Skip to content
Opens in a new window

[1] అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “ఒకవేళ మోషే, సమూయేలు నా ముందు నిలబడినా ఈ ప్రజను కరుణించే మనసు నాకు కలగదు. ఈ ప్రజను నా ఎదుటనుంచి పంపివెయ్యి! వాళ్ళు వెళ్ళనియ్యి!

[2] వాళ్ళు ‘మేము ఎక్కడికి వెళ్ళాలి?’ అని నిన్ను అడిగితే నీవు వాళ్ళతో ఇలా చెప్పాలి: ‘యెహోవా చెప్పేదేమిటంటే, చావుకు నియమించ బడ్డవాళ్ళు చావుకు, ఖడ్గానికి నియమించబడ్డవాళ్ళు ఖడ్గానికి, కరవుకు నియమించబడ్డవాళ్ళు కరవుకు, ఖైదుకు నియమించబడ్డవాళ్ళు ఖైదుకు.

[3] “వాళ్ళను నాశనం చేసే విపత్తులను నాలుగు రకాలను నేను పంపిస్తాను. హతం చేయడానికి ఖడ్గాన్ని, శవాలను ఈడ్చుకుపోవడానికి కుక్కలను, మ్రింగివేయడానికీ నాశనం చేయడానికీ గాలిలో ఎగిరే పక్షులనూ భూమిమీద తిరిగే మృగాలనూ పంపిస్తాను. ఇది యెహోవా వాక్కు.

[4] యూదా రాజూ హిజ్కియా కొడుకూ అయిన మనష్షే జెరుసలంలో చేసినవాటి కారణంగా ఈ ప్రజను చూచి లోక రాజ్యాలన్నీ అసహ్యించుకొనేలా నేను చేస్తాను.

[5] “జెరుసలెమా! నిన్ను ఎవరు కనికరిస్తారు? ఎవరు ఓదారుస్తారు? కుశల ప్రశ్నలు అడగడానికి ఎవరు నీవైపు మళ్ళుతారు?

[6] ఇది యెహోవా వాక్కు. నీవు నన్ను విసర్జించి వెనక్కు వెళ్ళిపోతూ ఉన్నావు. గనుక నా చేయి నీమీదికి చాపి నిన్ను నాశనం చేస్తాను. నిన్ను కనికరించీ కనికరించీ నాకు విసుగు పుట్టింది.

[7] దేశం గుమ్మాలలో చేటతో నీవాళ్ళను తూర్పారపడతాను. నా ప్రజ తమ మార్గాలనుంచి నావైపు తిరగలేదు, గనుక నేను వాళ్ళను నాశనం చేస్తాను, వాళ్ళ సంతానాన్ని చంపిస్తాను.

[8] సముద్రం ఇసుక రేణువులకంటే వారిమధ్య విధవరాండ్రు ఎక్కువమంది అయ్యేలా చేస్తాను. మధ్యాహ్న కాలంలో వారి యువకుల తల్లులమీదికి వినాశకారిని రప్పిస్తాను. అకస్మాత్తుగా భయం, బాధ వారిపై పడేలా చేస్తాను.

[9] ఏడుగురిని కన్న తల్లి నీరసించి ప్రాణం విడుస్తుంది. పగలింకా ఉండగానే దాని ప్రొద్దు క్రుంకుతుంది. అది సిగ్గుతో అవమానం పాలవుతుంది. మిగిలినవారిని వారి శత్రువుల ఎదుటే ఖడ్గానికి గురి చేస్తాను. ఇది యెహోవా వాక్కు.”

[10] అయ్యో, నాకెంత బాధ! తల్లీ, నన్నెందుకు కన్నావు? దేశంలో ఉన్నవాళ్ళంతా నాతో జగడమాడుతారు, వాదిస్తారు. నేనెవరికీ అప్పివ్వలేదు, అప్పు తీసుకోలేదు. అయినా అందరూ నన్ను దూషిస్తూ ఉన్నారు.

[11] అందుకు యెహోవా అన్నాడు, “మంచి కోసమే నేను నిన్ను తప్పించితీరుతాను. నీ శత్రువులు ఆపదలో బాధలో ఉన్నప్పుడు నిన్ను ప్రాధేయపడుతారు. నేనే అలా జరిగిస్తాను.

[12] ఎవడైనా ఇనుమును – ఉత్తర దిక్కునుంచి వచ్చే ఇనుమును, కంచును విరవగలడా?

[13] మీ దేశమంతటా మీరు చేసిన అన్ని అపరాధాల కారణంగా మీ సంపదను, మీ విలువైన వస్తువులను వెల లేకుండా దోపిడీగాళ్ళకు ఇస్తాను.

[14] మీకు తెలియని దేశంలో మీ విరోధులకు మిమ్ములను దాసులుగా చేస్తాను. నా కోపం మంటల్లాగా రగులుకొంది. అది మీమీద మండుతూ ఉంటుంది.”

[15] యెహోవా! నీవు నన్ను ఎరుగుదువు. నన్ను తలచుకొని నన్ను సందర్శించు. నన్ను బాధించేవాళ్ళమీద నాకోసం ప్రతీకారం చెయ్యి. నీవు చాలా ఓర్పు గలవాడివి – నన్ను తీసుకుపోవద్దు. నేను నీకోసమే నింద భరిస్తూ ఉన్నానని జ్ఞాపకం ఉంచుకో.

[16] సేనలప్రభువు యెహోవాదేవా! నేను నీ పేరు భరిస్తున్నాను. నీ వాక్కులు నాకు దొరికితే వాటిని తిన్నాను. అవి నాకు సంతోషంగా హృదయానందంగా ఉన్నాయి.

[17] వేడుక చేసుకొనేవారి గుంపు మధ్య నేను కూర్చుని సంబరపడలేదు. నీ చేయి నామీద ఉంది, నీవు నన్ను కోపంతో నింపావు గనుక నేను ఒంటరిగా కూర్చున్నాను.

[18] నా బాధకు అంతం ఎందుకు లేనట్టు? నా గాయం ఎందుకు ఘోరమై నయం కాకుండా ఉంది? నీవు నాకు నమ్మరాని ఊటలాగా, ఇంకిపోయే నీళ్ళలాగా ఉంటావా?

[19] అందుకు యెహోవా చెప్పాడు, “నీవు నావైపు మళ్ళీ తిరుగాలని ఉంటే నిన్ను తిరిగేలా చేస్తాను. నా సన్నిధానంలో నీవు నిలుస్తావు. పనికిమాలిన మాటలేవో యోగ్యమైన మాటలేవో నీవు గుర్తించి పలికితే, నీవు నాకు బదులు మాట్లాడేవాడుగా ఉంటావు. ఈ ప్రజ నీవైపు తిరగాలి. నీవు వారివైపు తిరగకూడదు.

[20] నేను నిన్ను ఈ ప్రజకు కోటలున్న కంచు గోడగా చేస్తాను. వాళ్ళు నీమీద పోరాడుతారు గాని గెలవలేకపోతారు. నిన్ను కాపాడి రక్షించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను. ఇది యెహోవా వాక్కు.

[21] నేను నిన్ను దుర్మార్గుల చేతిలోనుంచి తప్పిస్తాను, దౌర్జన్యపరుల బారినుంచి విడిపిస్తాను.”

యిర్మీయా — Chapters