[1] యెహోవా నాతో ఇలా చెప్పాడు: “వెళ్ళి నీ నడుముకు ఒక అవిసెనార తుండు గుడ్డ కొనుక్కో. దానిని నడికట్టుగా కట్టుకో. దానిని నీళ్ళలో పెట్టవద్దు.”
[2] అలాగే, యెహోవా మాట ప్రకారం ఆ గుడ్డ కొని నా నడుముకు కట్టుకొన్నాను.
[3] రెండోసారి యెహోవా నాతో మాట్లాడాడు –
[4] “నీవు కొని నడుముకు కట్టుకొన్న నడికట్టును చేతపట్టుకొని యూఫ్రటీసు దగ్గరికి వెళ్ళు. అక్కడ ఒక రాతి సందులో దానిని దాచిపెట్టు.”
[5] యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేను వెళ్ళి యూఫ్రటీసు ఒడ్డున దానిని దాచాను.
[6] చాలా రోజుల తరువాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “నేను నీకు యూఫ్రటీసు దగ్గర దాచిపెట్టమని చెప్పిన నడికట్టు వెళ్ళి తీసుకురా.”
[7] అలాగే నేను యూఫ్రటీసు వెళ్ళి, నడికట్టు దాచిన చోటును త్రవ్వి తీసుకొన్నాను. అది పాడైపోయి, ఎందుకూ పనికిరానిదిగా ఉంది.
[8] అప్పుడు యెహోవా వాక్కు నాకు వచ్చింది:
[9] “యెహోవా చెప్పేదేమిటంటే, అలాగే నేను యూదావారి గర్వాన్ని, జెరుసలంవారి గర్వాన్ని భంగం చేస్తాను.
[10] ఈ నడికట్టు ఎందుకూ పనికిరానిదిగా ఉంది గదా. అలాగే నా మాటలు వినడం తిరస్కరించిన ఈ చెడ్డ ప్రజ ఉంటారు. వాళ్ళు తమ హృదయంలో ఉన్న మూర్ఖత్వాన్ని అనుసరిస్తూ, ఇతర దేవుళ్ళను పూజించడానికి, సేవించడానికి వెళ్ళిపోతూ ఉన్నారు.
[11] ఒక మనిషి నడుముకు నడికట్టు కట్టుకొన్నట్టు నేను ఇస్రాయేల్ వంశమంతటినీ యూదా వంశమంతటినీ నా చుట్టూ కట్టుకొన్నాను. వారు నాకు ప్రజలై ఉండి నాకు పేరుప్రతిష్టలు, ఘనత తేవాలని నా ఆశయం. అయితే వారు వినలేదు. ఇది యెహోవా వాక్కు.
[12] “నీవు వాళ్ళతో ఈ మాట చెప్పు: ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, ప్రతి ద్రాక్షమద్యం తిత్తినిండా ద్రాక్షమద్యం ఉండాలి. వాళ్ళు ‘ప్రతి ద్రాక్ష తిత్తినిండా ద్రాక్షమద్యం ఉండాలని మాకు బాగా తెలుసు గదా’ అని నీతో అంటారు.
[13] అప్పుడు నీవు వాళ్ళతో ఇలా చెప్పు: ఈ దేశంలో ఉంటున్న వాళ్ళందరినీ – దావీదు సింహాసనంమీద కూర్చుని ఉన్న రాజును, యాజులను, ప్రవక్తలను, జెరుసలం నివాసులందరినీ – మత్తుతో నింపుతాను.
[14] ఒకడిమీద ఒకడు, తండ్రులతోపాటు కొడుకులు కూలేట్టు చేస్తాను. జాలి, కరుణ, కనికరం వాళ్ళను నాశనం చేయకుండా నన్ను ఆపవు.” ఇది యెహోవా వాక్కు.
[15] యెహోవా మాట్లాడాడు. విర్రవీగకుండా, చెవిపెట్టి వినండి.
[16] మీ దేవుడు యెహోవా చీకటి కలిగించకముందే, చీకటి కమ్ముతూ ఉన్న కొండలపైన మీ కాళ్ళు తొట్రుపడకముందే ఆయనను గౌరవించండి. మీరు వెలుగుకోసం చూస్తూ ఉంటే, ఆయన దానిని చావు నీడగా, గాఢాంధకారంగా మారుస్తాడు.
[17] మీరు వినకపోతే నేను రహస్యంగా మీ గర్వానికి విలపిస్తాను. యెహోవా మందను చెరపట్టడం జరుగుతుందని కన్నీరు మున్నీరుగా ఏడుస్తాను.
[18] రాజుతో, రాజమాతతో “క్రిందికి దిగి వేరే చోట కూర్చోండి. మీ ఘనమైన కిరీటం మీ తలమీదనుంచి పడుతుంది” అను.
[19] దక్షిణ ప్రదేశం పట్టణాలు మూయబడి ఉంటాయి. వాటిని తెరిచేవాడు ఎవ్వడూ ఉండడు. యూదావాళ్ళందరినీ బందీలుగా తీసుకుపోవడం జరుగుతుంది.
[20] మీ తలెత్తి, ఉత్తర దిక్కునుంచి వస్తూ ఉన్న వాళ్ళను చూడండి. నీకిచ్చిన అందమైన మంద ఎక్కడ ఉంది?
[21] నీకు నీవే వాళ్ళను మిత్రులుగా చేసుకొన్నావు. యెహోవా వాళ్ళనే నీపై అధికారులుగా నియమించేటప్పుడు నీవేం చెపుతావు? ప్రసవిస్తూవున్న స్త్రీలాగా నీవు వేదనపాలవుతావు గదా.
[22] “నాకెందుకు ఇలా సంభవించింది?” అని నీవు మనసులో అనుకొంటే అనేకమైన నీ అపరాధాలే దానికి కారణమని తెలుసుకో, అందుకే నీ బట్టలు తీసివేయడం, నీ కాళ్ళు కనుపరచడం జరుగుతుంది.
[23] “కూషు దేశస్తుడు తన చర్మం మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలదా? అది సాధ్యమైతే చెడుగు చేయడం అలవాటుపడ్డ మీరు మంచి చేయడం కూడా వీలవుతుంది.
[24] ఎడారి గాలి ఎగరగొట్టే పొట్టులాగా మిమ్మల్ని నేను చెదరగొట్టివేస్తాను.
[25] మీరు నన్ను మరచిపోయి అబద్ధాలను నమ్ముకొన్నారు, గనుక అదే మీ వంతు, నేను మీకు కొలిచిన భాగం. ఇది యెహోవా వాక్కు.
[26] నేనే మీ బట్టల అంచులను మీ ముఖంమీద పడేలా చేస్తాను. అప్పుడు మీ సిగ్గు కనిపిస్తుంది.
[27] నీ వ్యభిచారం, కామాతురత వెల్లడి చేసే మీ సకిలింపులు, కొండలపై, పొలాలలో మీ నీచమైన పడుపు పనులు నాకు కనిపించాయి. నీ అసహ్యమైన కార్యాలన్నీ నేను చూశాను. అయ్యో, జెరుసలం! నీకు బాధ తప్పదు. ఎన్నాళ్ళు నీవు శుద్ధి కాకుండా ఉంటావు?”