Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:38

[1] ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదుకు యేసు విషయం వినవచ్చింది.

[2] అతడు తన పరివారంతో ఇలా అన్నాడు: “ఇతడు బాప్తిసమిచ్చే యోహాను. చచ్చినవారిలో నుంచి సజీవంగా లేచాడు. అందుచేత అతడిలో అద్భుతాలు చేసే ఈ బలప్రభావాలు పని చేస్తున్నాయి.”

[3] మునుపు హేరోదు తన తోబుట్టువైన ఫిలిప్పు భార్య హేరోదియ కారణంగా యోహానును పట్టుకొని, బంధించి, ఖైదులో వేయించాడు.

[4] ఎందుకంటే, యోహాను అతడితో “మీరు ఆమెను అలా పెట్టుకోవడం న్యాయం కాదు” అంటూ వచ్చాడు.

[5] అతడు యోహానును చంపించాలని ఆశించినా ప్రజానీకానికి భయపడ్డాడు. ఎందుకంటే వారు యోహానును ప్రవక్తగా భావించారు.

[6] అయితే హేరోదు జన్మ దినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కూతురు వాళ్ళ ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది.

[7] అందుచేత ఆమె ఏమడిగినా ఇస్తానని అతడు శపథం చేసి మాట ఇచ్చాడు.

[8] తన తల్లి తనను ప్రేరేపించినందుచేత ఆమె ఇలా అంది: “బాప్తిసం ఇచ్చే యోహాను తల పళ్ళెంలో ఉంచి ఇక్కడే నాకిప్పించండి.”

[9] రాజుకు విచారం కలిగినా, తాను చేసిన శపథాల కారణంగా తనతో భోజనానికి కూర్చుని ఉన్నవారి కారణంగా దానిని ఇవ్వాలని ఆజ్ఞ జారీ చేశాడు.

[10] భటులను పంపి ఖైదులో యోహాను తల నరికించాడు.

[11] వారు తలను పళ్ళెంలో తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆమె దాన్ని తన తల్లి దగ్గరికి తెచ్చింది.

[12] యోహాను శిష్యులు వచ్చి అతని శరీరాన్ని తీసుకువెళ్ళి పాతిపెట్టారు. అప్పుడు వెళ్లి యేసుకు ఆ సంగతి చెప్పారు.

[13] అది విని యేసు పడవ ఎక్కి, అక్కడనుంచి నిర్జన ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఆ సంగతి విని జన సమూహాలు పట్టణాలనుంచి కాలినడకన ఆయన వెంట వెళ్ళారు.

[14] యేసు బయటికి వెళ్ళినప్పుడు పెద్ద జన సమూహం ఆయనకు కనిపించింది. ఆయన వారిమీద జాలిపడి వారి రోగాలను బాగు చేశాడు.

[15] సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, “ఇది అరణ్యం. ఇప్పటికే ప్రొద్దు పోయింది. ఈ జన సమూహాలు గ్రామాలకు వెళ్ళి తినుబండారాలు కొనుక్కోవడానికి వారిని పంపించండి.”

[16] యేసు వారితో “వారు వెళ్ళనక్కరలేదు. మీరే వారికి ఆహారం పెట్టండి” అన్నాడు.

[17] వారు “ఇక్కడ మనదగ్గర ఉన్నది అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే” అని ఆయనతో అన్నారు.

[18] ఆయన “వాటిని నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు.

[19] జన సమూహం పచ్చికమీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ అయిదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకొని ఆకాశంవైపు తలెత్తి చూస్తూ దేవునికి కృతజ్ఞత అర్పించాడు. అప్పుడు రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు.

[20] అందరూ తిని సంతృప్తి చెందారు. తరువాత వారు మిగిలిన ముక్కలను ఎత్తితే మొత్తం పన్నెండు గంపలు నిండాయి.

[21] స్త్రీలు, పిల్లలు గాక పురుషులే సుమారు అయిదు వేలమంది తిన్నారు.

[22] వెంటనే యేసు జన సమూహాలను పంపివేస్తూ, శిష్యులను తనకంటే ముందుగా అవతల ఒడ్డుకు వెళ్ళండని పడవ ఎక్కించాడు.

[23] ఆ గుంపులను పంపివేసిన తరువాత ప్రార్థన చేయడానికి తానొక్కడే కొండెక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన అక్కడే ఒంటరిగా ఉన్నాడు.

[24] అప్పటికి ఆ పడవ సరస్సు మధ్యలో ఉంది. గాలి ఎదురుగా వీస్తూ ఉండడంవల్ల అది అలలకు కొట్టుకుపోతూ ఉంది.

[25] రాత్రి నాలుగో జామున యేసు సరస్సుమీద నడుస్తూ వారికి దగ్గరగా వచ్చాడు.

[26] ఆయన సరస్సు మీద నడుస్తూ ఉండడం చూచి శిష్యులు హడలిపోయి “అది భూతం!” అని భయంతో కేకలు పెట్టారు.

[27] వెంటనే యేసు వారిని పలకరించి “ధైర్యం తెచ్చుకోండి! నేనే! భయపడకండి!” అన్నాడు.

[28] పేతురు ఆయనతో “ప్రభూ, నీవే అయితే, నన్ను నీ దగ్గరికి నీళ్ళమీద నడచి రమ్మనండి!” అన్నాడు.

[29] ఆయన రమ్మన్నాడు. పేతురు పడవ దిగి, నీళ్ళమీద నడుస్తూ యేసువైపు వెళ్ళాడు.

[30] కానీ గాలి ప్రబలంగా ఉండడం చూచి భయపడి, మునిగిపోబోయాడు. “ప్రభూ! నన్ను రక్షించు!” అని కేకపెట్టాడు.

[31] వెంటనే యేసు చేయి చాచి అతణ్ణి పట్టుకొన్నాడు. “అల్ప విశ్వాసం గలవాడా సందేహపడ్డావేమిటి!” అని అతనితో అన్నాడు.

[32] వారు పడవ ఎక్కినప్పుడు గాలి ఆగింది.

[33] పడవలో ఉన్నవారు వచ్చి “నిజంగా నీవు దేవుని కుమారుడవు” అని చెప్పి ఆయనను ఆరాధించారు.

[34] వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరుకొన్నారు.

[35] అక్కడి మనుషులు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపట్ల ఉన్న ప్రాంతం అంతటికీ కబురంపి, రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు.

[36] వారిని, నీ వస్త్రం అంచును మాత్రమే ముట్టనివ్వండని ఆయనను ప్రాధేయ పడ్డారు. అలా ముట్టిన వారందరికీ పూర్తిగా నయం అయింది.

మత్తయి శుభవార్త — Chapters