[1] ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు పెద్ద గుంపులుగా ఆయనను అనుసరించారు.
[2] వెంటనే కుష్ఠురోగి ఒకడు వచ్చి ఆయనకు మ్రొక్కి, “ప్రభూ! మీకిష్టం ఉంటే నన్ను శుద్ధం చేయగలరు” అన్నాడు.
[3] యేసు చేయి చాచి అతణ్ణి తాకి, “నాకిష్టమే. శుద్ధుడవు కమ్ము!” అన్నాడు. తక్షణమే అతని కుష్ఠు శుద్ధమైంది.
[4] అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు, “చూడు, ఈ విషయం ఎవరికీ చెప్పకు. అయితే వెళ్ళి యాజికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోషే విధించిన కానుక అర్పించు.”
[5] యేసు కపెర్‌నహూంలో ప్రవేశించినప్పుడు రోమ్ సైన్యంలో ఒక శతాధిపతి ఆయనదగ్గరకు వచ్చాడు,
[6] “ప్రభూ, నా దాసుడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు. తీవ్రంగా బాధపడుతున్నాడు” అంటూ ఆయనను బతిమాలుకొన్నాడు.
[7] “నేను వచ్చి అతణ్ణి బాగు చేస్తాను” అని యేసు అతనితో అన్నాడు.
[8] అయితే ఆ శతాధిపతి ఇలా జవాబిచ్చాడు: “ప్రభూ, మీరు నా ఇంట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మీరు మాట మాత్రం అనండి, అప్పుడు నా దాసుడికి జబ్బు పూర్తిగా నయం అవుతుంది.
[9] నేను కూడా అధికారం క్రింద ఉన్నవాణ్ణి. నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు. నేను ఎవణ్ణయినా ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు. మరొకణ్ణి ‘రా’ అంటే వస్తాడు. నా దాసుణ్ణి ‘ఇది చేయి’ అంటే చేస్తాడు.”
[10] ఈ మాటలు విని యేసు ఆశ్చర్యపడ్డాడు, తన వెంట వస్తున్నవారితో ఇలా అన్నాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఇస్రాయేల్ ప్రజలలో కూడా ఎవరికైనా ఇంత గొప్ప నమ్మకం ఉన్నట్టు నేను చూడలేదు.
[11] తూర్పునుంచీ పడమరనుంచీ చాలామంది వచ్చి పరలోక రాజ్యంలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతోపాటు విందులో కూర్చుంటారని నేను మీతో చెపుతున్నాను.
[12] కానీ ఆ రాజ్య సంబంధులను బయట చీకట్లో పారవేయడం జరుగుతుంది. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి.”
[13] అప్పుడు శతాధిపతితో యేసు అన్నాడు, “వెళ్ళు. నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది.” అదే వేళకు అతని దాసునికి పూర్తిగా నయం అయింది.
[14] తరువాత యేసు పేతురు ఇంట్లోకి వెళ్ళి పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండడం చూశాడు.
[15] ఆయన ఆమె చెయ్యి ముట్టగానే జ్వరం పోయింది. ఆమె లేచి వారికి పరిచర్య చేయసాగింది.
[16] సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టినవారిని అనేకమందిని ప్రజలు ఆయనదగ్గరికి తీసుకువచ్చారు. ఆయన ఒక్క మాటతో ఆ దురాత్మలను వెళ్ళగొట్టాడు. రోగులందరినీ కూడా బాగు చేశాడు.
[17] యెషయాప్రవక్త ద్వారా దేవుడు చెప్పినది నెరవేరేలా ఆ విధంగా జరిగింది. ఏమిటంటే, ఆయన మన బలహీనతలను తన మీదికి తీసుకున్నాడు; మన రోగాలను భరించాడు.
[18] తన చుట్టూరా ఉన్న పెద్ద జన సమూహాలను చూచి యేసు గలలీ సరస్సు అవతలికి వెళ్దామని ఆదేశించాడు.
[19] అప్పుడు ధర్మశాస్త్ర పండితుడొకడు వచ్చి ఆయనతో ఇలా అన్నాడు: “గురువర్యా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మీ వెంటే వస్తాను.”
[20] అందుకు యేసు అతనితో “నక్కలకు గుంటలున్నాయి. గాలిలో ఎగిరే పక్షులకు గూళ్ళు ఉన్నాయి. కానీ మానవ పుత్రునికి తల వాల్చుకొనే స్థలం కూడా లేదు” అన్నాడు.
[21] ఆయన శిష్యులలో మరొకడు “స్వామీ, మొట్టమొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టేంత వరకూ సెలవియ్యండి” అన్నాడు.
[22] యేసు అతనితో, “నా వెంట రా! చనిపోయినవారే చనిపోయిన తమవారిని పాతిపెట్టనియ్యి” అన్నాడు.
[23] అప్పుడు ఆయన పడవ ఎక్కాడు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళారు.
[24] అకస్మాత్తుగా సరస్సుమీద పెద్ద తుఫాను చెలరేగసాగింది. అలలు ఆ పడవమీదికి ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు.
[25] శిష్యులు దగ్గరగా వెళ్ళి ఆయనను మేల్కొలిపి “స్వామీ! నశించిపోతున్నాం! మమ్మల్ని రక్షించు!” అన్నారు.
[26] అందుకు ఆయన “అల్ప విశ్వాసం గలవారలారా, మీరెందుకు భయపడుతున్నారు?” అన్నాడు. అప్పుడాయన లేచి, గాలులను సరస్సునూ మందలించాడు. అంతా ప్రశాంతమైపోయింది.
[27] ఆ మనుషులకు ఎంతో ఆశ్చర్యం వేసింది. “ఈయన ఎలాంటివాడో గాని గాలులు, సరస్సు కూడా ఈయనకు లోబడు తున్నాయే!” అని చెప్పుకొన్నారు.
[28] ఆయన అవతలి ఒడ్డున ఉన్న గెర్గెసెనువారి ప్రదేశం చేరుకొన్నప్పుడు దయ్యాలు పట్టిన పురుషులు ఇద్దరు సమాధులలో నుంచి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. వారు మహా భయంకరులు కావడంచేత ఆ దారిన ఎవరూ వెళ్ళలేకపోయేవారు.
[29] వెంటనే వారు “యేసు! దేవుని కుమారుడా! మా జోలి నీకెందుకు? కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?” అని అరిచారు.
[30] వారికి కొంత దూరంలో ఒక పెద్ద పందుల మంద మేస్తూ ఉంది.
[31] అప్పుడా దయ్యాలు “ఒకవేళ నీవు మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే ఆ పందుల మందలోకి వెళ్లనియ్యి!” అని యేసును ప్రాధేయపడ్డాయి.
[32] ఆయన “పోండి!” అని వాటితో అన్నాడు. అప్పుడు అవి ఆ మనుషులలోనుంచి బయటికి వచ్చి ఆ పందులమందలో దూరాయి. వెంటనే ఆ పందులమందంతా నిటారుగా ఉన్న కొండమీదనుంచి వేగంగా పరుగెత్తుతూ సరస్సులో పడి నీళ్ళలో చచ్చాయి.
[33] వాటి కాపరులు పారిపోయి గ్రామంలోకి వెళ్ళి జరిగినదంతా, దయ్యాలు పట్టినవారి సంగతి కూడా తెలియజేశారు.
[34] అప్పుడు ఆ గ్రామమంతా యేసును ఎదుర్కోవడానికి వచ్చారు. ఆయనను చూచి తమ ప్రాంతాన్ని విడిచివెళ్ళాలని వేడుకొన్నారు.