[1] ఈ మాటలన్నీ చెప్పడం ముగించిన తరువాత యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు:
[2] “రెండు రోజుల తరువాత పస్కాపండుగ ఉంటుందని మీకు తెలుసు. అప్పుడు మానవపుత్రుణ్ణి సిలువ వేయడానికి అప్పగించడం జరుగుతుంది.”
[3] ఆ సమయంలో ప్రధాన యాజులు, ధర్మశాస్త్ర పండితులు, ప్రజల పెద్దలు, కయప అనే పేరుగల ప్రముఖయాజి భవనంలో పోగయ్యారు.
[4] యేసును కపటంతో పట్టుకొని చంపాలని కుట్ర పన్నారు.
[5] గాని, “ప్రజలలో అల్లరి జరుగుతుందేమో, గనుక పండుగలో పట్టుకోవద్దు” అని వారు చెప్పుకొన్నారు.
[6] యేసు బేతనీలో కుష్ఠురోగి సీమోను ఇంటిలో ఉన్నప్పుడు,
[7] ఒక స్త్రీ చలువరాతి బుడ్డిలో చాలా విలువైన అత్తరు తెస్తూ ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన భోజనానికి కూర్చుని ఉన్నాడు. ఆమె ఆ అత్తరు ఆయన తలమీద పోసింది.
[8] అది చూచినప్పుడు ఆయన శిష్యులకు కోపం వచ్చింది. “ఎందుకీ నష్టం?
[9] ఈ అత్తరు పెద్ద ధరకు అమ్మేసి బీదలకు ఇచ్చి ఉండవచ్చు గదా!” అన్నారు.
[10] ఆ సంగతి తెలుసుకొని యేసు వారితో ఇలా అన్నాడు: “ఈ స్త్రీని ఎందుకు తొందర చేస్తున్నారు? ఈమె నా పట్ల ఒక మంచి పని చేసింది.
[11] మీ దగ్గర బీదలు ఎప్పుడూ ఉంటారు. నేనైతే మీ దగ్గర ఎల్లప్పుడు ఉండను.
[12] ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసినప్పుడు నన్ను పాతిపెట్టడం గురించి అలా చేసింది.
[13] మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, సర్వలోకంలో ఈ శుభవార్త ప్రకటన జరిగే స్థలాలన్నిటిలో, ఈమెను జ్ఞాపకం చేసుకొని ఈ స్త్రీ చేసినదానిని గురించి చెప్పుకొంటారు.”
[14] అప్పుడు పన్నెండుమంది శిష్యులలో ఒకడు ప్రధాన యాజుల దగ్గరికి వెళ్ళాడు. అతడి పేరు ఇస్కరియోతు యూదా.
[15] “నేనాయనను మీకు పట్టిస్తే నాకేం ఇస్తారు?” అని అతడు అడిగాడు. అందుకు వారు ముప్ఫయి వెండి నాణేలు నిర్ణయించి అతడికిచ్చారు.
[16] అప్పటినుంచి అతడు ఆయనను వారికి పట్టి ఇవ్వడానికి అవకాశంకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
[17] పొంగని రొట్టెల పండుగ మొదటి రోజున శిష్యులు యేసుదగ్గరకు వచ్చి, “పస్కాను తినడానికి నీకోసం మేము ఏ స్థలం సిద్ధం చేయాలని ఉన్నావు?” అని అడిగారు.
[18] ఆయన “నగరంలో ఫలాని మనిషి దగ్గరకు వెళ్ళి అతనితో ఇలా చెప్పండి: ‘నా కాలం దగ్గరపడింది. నా శిష్యులతో కూడా నీ ఇంట్లో పస్కాపండుగ ఆచరిస్తానని గురువు అంటున్నాడు’” అని.
[19] యేసు తమకు ఆజ్ఞాపించినట్టు శిష్యులు చేసి పస్కాను సిద్ధం చేశారు.
[20] సాయంకాలమైనప్పుడు ఆయన పన్నెండుమంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు.
[21] వారు తింటూ ఉన్నప్పుడు ఆయన “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీలో ఒకడు నన్ను శత్రువులకు పట్టి ఇస్తాడు” అన్నాడు.
[22] వారికి అత్యంత దుఃఖం కలిగింది. “నేను కాదు గదా, ప్రభూ!” అని ఒక్కొక్కరు ఆయనతో అన్నారు.
