[1] యెహోవా చెప్పేదేమిటంటే, “ఇదిగో వినండి, బబులోనుమీదికి, దానిలో ఉంటూ నన్ను ఎదిరించినవాళ్ళ మీదికి నేను వినాశకారి ఆత్మను రేపుతాను.
[2] విదేశీయులను బబులోనుకు పంపిస్తాను. వాళ్ళు ఆ దేశాన్ని తూర్పారబట్టి ఖాళీ చేస్తారు. ఆ విపత్తు కాలంలో వాళ్ళు అన్ని వైపులనుంచి దానిమీదికి వస్తారు.
[3] విలుకాడు విల్లు వంచకుండా, కవచం వేసుకొనేవాడు వేసుకోకుండా హతం కావాలి. వాళ్ళు యువకులను హతం చేయకుండా విడిచిపెట్టకూడదు. బబులోను సైన్యమంతటినీ పూర్తిగా నాశనం చేయాలి.
[4] కల్దీయ దేశంలో వాళ్ళు హతమై కూలుతారు, దాని వీధులలో చావు దెబ్బలు తింటారు.
[5] ఎందుకని? ఇస్రాయేల్‌ప్రజనూ యూదాప్రజనూ వారి దేవుడూ సేనలప్రభువూ అయిన యెహోవా విసర్జించలేదు. ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుని దృష్టికి వారి దేశం అపరాధంతో నిండి ఉన్నా, ఆయన వారిని విసర్జించలేదు.
[6] “బబులోనునుంచి పారిపోండి! మీ ప్రాణాలు దక్కించుకోండి! దాని దోషాల కారణంగా నాశనం కాకండి! ఇది యెహోవా ప్రతీకారం చేసే సమయం. అది చేసిన దానికి ఆయన ప్రతిఫలమిస్తాడు.
[7] బబులోను యెహోవా చేతిలో బంగారు పాత్రలాంటిది. అది లోకమంతా మత్తిల్లేలా చేసింది. దాని ద్రాక్ష మద్యం జనాలు త్రాగాయి, గనుక జనాలు పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నాయి.
[8] బబులోను హఠాత్తుగా కూలి చితికిపోతుంది. దానికోసం రోదనం చేయండి! దాని బాధకు మందు తీసుకురండి! ఒకవేళ బబులోను నయం అవుతుందేమో.”
[9] మనం బబులోనును నయం చేయాలని ప్రయత్నించాం గాని, అది నయం కాలేదు. దాని శిక్ష ఆకాశం వరకు ఉంటుంది, మేఘాల వరకు ఎక్కుతుంది, గనుక బబులోనును వదలిపెట్టి ఒక్కొక్కరం మన మన సొంత దేశాలకు వెళ్దాం పదండి.
[10] యెహోవా మన న్యాయాన్ని వెల్లడి చేశాడు. మన దేవుడు యెహోవా చేసినది సీయోనులో చెప్పుదాం రండి.
[11] బాణాలకు పదును పెట్టండి! డాళ్ళను చేతపట్టుకోండి! బబులోనును నాశనం చేయడమే యెహోవా ఉద్దేశం గనుక ఆయన మాదీయ రాజులను ప్రేరేపించాడు. యెహోవా ప్రతీకారం చేస్తున్నాడు, తన ఆలయం విషయం ప్రతిక్రియ జరిగిస్తున్నాడు.
[12] బబులోను ప్రాకారాలకు ఎదురుగా జెండా ఎత్తండి! కాపలావాళ్ళను నియమించి, కాపలా గట్టిగా చూడండి! మాటులను సిద్ధం చేయండి! బబులోను నగరవాసులను గురించి తాను ఆలోచన చేసి చెప్పినదానిని యెహోవా నెరవేరుస్తూ ఉన్నాడు.
[13] నీవు సమృద్ధి అయిన నీళ్ళమీద కూర్చుని ఉన్నావు. నీ ఆస్తిపాస్తులు విస్తారంగా ఉన్నాయి. అయితే నీ అంతం వచ్చింది. నీవు దోపిడీ సొమ్ము అయ్యే సమయం వచ్చింది.
