[1] ఇవి హిల్కీయా కొడుకు యిర్మీయా మాటలు. అతడు బెన్యామీను ప్రదేశంలో ఉన్న అనాతోతు గ్రామవాసులైన యాజులలో ఒకడు.
[2] ఆమోను కొడుకు యోషీయా యూదాకు రాజుగా ఉన్న పదమూడో సంవత్సరంలో యెహోవానుంచి వాక్కు యిర్మీయాకు వచ్చింది.
[3] అలాగే యోషీయా కొడుకు యెహోయాకీం యూదాకు రాజుగా ఉన్న పదకొండో సంవత్సరం అయిదో నెలవరకూ కూడా యెహోవానుంచి వాక్కు యిర్మీయాకు వస్తూనే ఉంది. ఆ నెలలో జెరుసలం నగరవాసులు బందీలుగా దేశాంతరం వెళ్ళారు.
[4] యెహోవానుంచి నాకు వచ్చిన వాక్కు ఏమిటంటే,
[5] “నేను నిన్ను గర్భంలో రూపొందించేముందే నిన్ను ఎరిగి ఎన్నుకున్నాను. నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, ఇతర జనాలకు ప్రవక్తగా నియమించాను.
[6] అందుకు నేను “అయ్యో, యెహోవాప్రభూ! బాలుణ్ణే నేను. ఎలా మాట్లాడాలో నాకు తెలియదు” అన్నాను.
[7] అయితే యెహోవా నాతో “బాలుణ్ణి అనవద్దు. నేను నిన్ను ఎవరిదగ్గరకు పంపుతానో వారి దగ్గరికి నీవు వెళ్ళాలి, నీకు నేను ఆజ్ఞాపించేదంతా చెప్పాలి.
[8] వారంటే నీకు భయం ఉండకూడదు. వారి బారినుండి నిన్ను తప్పించడానికి నేను నీతో ఉంటాను. ఇది యెహోవా వాక్కు” అన్నాడు.
[9] అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు తాకి నాతో ఇలా అన్నాడు: “ఇదిగో విను! నా వాక్కులు నీ నోట ఉంచాను.
[10] ఈ రోజే జనాలమీదా రాజ్యాలమీదా నిన్ను నియమిస్తున్నాను. నీవు చేయవలసినది ఏమిటంటే, పెరికివేయడం, కూలకొట్టడం, నాశనం చేయడం, పడవేయడం, కట్టడం, నాటడం.”
[11] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది “యిర్మీయా! నీకేమి కనిపిస్తున్నది?” అందుకు నేను “నాకు బాదంచెట్టు కొమ్మ కనిపిస్తున్నది” అని జవాబిచ్చాను.
[12] యెహోవా నాతో “సరిగా చూశావు. నేను నా వాక్కులు నెరవేర్చడంలో శ్రద్ధ వహిస్తున్నాను” అన్నాడు.
[13] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది “నీకేమి కనిపిస్తున్నది?” అందుకు నేను “కాగుతూ ఉన్న కుండ నాకు కనిపిస్తున్నది. అది ఉత్తర దిక్కునుంచి అవతలకు వంగి ఉంది” అని జవాబిచ్చాను.
[14] యెహోవా నాతో మాట్లాడుతూ “ఈ దేశవాసులందరి మీదికి ఉత్తర దిక్కునుంచి విపత్తు వస్తుంది.
[15] ఉత్తర దిక్కులో ఉన్న అన్ని రాజ్యాల జనాలను రప్పించబోతున్నాను. ఇది యెహోవా వాక్కు. వాళ్ళ రాజులు వస్తారు; ఒక్కొక్కరు తన సింహాసనాన్ని జెరుసలం ద్వారాలలో, జెరుసలం చుట్టున్న ప్రాకారాలన్నిటికీ ఎదురుగా, యూదా పట్టణాలన్నిటికీ ఎదురుగా నిలుపుకొంటారు.
[16] నా ప్రజ నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళకు ధూపం వేసి, వాళ్ళు చేతులతో చేసిన విగ్రహాలను పూజించి, చెడ్డగా ప్రవర్తించారు. గనుక నేను వాళ్ళకు విరోధంగా తీర్పులు చెపుతాను.
[17] “నీవు సిద్ధపడి, నిలబడి, నేను నీకు ఆజ్ఞాపించేదంతా వాళ్ళకు చెప్పాలి. వాళ్ళను చూచి భయపడకూడదు. ఒకవేళ భయపడితే వారి ఎదుట నేను నిన్ను ఎక్కువ భయానికి గురి చేస్తాను.
[18] ఈ దేశమంతటి విషయం – యూదా రాజుల విషయం, అధికారుల విషయం, యాజుల విషయం, దేశ ప్రజల విషయం – ఈ రోజునే నేను నిన్ను ప్రాకారాలున్న పట్టణంలాగా, ఇనుప స్తంభంలాగా, కంచు గోడల్లాగా చేస్తున్నాను.
[19] వాళ్ళు నీతో పోరాడుతారు గాని, నిన్ను జయించలేరు. నేను నీతో ఉండి నిన్ను వాళ్ళ బారినుంచి తప్పిస్తాను. ఇది యెహోవా వాక్కు” అన్నాడు.