[1] మరోసారి యెహోవానుంచి నాకు వాక్కు వచ్చింది:
[2] “నీవు పెండ్లి చేసుకోకూడదు. ఎందుకంటే నీకు ఈ స్థలంలో కొడుకులు, కూతుళ్ళు ఉండకూడదు.
[3] ఈ దేశంలో పుట్టిన కొడుకులు, కూతుళ్ళను గురించి వారిని కన్న తల్లిదండ్రులను గురించి యెహోవా చెప్పేదేమిటంటే,
[4] వారు ప్రాణాంతక రోగాలకు గురి అయి చనిపోతారు. వారికోసం ఎవ్వరూ విలపించరు. వారిని ఎవ్వరూ పాతిపెట్టరు. వారు భూమిమీద పెంటలాగా పడి ఉంటారు. ఖడ్గంచేత, కరవుచేత నాశనమవుతారు. వారి శవాలు గాలిలో ఎగిరే పక్షులకు, భూమిమీద తిరిగే మృగాలకు ఆహారమవుతాయి.”
[5] యెహోవా చెప్పేదేమిటంటే, “నా శాంతి, నా దయ, నా వాత్సల్యం ఈ ప్రజమీద ఉండకుండా తీసివేశాను. గనుక నీవు రోదనం చేసేవాళ్ళ ఇంట్లోకి వెళ్ళవద్దు. విలపించడానికి, వారిని ఓదార్చడానికి వెళ్ళవద్దు. ఇది యెహోవా వాక్కు.
[6] దేశంలో గొప్పవారేమీ తగ్గువారేమీ అందరూ చస్తారు. వారిని ఎవ్వరూ పాతిపెట్టరు, వారికోసం ఎవ్వరూ రోదనం చేయరు, తమను కోసుకోరు, బోడిగా చేసుకోరు.
[7] చచ్చినవారి విషయం ఏడ్చేవారిని ఓదార్చడానికి వారితో కలిసి తినేవాళ్ళెవ్వరూ ఉండరు. తండ్రి, లేక తల్లి చనిపోతే కూడా పానీయం ఇచ్చి ఊరడించేవాళ్ళెవ్వరూ ఉండరు.
[8] “విందు జరిగే ఇంట్లోకి నీవు వెళ్ళకు. వారితో కూర్చుని, తిని, త్రాగకు.
[9] ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, నీ కళ్ళముందే, నీ రోజుల్లోనే సంతోషానందాల ధ్వనులను ఈ స్థలంలో వినబడకుండా చేస్తాను. పెండ్లికొడుకు, పెండ్లికూతురు చేసే శబ్దాన్ని మాన్పిస్తాను.
[10] “నీవు ఈ ప్రజతో ఈ మాటలన్నీ చెప్పేటప్పుడు వారు నీతో అంటారు: ‘యెహోవా ఎందుకు ఇంత గొప్ప విపత్తును మాకు నిర్ణయించాడు? మేమేం అపరాధం చేశాం? మా దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మేము చేసిన పాపం ఏమిటి?’
[11] అందుకు నీవు ఇలా జవాబివ్వాలి: యెహోవా చెప్పేదేమిటంటే, నేను అలా నిర్ణయించిన కారణమిదే: మీ పూర్వీకులు నన్ను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, సేవిస్తూ, పూజిస్తూ ఉన్నారు. నన్ను విడిచిపెట్టి నా ఉపదేశాన్ని పాటించలేదు.
[12] మీ పూర్వీకులకంటే మీరు మరి ఎక్కువగా చెడుగు జరిగించారు. నా మాట వినకుండా మీలో ప్రతి ఒక్కరూ తన చెడ్డ హృదయంలో ఉన్న మూర్ఖత్వాన్ని అనుసరిస్తూ ఉన్నారు.
[13] అందుచేత నేను మిమ్ములను ఏమీ దయ చూడను; ఈ దేశం నుంచి మీకు గానీ మీ పూర్వీకులకు గానీ తెలియని దేశంలోకి మిమ్ములను విసరివేస్తాను. అక్కడ మీరు ఇతర దేవుళ్ళకు రాత్రింబగళ్ళు సేవ చేయవలసివస్తుంది.”
[14] యెహోవా ఇంకా అన్నాడు, “అయినా, నేను వారి పూర్వీకులకు ఇచ్చిన వారి దేశానికి తిరిగి వచ్చేలా చేస్తాను. గనుక రాబోయే రోజుల్లో ‘ఈజిప్ట్‌దేశంనుంచి, ఇస్రాయేల్‌ప్రజను తీసుకువచ్చిన యెహోవా జీవంతోడు’ అని ప్రమాణం చేయడం జరగదు
[15] గాని, ‘ఉత్తర దేశంనుంచి, ఆయన వాళ్ళను చెదరగొట్టిన అన్ని దేశాలనుంచి తీసుకువచ్చిన యెహోవా జీవంతోడు’ అంటారు.”
[16] యెహోవా ఇంకా అన్నాడు, “ఇప్పుడు నేను చాలామంది జాలరులను రప్పిస్తాను. వాళ్ళు వచ్చి ఈ ప్రజలను పట్టుకొంటారు. ఆ తరువాత చాలామంది వేటగాళ్ళను రప్పిస్తాను. వాళ్ళు వచ్చి ప్రతి పర్వతంమీదా, ప్రతి కొండమీదా, బండల సందులలో వారిని వేటాడుతారు.
[17] వారి త్రోవలన్నిటిమీద నా కనుచూపు ఉంది. అవి నాకు మరుగుగా లేవు. వారి అపరాధాలు నా కండ్లుకు దాగలేవు.
[18] వారు తమ నీచమైన విగ్రహాలతో నా సొత్తును నింపారు, ప్రాణం లేని అసహ్యమైన రూపాలచేత నా దేశాన్ని అపవిత్రం చేశారు. గనుక వారి దుర్మార్గానికీ అపరాధానికీ రెండంతలుగా నేను వారిని దండిస్తాను.”
[19] యెహోవా! నీవే నా బలం, నాకు కోటలాంటివాడివి. కష్టకాలంలో ఆశ్రయంగా ఉన్నావు. నీదగ్గరికి భూమి కొనలనుంచి జనాలు వచ్చి ఇలా అంటారు: “మా పూర్వీకులకు అబద్ధ దేవుళ్ళు, పనికిమాలిన వ్యర్థమైన విగ్రహాలు మాత్రమే ఉన్నాయి.
[20] మనుషులు తమకోసం దేవుళ్ళను చేసుకొంటారా? అవును గాని, అలాంటి దేవుళ్ళు దేవుళ్ళే కాదు.”
[21] “అందుచేత నా పేరు యెహోవా అని వారు తెలుసుకొనేలా నేను వారికి నేర్పిస్తాను, నా బలప్రభావాలను తెలియజేస్తాను.