[14] మిడతలలాగా మనుషులతో నిన్ను నింపుతాననీ, వాళ్ళు నీ మీద విజయధ్వనులు చేస్తారనీ సేనలప్రభువు యెహోవా తనమీదనే ఒట్టుపెట్టి చెపుతున్నాడు.
[15] ఆయన తన బలంచేత భూమిని సృజించాడు, తన జ్ఞానాన్ని అనుసరించి ప్రపంచాన్ని స్థాపించాడు, తన తెలివి ద్వారా ఆకాశాన్ని పరచాడు.
[16] ఆయన తన కంఠం వినిపిస్తే ఆకాశంలో నీళ్ళ ఘోష వినబడుతుంది. భూమి కొనలలోనుంచి మబ్బులు ఎక్కేలా చేస్తాడు, వానతోపాటు మెరుపులు పుట్టిస్తాడు. తన ఖజానాలలోనుంచి గాలిని రప్పిస్తాడు.
[17] జ్ఞానం విషయంలో ప్రతి మనిషి తెలివితక్కువవాడు. పోతపోసే ప్రతివాడూ తను చేసిన విగ్రహాల మూలంగా సిగ్గుపాలవుతాడు. ఆ విగ్రహాలు మోసకరమైనవి. వాటిలో ప్రాణం లేదు.
[18] అవి నిష్‌ప్రయోజనమైనవి, తిరస్కారానికి తగినవి. అవి తీర్పుకు గురి అయ్యే సమయంలో నిర్మూలం అవుతాయి.
[19] యాకోబుకు చెందినవాడు వాటిలాంటివాడు కాడు. ఆయనే సమస్తాన్నీ కలగజేశాడు. తన సొత్తుగా ఉన్న ఇస్రాయేల్ వంశాన్ని కూడా కలగజేశాడు. ఆయన పేరు సేనలప్రభువు యెహోవా.
[20] “నీవు నాకు గదలాంటి వాడివి. యుద్ధాయుధం వంటి వాడివి. నీతో నేను జనాలను చితకగొట్టివేస్తాను. నీతో రాజ్యాలను నాశనం చేస్తాను.
[21] నీతో గుర్రాన్ని, రౌతును చితకగొట్టివేస్తాను. నీతో రథాన్ని, సారథిని చితకగొట్టివేస్తాను.
[22] నీతో పురుషుణ్ణి స్త్రీని చితకగొట్టివేస్తాను. నీతో యువకుణ్ణి, యువతిని చితకగొట్టివేస్తాను.
[23] నీతో కాపరిని, మందను చితకగొట్టివేస్తాను. నీతో రైతును, ఎద్దులను చితకగొట్టివేస్తాను. నీతో పరిపాలకులను, అధిపతులను చితకగొట్టివేస్తాను.
[24] బబులోను వాళ్ళు, కల్దీయ దేశవాసులు సీయోనులో జరిగించిన కీడంతటి కారణంగా నేను వాళ్ళందరికీ మీ కండ్ల ముందే ప్రతీకారం చేస్తాను. ఇది యెహోవా వాక్కు.
[25] నీవు నాశనం చేసే పర్వతం లాగా ఉన్నావు. నీవు లోకమంతటినీ నాశనం చేస్తున్నావు. నేను నీకు విరోధిని. ఇది యెహోవా వాక్కు. నేను నీమీదికి నా చెయ్యి చాపుతాను, నిటారుగా ఉన్న స్థలాలపైనుంచి నిన్ను దొర్లిస్తాను. కాలిపోయిన పర్వతంగా నిన్ను చేస్తాను.
[26] మూలకు గానీ పునాదికి గానీ నీలోనుంచి మనుషులు ఏ రాయి తీసుకోరు. నీవు ఎప్పటికీ పాడై ఉంటావు. ఇది యెహోవా వాక్కు.