[23] ఆయన ఇలా బదులు చెప్పాడు: “నాతోకూడా పాత్రలో చేయి ముంచేవాడే నన్ను పట్టివ్వబోయేవాడు.
[24] మానవ పుత్రుణ్ణి గురించి వ్రాసి ఉన్న ప్రకారమే ఆయన చనిపోతాడు గాని ఎవడైతే మానవపుత్రుణ్ణి పట్టి ఇస్తాడో అయ్యో ఆ మనిషికి శిక్ష తప్పదు! ఆ మనిషి పుట్టకపోతేనే అతనికి బాగుండేది.”
[25] ఆయనను పట్టి ఇవ్వబోయే యూదా “స్వామీ! నేను కాదు గదా” అన్నాడు. ఆయన అతనితో “నీవే అంటున్నావు గదా” అన్నాడు.
[26] వారు తింటూ ఉన్నప్పుడు యేసు రొట్టె తీసుకొని, దీవించి, దానిని విరిచి శిష్యులకు ఇచ్చాడు. “దీనిని తీసుకొని తినండి. ఇది నా శరీరం” అన్నాడు.
[27] అప్పుడు ఆయన పాత్ర తీసుకొని కృతజ్ఞత అర్పించి వారికిచ్చి ఇలా అన్నాడు: “మీరందరూ దీనిలోది త్రాగండి.
[28] ఇది నా రక్తం – పాపక్షమాపణ కలిగేలా అనేకులకోసం చిందే క్రొత్త ఒడంబడిక రక్తం.
[29] నేను మీతోకూడా నా తండ్రి రాజ్యంలో ఇలాంటి ద్రాక్షరసం మళ్ళీ త్రాగే రోజువరకు ఇక దానిని త్రాగనని మీతో చెపుతున్నాను.”
[30] వారు కీర్తన పాడిన తరువాత ఆలీవ్‌కొండకు వెళ్ళారు.
[31] అప్పుడు యేసు వారితో ఇలా అన్నాడు: “ఈ రాత్రి నా కారణంగా మీరందరూ తొట్రుపడతారు. ఎందుకంటే, ఇలా వ్రాసి ఉంది: కాపరిని హతం చేస్తాను, మందలోని గొర్రెలు చెదరి పోతాయి.
[32] అయితే నేను సజీవంగా లేపబడిన తరువాత మీకంటే ముందుగా గలలీకి వెళ్ళిపోతాను.”
[33] పేతురు “నీ కారణంగా అందరూ తొట్రుపడినా నేనెన్నడూ తొట్రుపడను” అని ఆయనతో బదులు చెప్పాడు.
[34] యేసు “నీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, ఈ రాత్రే, కోడి కూసేముందే నన్నెరగనని మూడు సార్లు అంటావు” అని అతనితో అన్నాడు.
[35] ఆయనతో పేతురు “నేను నీతో చావవలసి వచ్చినా నిన్ను ఎరగననను” అన్నాడు. తక్కిన శిష్యులంతా అలాగే అన్నారు.
[36] అప్పుడు యేసు వారితోకూడా గెత్‌సేమనే అనే స్థలానికి వెళ్ళాడు. “నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఈలోపుగా మీరిక్కడ కూర్చుని ఉండండి” అని శిష్యులతో అన్నాడు.
[37] ఆయన పేతురునూ జెబెదయి ఇద్దరు కొడుకులనూ తీసుకువెళ్ళి, దుఃఖం, కలత పొందసాగాడు.
[38] అప్పుడాయన వారితో “నాకు ప్రాణం పోయేటంతగా దుఃఖం ముంచుకు వస్తూ ఉంది. మీరిక్కడ ఆగి నాతో మెళకువగా ఉండండి” అన్నాడు.
[39] ఆయన కొద్ది దూరం వెళ్ళి, సాగిలపడి, ఇలా ప్రార్థన చేశాడు: “నా తండ్రీ! సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గరనుంచి తొలగిపోనియ్యి! అయినా నెరవేరవలసింది నా ఇష్టం కాదు, నీ ఇష్టమే!”
[40] శిష్యుల దగ్గరికి వచ్చి వారు నిద్రపోతూ ఉండడం చూశాడు. “మీరు ఒక్క గంట సేపు కూడా నాతో మెళకువగా ఉండలేకపోయారా?
