[1] ఇది యెహోవానుంచి యిర్మీయాకు వచ్చిన వాక్కు.
[2] ఈ ఒడంబడిక మాటలు విని, యూదాప్రజలకు, జెరుసలం నివాసులకు చెప్పాలి.
[3] వారితో ఇలా అను: “ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నేను మీ పూర్వీకులను ఇనుప కొలిమిలాంటి ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చి వారితో ఒడంబడిక చేశాను. ఈ ఒడంబడిక మాటలకు లోబడనివాడు శాపానికి గురి అవుతాడు.
[4] ఆ కాలంలో మీ పూర్వీకులను ఇలా ఆదేశించాను: ‘నా మాట వినండి. నేను మీకు ఆజ్ఞాపించినదంతటి ప్రకారం ప్రవర్తించండి. అప్పుడు మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడనై ఉంటాను,
[5] మీ పూర్వీకులకు పాలుతేనెలు నదులై పారే దేశాన్ని ఇస్తానని నేను చేసిన ప్రమాణం నెరవేరుస్తాను.’ ఇప్పుడు మీరు వాగ్దత్త దేశంలో ఉన్నారు.” అందుకు నేను “నిజమే, యెహోవా” అని జవాబిచ్చాను.
[6] యెహోవా నాతో అన్నాడు, “యూదా పట్టణాలలో, జెరుసలం వీధులలో ఈ మాటలన్నీ ప్రకటించు: ఈ ఒడంబడిక మాటలు విని, వాటిప్రకారం ప్రవర్తించండి.
[7] నేను మీ పూర్వీకులను ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చిన కాలం మొదలుకొని ఈ రోజువరకు ప్రొద్దున్నే లేచి నా మాట వినండని ఖచ్చితంగా హెచ్చరిస్తూ వచ్చాను.
[8] అయినా వారు వినలేదు. పెడచెవిని పెట్టి ప్రతి ఒక్కరూ తమ చెడ్డ హృదయంలో ఉన్న మూర్ఖత్వాన్ని అనుసరించారు. ఆచరించండని నేను ఆజ్ఞాపించిన ఈ ఒడంబడికను వారు ఆచరించలేదు. అందుచేతే ఒడంబడికలో ఉన్న శాపనార్థాలు వారిమీదికి రప్పించాను.”
[9] అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు: “యూదావారిమధ్య, జెరుసలం నివాసులమధ్య కుట్ర జరుగుతూ ఉంది.
[10] నా మాటలు వినని తమ పూర్వీకుల అపరాధాలను వాళ్ళు అనుసరించారు. ఇతర దేవుళ్ళను అనుసరించి పూజించారు. వారి పూర్వీకులతో నేను చేసిన ఒడంబడికను ఇస్రాయేల్‌ప్రజ, యూదాప్రజ భంగం చేశారు.
[11] గనుక యెహోవా చెప్పేదేమిటంటే, నేను వారిమీదికి తప్పించుకోలేని విపత్తు రప్పిస్తాను. వారు నాకు మొరపెట్టినా నేను వినను.
[12] అప్పుడు యూదా పట్టణాలలో, జెరుసలంలో ఉండేవారు వెళ్ళి, తాము ధూపం వేసిన దేవతలకు మొర పెట్టుకొంటారు. అయితే వారిమీదికి వచ్చే ఆ విపత్తు కాలంలో వారిని అవి ఎంతమాత్రమూ కాపాడలేవు.
[13] యూదా! నీ పట్టణాలెన్నో అన్ని దేవతలు నీకు ఉన్నాయి. జెరుసలం వీధులెన్నో ధూపం వేయడానికి అన్ని బలిపీఠాలను బయల్‌దేవుడి నీచమైన విగ్రహాలకు నిలిపారు.
[14] యిర్మీయా! ఈ ప్రజకోసం ప్రార్థించకు. వారికోసం ఏమీ విన్నపం, ప్రార్థన చేయవద్దు. వారి విపత్తు కాలంలో వారు నాకు మొరపెట్టుకొన్నప్పుడు నేను వినను.
[15] “అనేక చెడు కార్యాలు జరిగించిన నా ప్రియప్రజకు నా ఆలయంలో ఏమి పని? మీరు సంతోషించేలా, బలి మాంసం అర్పించడం అనేది మీమీదికి విపత్తు రాకుండా చేస్తుందా?”
[16] ఒకసారి యెహోవా మిమ్మల్ని “మంచి పండ్లు కాసే అందమైన పచ్చని చెట్టు” అన్నాడు. ఇప్పుడైతే గొప్ప తుఫాను ధ్వని వినబడుతూ ఉంటే ఆయన జ్వాల అంటిస్తాడు. ఈ చెట్టు కొమ్మలు విరిగిపోతాయి.
[17] సేనలప్రభువు యెహోవా మిమ్మల్ని నాటాడు గాని ఇప్పుడు మీమీదికి విపత్తు రప్పిస్తాను అన్నాడు. దీనికి కారణం ఆయన మాటలలో ఉంది – “ఇస్రాయేల్‌ప్రజ, యూదాప్రజ చెడుగు చేస్తూ, బయల్‌దేవుడికి ధూపం వేస్తూ, నాకు కోపం రేపారు.”
[18] వాళ్ళు పన్నిన కుట్ర యెహోవా నాకు వెల్లడి చేసినందుచేత నాకు తెలిసింది. వాళ్ళ క్రియలు ఆయన నాకు చూపించాడు.
[19] అంతకుముందు నేను వధకు తేబడ్డ సాధువైన గొర్రెలాంటివాణ్ణి; వాళ్ళు నాకు వ్యతిరేకంగా కుట్ర చేసి, ఇలా చెప్పిన సంగతి నాకు తెలియదు – “చెట్టును దాని కాయలతో కూడా నరికివేద్దాం పట్టండి. ఇకమీదట వాడి పేరే గుర్తు రాకుండా సజీవుల లోకంలో నుంచి వాణ్ణి కొట్టివేద్దాం.”
[20] సేనలప్రభువు యెహోవా! నీవు న్యాయంగా తీర్పు తీర్చేవాడివి. హృదయాన్నీ మనసునూ పరిశోధించేవాడివి. నా వ్యాజ్యెం నీకు అప్పచెప్పాను. నీవు వాళ్ళమీద ప్రతీకారం చేయడం నన్ను చూడనియ్యి.
[21] అందుకు “అనాతోతువాళ్ళు నీ ప్రాణం తీయడానికి చూస్తూ, ‘యెహోవామూలంగా పలకవద్దు. పలికితే మాచేత నీవు చస్తావు’ అంటున్నారు, వాళ్ళ విషయం సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే,
[22] నేను వాళ్ళను దండిస్తాను. వాళ్ళలో యువకులు కత్తిపాలవుతారు. వారి కొడుకులు, కూతుళ్ళు కరవుకు గురి అయి చస్తారు.
[23] దండన సంవత్సరంలో అనాతోతువారిమీదికి నేను విపత్తు రప్పిస్తాను. వారిలో ఎవ్వరూ మిగలరు.”