[27] “దేశంలో జెండా ఎత్తండి! జనాల మధ్య బూర ఊదండి! దానిమీద యుద్ధం చేయడానికి జనాలను ప్రత్యేకించండి! దానిమీదికి అరారాతు, మిన్నీ, అష్కనజు అనే రాజ్యాలను పిలవనంపించండి! దానిమీదికి వచ్చే జనాలకు అధిపతిని నియమించండి! మిడతల గుంపులాగా గుర్రాలను రప్పించండి!
[28] దాని మీదికి రావడానికి మాదీయ రాజులనూ, అధిపతులనూ, నాయకులనూ, వాళ్ళ పరిపాలన క్రింద ఉన్న అన్ని దేశాలనూ ప్రత్యేకించండి!
[29] బబులోను దేశాన్ని పాడు చేయడం, అక్కడ ఎవరూ ఉండకుండా చేయడం దానిని గురించిన యెహోవా ఆలోచన. ఆ ఆలోచన నిలిచే ఉంది గనుక ఆ దేశం వణకుతూ అల్లాడిపోతూ ఉంది.
[30] బబులోను యుద్ధవీరులు యుద్ధం చేయడం మానుకొన్నారు. వాళ్ళ కోటలలో ఉండిపోయారు. వాళ్ళ బలం నీరసించిపోయింది. వాళ్ళు స్త్రీలలాగా అయ్యారు. వాళ్ళ ఇండ్లు మంటల్లో ఉన్నాయి. బబులోను తలుపుల అడ్డకడ్డీలు విరిగిపోయాయి.
[31] అతడి నగరం పూర్తిగా శత్రువుల వశం అయిందని బబులోను రాజుకు తెలియజేయడానికి బంట్రౌతు వెంట ఇంకో బంట్రౌతు, వార్తావహుడి వెంట ఇంకో వార్తావహుడు పరుగెత్తుతూ ఉన్నారు.
[32] నదిని దాటే స్థలాలను శత్రువులు పట్టుకొన్నారనీ, జమ్ముగడ్డికి నిప్పు అంటించారనీ, సైనికులు హడలి పోతున్నారనీ కూడా తెలియజేస్తున్నారు.
[33] ఇస్రాయేల్ దేవుడూ, సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేది ఏమిటంటే, బబులోను నగరం కళ్ళంలాగా ఉంటుంది. దానిని నూర్చడానికి సమయం వస్తుంది. ఇంకా కొంత కాలానికే దానికి కోతకాలం వస్తుంది.
[34] “సీయోను నివాసులు ఇలా చెపుతున్నారు: ‘బబులోను రాజు నెబుకద్‌నెజరు మమ్మల్ని దిగమ్రింగివేశాడు, ఓడగొట్టాడు, ఖాళీ పాత్రలాగా మమ్మల్ని చేశాడు. బ్రహ్మాండమైన పాములాగా వాడు మమ్మల్ని మ్రింగివేశాడు. మా మంచి పదార్థాలతో తన పొట్ట నింపుకొన్నాడు, మమ్మల్ని పడగొట్టాడు.
[35] మాకు చేసిన దౌర్జన్యం బబులోనుమీదికి వస్తుంది గాక! మా ఉసురు కల్దీయ దేశస్థులకు తగులుతుంది గాక!’ అని జెరుసలంవారు చెపుతున్నారు.
[36] అందుచేత యెహోవా చెప్పేదేమిటంటే, నేను మీ పక్షంగా వాదిస్తాను. మీ కోసం ప్రతీకారం చేస్తాను. దాని నది ఇంకిపోయేలా చేస్తాను, దాని ఊటలు ఎండిపోయేలా చేస్తాను.
[37] బబులోను పాడుదిబ్బ అవుతుంది. అది నక్కలకు ఉనికిపట్టుగా ఉంటుంది. అది అసహ్యకారణంగా హేళనకారణంగా అవుతుంది. దానిలో కాపురం చేసేవాళ్ళు ఎవరూ ఉండరు.
[38] దాని ప్రజలు ఏకంగా సింహాలలాగా గర్జిస్తున్నారు, సింహం పిల్లలలాగా గుర్రుమంటున్నారు.