[41] మీరు విషమ పరీక్షలో పడకుండా మెళకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే గాని, శరీరం దుర్బలం” అని పేతురుతో అన్నాడు.
[42] రెండో సారి ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు, “నా తండ్రీ! నేను దీనిని త్రాగితేనే తప్ప ఈ గిన్నె తొలగిపోవడం సాధ్యం కాకపోతే నీ చిత్తమే నెరవేరుతుంది గాక!”
[43] ఆయన తిరిగి వచ్చి, వారు నిద్రపోతూ ఉండడం చూశాడు. ఎందుకంటే, వారి కండ్లు మూతలు పడుతూ ఉన్నాయి.
[44] ఆయన వారిని మళ్ళీ విడిచి వెళ్ళి, మూడో సారి ఆ మాటలే అంటూ ప్రార్థన చేశాడు.
[45] అప్పుడు శిష్యులదగ్గరికి వచ్చి వారితో ఇలా అన్నాడు: “మీరింకా నిద్రపోతూ విశ్రాంతి తీసుకొంటున్నారా? ఇదిగో వినండి. మానవ పుత్రుణ్ణి పాపుల చేతులకు పట్టి ఇచ్చే ఘడియ దగ్గరపడింది.
[46] లెండి, వెళ్దాం! ఇడుగో, నన్ను పట్టి ఇచ్చే వాడు దగ్గరలో ఉన్నాడు.”
[47] ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండుమంది శిష్యులలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజుల దగ్గరనుంచి, ప్రజల పెద్దల దగ్గరనుంచి వచ్చిన పెద్ద గుంపు అతడితో కూడా ఉన్నారు. వారు కత్తులూ కటార్లూ చేతపట్టుకొని ఉన్నారు.
[48] ఆయనను పట్టి ఇచ్చేవాడు ముందుగానే వారితో ఒక గుర్తు చెపుతూ “నేనెవరిని ముద్దు పెట్టుకొంటానో ఆయనే యేసు. ఆయనను పట్టుకోండి” అన్నాడు.
[49] అతడు వెంటనే యేసు దగ్గరకు వచ్చి “బోధకుడా! నీకు శుభం!” అంటూ ఆయనను ముద్దు పెట్టుకొన్నాడు.
[50] అయితే యేసు అతడితో “మిత్రుడా, నీవెందుకు వచ్చావు?” అన్నాడు. అప్పుడు వారు వచ్చి యేసును చేతులతో పట్టుకొన్నారు.
[51] వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు చేయి చాపి ఖడ్గాన్ని దూసి ప్రముఖ యాజి దాసుణ్ణి కొట్టి అతడి చెవి నరికివేశాడు.
[52] యేసు అతడితో “నీ ఖడ్గం వరలో పెట్టు. ఖడ్గం పట్టుకొనేవారంతా ఖడ్గంతో నాశనం అవుతారు.
[53] ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకొంటే, ఆయన వెంటనే పన్నెండు సేనావాహినుల కంటే ఎక్కువమంది దేవదూతలను నాకు అనుగ్రహించడనుకొంటున్నావా?
[54] గాని అలా చేస్తే ఈ విధంగా జరగాలనే లేఖనం నెరవేరడం ఎలాగు?” అన్నాడు.
[55] ఆ సమయంలో యేసు ఆ గుంపులతో “నేను దోపిడీ దొంగనయినట్టు మీరు కత్తులూ కటారులతో నన్ను పట్టుకోవడానికి వచ్చారేమిటి? ప్రతి రోజూ నేను మీ దగ్గర దేవాలయంలో కూర్చుని ఉపదేశం ఇచ్చేవాణ్ణే గదా. అప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు.
[56] గానీ ప్రవక్తల లేఖనాలు నెరవేరాలి గనుక ఇదంతా జరిగింది” అన్నాడు. అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచి పారిపోయారు.
[57] యేసును పట్టుకొన్నవాళ్ళు ఆయనను ప్రముఖయాజి అయిన కయప దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ పోగయి ఉన్నారు.
[58] పేతురు యేసును ఎడం ఎడంగా అనుసరిస్తూ ప్రముఖయాజి ఇంటి ముంగిటి వరకు వచ్చాడు. చివరికి ఏమి జరుగుతుందో చూద్దామని ఆవరణంలోకి వెళ్ళి, భటులతో కూర్చున్నాడు.
