతణ్ణి చంపడానికి ప్రజలకు అప్పగించలేదు.

యిర్మీయా — Chapters