[39] వాళ్ళకు ఉద్రేకం ఉండగానే నేను వాళ్ళకు విందు చేయిస్తాను, వాళ్ళను బాగా మత్తిల్లేట్టు చేస్తాను. వాళ్ళు సంబరపడి, దీర్ఘ నిద్రపోయి మరెన్నడూ మేల్కోకుండా ఉండాలని నా ఉద్దేశం. ఇది యెహోవా వాక్కు.
[40] మనుషులు గొర్రెలను, మేకపోతులను, పొట్టేళ్ళను వధకు తెచ్చినట్టు నేను వాళ్ళను క్రిందికి తెస్తాను.
[41] “షేషక్ దాని శత్రువుల వశం అవుతుంది. లోకమంతటా ప్రసిద్ధికెక్కిన నగరం పట్టబడుతుంది. జనాలలో బబులోను అసహ్యకారణంగా అవుతుంది.
[42] ప్రవాహం బబులోనుమీదికి వస్తుంది. దాని అనేక అలలు దానిని కప్పుతాయి.
[43] దానికి చెందిన ఊళ్ళు పాడైపోతాయి. ఆ ప్రాంతం ఎండిపోయిన ఎడారి అవుతుంది. అక్కడ ఎవరూ కాపురం చేయరు. దానిగుండా ఎవరూ ప్రయాణం చేయరు.
[44] నేను బబులోనులో ఉన్న బేల్‌దేవుణ్ణి దండిస్తాను. వాడు దిగమ్రింగినదానిని వాడి నోటినుంచి కక్కిస్తాను. అప్పటినుంచి జనాలు వాడి దగ్గరికి గుంపులుగా రారు. బబులోను ప్రాకారం కూలిపోతుంది.
[45] “నా ప్రజలారా! దానిలోనుంచి బయటికి రండి! అందరూ ప్రాణం దక్కించుకోండి! యెహోవా తీవ్రకోపంనుంచి తప్పించుకోండి!
[46] దేశంలో వదంతులు వినబడుతూ ఉంటే మనసులో కలవరపడకండి, భయపడకండి. ఒక సంవత్సరం ఒక వదంతి, ఇంకో సంవత్సరం వేరే వదంతి వినబడుతాయి. దేశంలో దౌర్జన్యం జరుగుతుంది. పరిపాలకుడితో ఇంకో పరిపాలకుడు పోరాడుతాడు.
[47] అయితే రాబోయే రోజుల్లో నేను బబులోను విగ్రహాల విషయం చూస్తాను. బబులోను దేశమంతా అవమానానికి గురి అవుతుంది. దానిలో హతమైన వాళ్ళు దానిమధ్య పడి ఉంటారు.
[48] ఉత్తర దిక్కునుంచి వినాశకారులు దానిమీదికి వస్తారు. అప్పుడు బబులోను గతిని చూచి ఆకాశం, భూమి, వాటిలో ఉన్నదంతా ఆనంద ధ్వనులు చేస్తాయి. ఇది యెహోవా వాక్కు.
[49] “బబులోను కారణంగా భూమి అంతట్లో హతమైనవాళ్ళు కూలారు. అలాగే ఇస్రాయేల్‌ప్రజలలో హతమైనవారి కారణంగా బబులోను కూలుతుంది.
[50] ఖడ్గాన్ని తప్పించుకొన్న వారలారా! అక్కడ నిలబడకుండా వెళ్ళిపోండి! దూరదేశంలో యెహోవాను జ్ఞప్తికి తెచ్చుకోండి, జెరుసలంను తలచుకోండి.”
[51] మేము దూషణకు గురి అయ్యాం గనుక సిగ్గుపడుతున్నాం. విదేశీయులు యెహోవా ఆలయంలో ఉన్న పవిత్ర స్థలాలలో చొరబడ్డారు.
[52] “అయితే రాబోయే రోజుల్లో బబులోను విగ్రహాల విషయం నేను చూస్తాను. దాని దేశమంతటా గాయాలు పడి మూలుగుతూ ఉండేవాళ్ళు ఉంటారు. ఇది యెహోవా వాక్కు.
