Skip to content
Opens in a new window

[1] యూదా రాజు సిద్కియా పరిపాలించిన తొమ్మిదో సంవత్సరం, పదో నెలలో బబులోను రాజు నెబుకద్‌నెజరు తన సైన్యమంతటితో వచ్చి జెరుసలంను ముట్టడి వేశాడు.

[2] సిద్కియా పరిపాలనలో పదకొండో సంవత్సరం, నాలుగోనెల, తొమ్మిదోరోజున నగర ప్రాకారానికి రంధ్రం చేసి జెరుసలంను పట్టుకొన్నారు.

[3] అప్పుడు బబులోను రాజు అధికారులందరూ – నేర్గల్‌షరేజరు, సమర్‌నెబో, అధికారులలో ప్రముఖుడు శర్‌సెకీం, ప్రధానుడు నేర్గల్‌షరేజరు, ఇతర అధికారులందరూ నగరంలోపలికి వచ్చి “మధ్య ద్వారం”లో కూర్చున్నారు.

[4] యూదా రాజు సిద్కియా, సైనికులంతా వాళ్ళను చూచి పారిపోయారు. వారు నగరంనుంచి రాత్రివేళ బయలుదేరి, రాజు తోటగుండా రెండు గోడలమధ్య ఉన్న గుమ్మంద్వారా వెళ్ళారు. రాజు అరాబా లోయవైపు వెళ్ళాడు.

[5] అయితే కల్దీయవాళ్ళ సైన్యం వారిని తరిమి, యెరికో మైదానాల్లో సిద్కియాను పట్టుకొన్నారు. అప్పుడు బబులోను రాజు నెబుకద్‌నెజరు హమాతు ప్రదేశంలో రిబ్లాలో ఉన్నాడు. వాళ్ళు సిద్కియాను అక్కడికి తీసుకుపోయారు. నెబుకద్‌నెజరు అతడికి శిక్ష విధించాడు.

[6] రిబ్లాలోనే బబులోను రాజు సిద్కియా కొడుకులను అతడి కండ్లముందే హతం చేశాడు. బబులోను రాజు యూదా గొప్ప వంశస్థులందరినీ హతమార్చాడు.

[7] అప్పుడతడు సిద్కియా కండ్లు ఊడబెరికించాడు. అతణ్ణి బబులోనుకు తీసుకుపోవడానికి కంచు సంకెళ్ళతో బంధించాడు.

[8] కల్దీయవాళ్ళు రాజు నగరునూ, ప్రజల ఇండ్లనూ తగలబెట్టారు. జెరుసలం ప్రాకారాలను పడగొట్టారు.

[9] కావలివాళ్ళకు అధిపతి నెబుజరదాన్ నగరంలో మిగిలినవాళ్ళనూ, నగరం విడిచి తనదగ్గరికి చేరినవాళ్ళనూ, మిగతా ప్రజలందరినీ బబులోనుకు బందీలుగా తీసుకు పోయాడు.

[10] కావలివాళ్ళకు అధిపతి నెబుజరదాన్ ఏమీ ఆస్తిలేని దరిద్రులను కొంతమందిని యూదాదేశంలో ఉండనిచ్చాడు, వారికి పొలాలు, ద్రాక్షతోటలు ఇచ్చాడు.

[11] బబులోను రాజైన నెబుకద్‌నెజరు కావలివాళ్ళకు అధిపతి నెబుజరదాన్‌కు యిర్మీయాను గురించి ఈ ఆజ్ఞ ఇచ్చాడు:

[12] “అతణ్ణి తీసుకొని కాపాడు. అతడికి ఏమీ హాని చేయకు. అతడు నీతో చెప్పినట్టే అతడికోసం చెయ్యి.”

[13] అందుచేత కావలివాళ్ళ అధిపతి నెబుజరదాన్, అధికారులలో ఒక ప్రముఖుడు నెబుషజబాన్, ప్రధానుడు నెర్గల్‌షరేజరు, బబులోను రాజు ప్రధాన అధికారులందరూ మనుషులను పంపి,

[14] కాపలావాళ్ళ ఆవరణంలోనుంచి యిర్మీయాను తెప్పించారు. అతణ్ణి ఇంటికి తీసుకుపోవడానికి షాఫాను మనుమడూ, అహీకాం కొడుకూ అయిన గెదల్యాకు అప్పగించారు. యిర్మీయా తన ప్రజలమధ్య ఉండిపోయాడు.

[15] యిర్మీయా ఇంకా కాపలావాళ్ళ ఆవరణంలో ఉన్నప్పుడు యెహోవానుంచి వాక్కు అతడికి వచ్చింది.

[16] అదేమిటంటే, “వెళ్ళి కూషువాడైన ఎబెద్‌మెలెకుతో ఇలా చెప్పు: ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, ఈ నగరాన్ని గురించి నేను చెప్పిన మాటలను కీడుకే నెరవేరుస్తాను గాని, మంచికి కాదు. అవి ఆ రోజు నీ కళ్ళముందే నెరవేరుతాయి.

[17] అయితే ఆ రోజున నేను నిన్ను విడిపిస్తాను – నీవు భయపడుతున్నవాళ్ళ చేతిలో చిక్కుపడవు. ఇది యెహోవా వాక్కు.

[18] నీవు నన్ను నమ్ముకొన్నావు, గనుక నేను నిన్ను తప్పక కాపాడుతాను. నీవు ఖడ్గానికి కూలవు. దోపిడీసొమ్ములాగా నీ ప్రాణం దక్కుతుంది. ఇది యెహోవా వాక్కు.”

యిర్మీయా — Chapters