[59] ప్రధాన యాజులూ ప్రజల పెద్దలూ యూద సమాలోచన సభ అంతా యేసుకు మరణ శిక్ష విధించాలని ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యంకోసం చూస్తూ ఉన్నారు,
[60] అయినా సాక్ష్యం ఏమీ దొరకలేదు. అబద్ధ సాక్షులు అనేకులు ముందుకు వచ్చారు గానీ ఏమీ దొరకలేదు. చివరికి ఇద్దరు అబద్ధ సాక్షులు ముందుకు వచ్చి
[61] “ఇతడు దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేసి మూడు రోజులలో మళ్ళీ కట్టగలనన్నాడు” అన్నారు.
[62] ప్రముఖయాజి నిలబడి, “నీవు జవాబేమీ చెప్పవా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా చెపుతున్న సాక్ష్యమేమిటి?” అని ఆయనను అడిగాడు.
[63] యేసు ఊరుకొన్నాడు. అప్పుడు ప్రముఖయాజి ఆయనతో ఇలా అన్నాడు: “నీవు ప్రమాణ పూర్వకంగా మాకు చెప్పాలని జీవంగల దేవుని పేర నిన్ను ఆదేశిస్తున్నాం – నీవు అభిషిక్తుడివా? దేవుని కుమారుడివా?”
[64] అందుకు యేసు “నీవే అంటున్నావు గదా. వాస్తవంగా మీతో నేను చెపుతున్నాను, ఇకముందు మానవ పుత్రుడు అమిత శక్తివంతుని కుడివైపు కూర్చుని ఉండడమూ, ఆకాశ మేఘాలమీద రావడమూ మీరు చూస్తారు” అన్నాడు.
[65] అప్పుడు ప్రముఖయాజి తన వస్త్రాన్ని చింపుకొని “ఇతడు దేవదూషణ చేశాడు! మనకిక సాక్షులతో ఏం పని? చూడండి, ఇతడి దూషణ ఇప్పుడు విన్నారు గదా –
[66] మీరేమంటారు?” అన్నాడు. “ఇతడు చావుకు తగినవాడే!” అని వారు జవాబిచ్చారు.
[67] అప్పుడు వారు ఆయన ముఖంమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దారు. కొందరు ఆయనను అరచేతులతో చరిచి
[68] “అభిషిక్తుడా! నిన్ను కొట్టినది ఎవరు? ప్రవక్తగా పలుకు!” అన్నారు.
[69] ఇంతలో పేతురు బయట ముంగిటిలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరకు వచ్చి, “గలలీవాడైన యేసుతో నువ్వు కూడా ఉన్నావు గదా!” అంది.
[70] అయితే అతడు అందుకు ఒప్పుకోలేదు. “నువ్వు చెప్పేదేమిటో నాకు తెలియదు” అని అందరి ఎదుట అన్నాడు.
[71] అతడు నడవలోకి వెళ్ళాడు. మరో పిల్ల అతణ్ణి చూచి, అక్కడ ఉన్నవారితో “ఇతడు నజరేతువాడైన యేసుతో కూడా ఉండేవాడు” అంది.
[72] మళ్ళీ అతడు అందుకు ఒప్పుకోకుండా, ఒట్టు పెట్టుకొని “ఆ మనిషిని నేను ఎరగను” అన్నాడు.
[73] కాసేపటికి ప్రక్కన నిలుచున్నవారు దగ్గరగా వచ్చి పేతురుతో అన్నారు, “నిజమే, నువ్వు కూడా వాళ్ళలో ఒకడివే! నీ మాట తీరు నీ సంగతి బయట పెడుతుంది.”
[74] అందుకు అతడు ఒట్లూ శాపనార్థాలూ పెట్టుకొంటూ “నేనా మనిషిని ఎరగను” అన్నాడు. తక్షణమే కోడి కూసింది.
[75] “కోడి కూసేముందే నన్ను ఎరగనని మూడు సార్లు అంటావు” అని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం చేసుకొన్నాడు. అప్పుడు బయటికి వెళ్ళి, ఎంతో దుఃఖంతో భోరున ఏడ్చాడు.