[1] యెహోవా! నీవు నిజాయితీపరుడవు. గనుక నేను నీ ఎదుట ఫిర్యాదు చేసుకొంటున్నాను. నేను నీ నిర్ణయాలను గురించి నీతో మాట్లాడాలని ఉంది. దుర్మార్గుల బ్రతుకు తీరు ఎందుకు వర్ధిల్లుతుంది? వంచకులంతా ఎందుకు సురక్షితంగా ఉంటున్నారు?
[2] నీవు వాళ్ళను నాటావు. వాళ్ళు వేరుపారి పెరిగి ఫలిస్తున్నారు. వాళ్ళ నోటి మాట వింటే నీవు దగ్గరగా ఉన్నట్టున్నావు గాని, వాళ్ళ అంతరంగానికి నీవు దూరంగా ఉన్నావు.
[3] యెహోవా, నీవు నన్ను ఎరుగుదువు. నన్ను చూస్తూవున్నావు. నీపట్ల నా హృదయాలోచనలను పరిశోధిస్తూ ఉన్నావు. వధకు సిద్ధమైన గొర్రెలలాగా వాళ్ళను ఈడ్చుకుపో! వధ జరిగే రోజుకోసం వాళ్ళను ప్రత్యేకించు!
[4] ఎన్నాళ్ళు దేశం నీరసించి ఉంటుంది? ఎన్నాళ్ళు ప్రతి పొలంలో గడ్డి ఎండిపోయి ఉంటుంది? దేశంలో కాపురముంటున్నవాళ్ళ చెడుగు కారణంగా జంతువులు, పక్షులు నాశనమయ్యాయి. ‘మనకు ఏం జరుగబోతుందో ఆయన చూడడు’ అని వాళ్ళు చెప్పుకొంటున్నారు.
[5] “నీవు పదాతులతో పరుగెత్తినప్పుడు వాళ్ళు నిన్ను అలసిపోయేలా చేస్తే, నీవు గుర్రాలతో ఎలా పోటీపడుతావు? నెమ్మదియైన ప్రాంతంలోనే నీవు నిర్భయంగా ఉంటే, యొర్దాను వరదలలో చిక్కితే ఎలా చేస్తావు?
[6] నీ సోదరులు, నీ తండ్రి ఇంటివాళ్ళే నీకు ద్రోహం చేశారు. నీ విషయం పెద్ద అలజడి కలిగించారు వాళ్ళు. నీతో మంచి మాటలు చెప్పినా వాళ్ళనూ నమ్మవద్దు.
[7] “నేను నా ఆలయాన్ని విడుస్తున్నాను. నా సొత్తును వదలివేస్తున్నాను. నా ప్రియ ప్రజను వారి శత్రువుల వశం చేస్తున్నాను.
[8] నా సొత్తు నాకు అడవిలో ఉన్న సింహంలాగా అయింది. అది నామీద గర్జిస్తూ ఉంది, గనుక దానిని అసహ్యించుకొన్నాను.
[9] నా సొత్తు నాకు పొడలు గల డేగలాగా అయింది. దానిచుట్టు ఉన్న డేగలు దానిపైబడుతాయి. వెళ్ళి, అడవి మృగాలన్నిటినీ పోగు చేయండి. అవి తినడానికి వాటిని తీసుకురండి.
[10] కాపరులు అనేకులు. వాళ్ళు నా ద్రాక్షతోటను పాడు చేశారు. నా భూభాగాన్ని పాడైపోయిన ఎడారిగా మారుస్తున్నారు.
[11] వాళ్ళు దానిని పాడు చేశారు. అది పాడుపడి నా ఎదుట దుఃఖిస్తూ ఉంది. దాని గురించి అందరూ నిర్లక్ష్యంగా ఉన్నారు గనుక దేశమంతా పాడైపోతుంది.
[12] ఎడారిలో చెట్లులేని ఎత్తు స్థలాలన్నిటిమీదికి వినాశకారులు వస్తారు. దేశంలో ఈ కొననుంచి ఆ కొనవరకు యెహోవా ఖడ్గం హతం చేస్తుంది. ఎవ్వరూ భద్రంగా ఉండరు.
[13] వాళ్ళు గోధుమలు చల్లుతారు గాని, ముండ్లు కోస్తారు. ఏమీ ప్రయోజనం లేకుండా అలసిపోతారు. యెహోవా కోపాగ్ని కారణంగా వాళ్ళ పంటవల్ల సిగ్గుపడుతారు.”
[14] యెహోవా ఇంకా చెప్పేదేమిటంటే, “నేను నా ప్రజలైన ఇస్రాయేల్‌వారికి ఇచ్చిన వారసత్వాన్ని ఆక్రమించుకొన్న నా చెడ్డ పొరుగువాళ్ళకు ఇలా చేస్తాను – వాళ్ళ దేశంలోనుంచి వాళ్ళను పెళ్ళగిస్తాను. వాళ్ళ మధ్యనుంచి యూదాప్రజను పెళ్ళగిస్తాను.
[15] వాళ్ళను అలా పెళ్ళగించిన తరువాత నేను వాళ్ళను మళ్ళీ కరుణించి ఒక్కొక్క జనాన్ని వాళ్ళ దేశానికి, వారసత్వం భూమికి వచ్చేలా చేస్తాను.
[16] మునుపు వాళ్ళు నా ప్రజకు బయల్‌దేవుడి పేర ప్రమాణం చేయడానికి నేర్పించారు. వాళ్ళు నా ప్రజల జీవిత విధానాలను బాగా నేర్చుకొని ‘యెహోవా జీవంతోడు’ అని ప్రమాణం చేయడం అభ్యసిస్తే అప్పుడు వాళ్ళు నా ప్రజలమధ్య అభివృద్ధి పొందుతారు.
[17] ఏ జనమైనా లోబడకపోతే నేను ఆ జనాన్ని పూర్తిగా పెళ్ళగించి నాశనం చేస్తాను. ఇది యెహోవా వాక్కు.