[53] బబులోను ఆకాశానికి ఎక్కినా, ఎత్తుగా ఉన్న దాని బలమైన కోటను దుర్గమంగా చేసినా దానిమీదికి నేను వినాశకారులను పంపిస్తాను. ఇది యెహోవా వాక్కు.
[54] “బబులోనులోనుంచి రోదనధ్వని వినబడుతూ ఉంది! కల్దీయ దేశంనుంచి గొప్ప నాశనం జరుగుతూ ఉన్న చప్పుడు వినిపిస్తూ ఉంది!
[55] యెహోవా బబులోనును పాడు చేస్తున్నాడు, దాని మహా ఘోషను అణచివేస్తున్నాడు. వాళ్ళ అలలు విస్తార జలాలలాగా ఘోషిస్తూ ఉన్నాయి. వాళ్ళు చేసే చప్పుడు వినబడుతూ ఉంది.
[56] వినాశకారి బబులోను మీదికి వస్తున్నాడు. దాని యుద్ధవీరులను పట్టుకొంటాడు. వాళ్ళ విండ్లను ముక్కలు చేస్తాడు. యెహోవా ప్రతీకారం చేసే దేవుడు. ఆయన ఖచ్చితంగా ప్రతిఫలమిస్తాడు.
[57] బబులోను నాయకులనూ, జ్ఞానులనూ, అధికారులనూ, పరిపాలకులనూ, యుద్ధవీరులనూ త్రాగి మత్తిల్లజేస్తాడు. వాళ్ళు దీర్ఘ నిద్రపోయి మరెన్నడూ మేల్కోకుండా ఉండాలని నా ఉద్దేశం. ఇది రాజు వాక్కు. ఆయన పేరు సేనలప్రభువు యెహోవా.
[58] సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, చాలా వెడల్పుగా ఉన్న బబులోను ప్రాకారాలు నేలమట్టం అవుతాయి. దాని ఎత్తయిన ద్వారం తలుపులు కాలిపోతాయి. ప్రజల ప్రయాస వ్యర్థం. వాళ్ళు కష్టపడి అలసిపోయినది మంటల పాలయ్యేందుకే.”
[59] యూదారాజు సిద్కియా పరిపాలించిన నాలుగో సంవత్సరంలో అతడు బబులోనుకు వెళ్ళినప్పుడు అతడితో కూడా శెరాయా అనే అధిపతి వెళ్ళాడు. శెరాయా నేరీయా కొడుకు, మహసేయా మనుమడు. ఆ సంవత్సరంలో యిర్మీయాప్రవక్త శెరాయాకు ఈ సందేశం ఆజ్ఞాపూర్వకంగా ఇచ్చాడు.
[60] యిర్మీయా బబులోను మీదికి రాబోయే విపత్తులన్నిటి విషయం చుట్టిన కాగితంలో వ్రాశాడు. బబులోను గురించి ఈ మాటలన్నీ వ్రాశాడు.
[61] అప్పుడు యిర్మీయా శెరాయాతో ఇలా చెప్పాడు: “నీవు బబులోనుకు చేరినప్పుడు ఈ మాటలన్నీ చదివి వినిపించు.
[62] ఆ తరువాత ఈ విధంగా చెప్పు: ‘యెహోవా! ఈ స్థలంలో మనుషులు గానీ పశువులు గానీ ఉండకుండా దీనిని నాశనం చేస్తానని, అది ఎప్పటికీ పాడుగా ఉంటుందని నీవు మాట ఇచ్చావు.’
[63] ఈ చుట్టిన పత్రం చదవడం నీవు ముగించాక దానికి రాయి కట్టి యూఫ్రటీసు మధ్యలోకి దానిని విసిరివేయి.
[64] వెంటనే ఇలా చెప్పు: ‘యెహోవా బబులోను మీదికి రప్పించబోయే విపత్తు కారణంగా ఇలాగే అది ఇంకెన్నడూ పైకి రాకుండా మునిగిపోతుంది. దాని జనం త్వరగా గతిస్తుంది.’” ఇంతవరకు యిర్మీయా వాక్కులు సమాప్తం.