[1] అప్పుడు యేసును అపనింద పిశాచం వల్ల విషమపరీక్షలకు గురి కావడానికి దేవుని ఆత్మ అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు.
[2] అక్కడ యేసు నలభై రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది.
[3] దుష్‌ప్రేరేపణ చేసేవాడు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు!”
[4] అందుకు ఆయన ఇలా జవాబిచ్చాడు: “మనిషి ఆహారంవల్ల మాత్రమే బ్రతకడు గానీ దేవుని నోటనుంచి వచ్చే ప్రతి వాక్కువల్లా బ్రతుకుతాడు అని వ్రాసి ఉంది.”
[5] అప్పుడు అపనింద పిశాచం ఆయనను పవిత్ర నగరానికి తీసుకువెళ్ళి దేవాలయం శిఖరంమీద నిలబెట్టాడు.
[6] “నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దూకేసెయ్యి! ఎందుకంటే ఇలా రాసి ఉంది – ఆయన తన దూతలకు నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు నీ పాదానికి రాయి తగలకుండా నిన్ను తమ చేతులలో ఎత్తిపట్టుకొంటారు అని ఆయనతో అన్నాడు.”
[7] అందుకు యేసు వాడితో ఇలా చెప్పాడు: “నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించకూడదు అని కూడా వ్రాసి ఉంది.”
[8] ఇంకా అపనింద పిశాచం ఆయనను చాలా ఎత్తయిన పర్వతంమీదికి తీసుకువెళ్ళి భూలోక రాజ్యాలన్నీ వాటి వైభవాన్నీ చూపించాడు.
[9] అప్పుడు వాడు ఆయనతో “నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే ఇదంతా నీకిస్తాను” అన్నాడు.
[10] “సైతానూ! అవతలికి పో! నీ ప్రభువైన దేవుణ్ణే ఆరాధించాలి, ఆయనకు మాత్రమే సేవ చేయాలి అని వ్రాసి ఉంది” అని యేసు వాడితో చెప్పాడు.
[11] అప్పుడు అపనింద పిశాచం ఆయనను విడిచివెళ్ళాడు. దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారాలు చేశారు.
[12] యోహాను ఖైదు పాలయ్యాడని యేసు విని గలలీ ప్రదేశానికి తిరిగి వెళ్ళాడు.
[13] నజరేతు విడిచివెళ్ళి కపెర్‌నహూంలో నివాసం చేశాడు. అది సరస్సు తీరాన, జెబూలూను, నఫ్తాలి ప్రాంతాలలో ఉంది.
[14] యెషయాప్రవక్త మూలంగా వచ్చిన ఈ వాక్కు నెరవేరేందుకే అది జరిగింది:
[15] “జెబూలూను ప్రదేశం, నఫ్తాలి ప్రదేశం, యొర్దాను నది అవతల, సముద్రం వైపు ఉన్న యూదేతరుల గలలీ రాష్ట్రంలో,
[16] చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప కాంతి కనిపించింది. చావునీడ ఉన్న దేశంలో నివసించేవారిమీద వెలుగు ప్రకాశించింది.”
[17] అప్పటినుంచి యేసు “పరలోక రాజ్యం” దగ్గరగా ఉంది గనుక పశ్చాత్తాపపడండి అంటూ ప్రకటించడం మొదలు పెట్టాడు.
[18] యేసు గలలీ సరస్సు ఒడ్డున నడుస్తూ, ఇద్దరు అన్నదమ్ములు సరస్సులో వల వేస్తూ ఉంటే చూశాడు. వారు సీమోను, అతడి తోబుట్టువు అంద్రెయ. సీమోనును “పేతురు” అని పిలుస్తారు. వారు చేపలు పట్టేవారు.
[19] యేసు వారితో ఇలా అన్నాడు: “నా వెంటరండి. మనుషులను పట్టే జాలరులుగా మిమ్ములను చేస్తాను.”
[20] వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.
[21] అక్కడనుంచి వెళ్ళి యేసు ఇంకో ఇద్దరు అన్నదమ్ములను చూశాడు. వారు జెబెదయి కొడుకు యాకోబు, అతడి తోబుట్టువు యోహాను. తమ తండ్రి జెబెదయితో కూడా వారు పడవలో వలలు సిద్ధం చేసుకొంటున్నారు. యేసు వారిని పిలిచాడు.
[22] వెంటనే వారు పడవనూ తమ తండ్రినీ విడిచి ఆయన వెంట వెళ్ళారు.
[23] యేసు గలలీ ప్రదేశం అంతటా ప్రయాణాలు చేస్తూ, వారి సమాజకేంద్రాలలో ఉపదేశిస్తూ, రాజ్య శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రజలలో ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగుచేస్తూ ఉన్నాడు.
[24] ఆయన కీర్తి సిరియా అంతటా వ్యాపించింది. ప్రజలు రోగులందరినీ నానా విధాల వ్యాధులచేత యాతనలచేత పీడితులైన వారిని, దయ్యాలు పట్టినవారిని, మూర్ఛరోగులను, పక్షవాత రోగులను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన వారిని బాగు చేశాడు.
[25] గలలీ, దెకపొలి, జెరుసలం, యూదయ, యొర్దానుకు అవతలి ప్రదేశం – ఈ స్థలాలనుంచి పెద్ద జన సమూహాలు ఆయన వెంటవెళ్ళారు.