Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:30

[1] యేసు తన పన్నెండుమంది శిష్యులకు ఆదేశాలు ఇవ్వడం ముగించిన తరువాత, వారి ఊళ్ళలో ఉపదేశించడానికి, ప్రకటించడానికి అక్కడనుంచి వెళ్ళాడు.

[2] క్రీస్తు చేస్తున్న క్రియలను గురించి ఖైదులో ఉన్న యోహాను విన్నాడు. అప్పుడు అతడు తన శిష్యులను ఇద్దరిని పంపి వారిచేత ఆయనను ఈ ప్రశ్న అడిగించాడు:

[3] “రావలసినవాడవు నీవేనా, లేక మేము వేరొకరి కోసం ఎదురు చూడాలా?”

[4] యేసు వారికిలా సమాధానం చెప్పాడు: “వెళ్ళి, మీరు చూచిందీ విన్నదీ యోహానుకు తెలియజేయండి.

[5] గుడ్డివారికి చూపు వస్తూ ఉంది, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధమౌతూ ఉన్నారు, చెవిటివారు వింటూ ఉన్నారు. చనిపోయినవారిని సజీవంగా లేపడం జరుగుతూ ఉంది. బీదలకు శుభవార్త ప్రకటన జరుగుతూ ఉంది.

[6] నా విషయంలో అభ్యంతరం లేనివాడు ధన్యజీవి.”

[7] వారు వెళ్ళిపోతూ ఉంటే, యేసు యోహాను విషయం జన సమూహాలతో ఇలా చెప్పసాగాడు: “ఏమి చూద్దామని మీరు అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి ఊగే రెల్లునా?

[8] మరి ఏమి చూద్దామని వెళ్ళారు? సన్నని వస్త్రాలు తొడుక్కొన్న మనిషినా? ఇదిగో సన్నని వస్త్రాలు తొడుక్కొన్నవారు రాజభవనాలలో ఉంటారు గదా!

[9] ఇంతకూ మీరేమి చూడడానికి వెళ్ళినట్టు? ప్రవక్తనా? అవును, అతడు ప్రవక్తే! ప్రవక్తకంటే కూడా గొప్పవాడని మీతో చెపుతున్నాను.

[10] ఇతణ్ణి గురించే ఈ మాటలు వ్రాసి ఉన్నాయి: ‘ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ముందర నీ దారి సిద్ధం చేస్తాడు’.

[11] “నేను ఖచ్చితంగా చెపుతున్నాను, స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు ఇంతవరకు బయలుదేరలేదు. అయినా, పరలోక రాజ్యంలో అందరిలో అల్పుడు అతనికంటే గొప్పవాడే.

[12] “బాప్తిసమిచ్చే యోహాను రోజులు మొదలుకొని ఇప్పటివరకు పరలోక రాజ్యం తీవ్రతకు గురి అవుతూ ఉంది, తీవ్రత గలవారు దానిని ఆక్రమిస్తూ ఉన్నారు.

[13] “యోహాను వచ్చేవరకు ధర్మశాస్త్రమూ ప్రవక్తలందరూ దేవుని మూలంగా పలుకుతూ ఉండడమూ జరిగింది.

[14] అంగీకరించాలనే ఇష్టం మీకు ఉంటే, రావలసిన ఏలీయా ఈ యోహానే.

[15] వినడానికి చెవులున్నవారు వింటారు గాక!

[16] “నేను ఈ తరంవారిని దేనితో పోల్చాలి? చిన్న పిల్లలు సంతవీధిలో కూర్చుని కేకలు వేసి వారి సహచరులతో ఇలా చెప్పుకొంటారు:

[17] ‘మీకు పిల్లనగ్రోవి ఊదాం గాని మీరు నాట్యం చేయలేదు. ఏడ్పు పాట పాడాం గాని మీరు ఏడ్వలేదు’. ఈ తరంవారు అంతే.

[18] ఎందుకంటే, యోహాను వచ్చి తినకుండా త్రాగకుండా ఉండేవాడు. అతనికి దయ్యం పట్టిందని వారు అంటున్నారు.

[19] మానవ పుత్రుడు వచ్చి అన్నపానాలూ పుచ్చుకొంటూ ఉంటే వారు ‘ఇడుగో, తిండిబోతూ, త్రాగుబోతూ, సుంకం వాళ్ళకూ పాపాత్ములకూ మిత్రుడూ!’ అంటున్నారు. అయితే జ్ఞానం దాని పిల్లలను బట్టే జ్ఞానమని లెక్కలోకి వస్తుంది.”

[20] అప్పుడాయన ఏ పట్టణాలలో ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలను ఖండించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అవి పశ్చాత్తాపపడలేదు.

[21] “అయ్యో కొరజీనూ! నీకు శిక్ష తప్పదు! అయ్యో బేత్‌సయిదా! నీకు శిక్ష తప్పదు! మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోనులో గనుక జరిగి ఉంటే, అక్కడి ప్రజలు చాలా కాలం క్రిందట పశ్చాత్తాపపడి గోనెపట్టలు చుట్టుకొని నెత్తిన బూడిద పోసుకొనేవారే!

[22] అయితే మీతో నేనంటాను, తీర్పు రోజున మీకు పట్టే గతికంటే తూరు సీదోనుల గతే ఓర్చుకోతగినది అవుతుంది!

[23] కపెర్‌నహూం! ఆకాశానికి హెచ్చిపోయినదానివి, నీవు పాతాళంలోకి దిగిపోతావు! నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో గనుక జరిగి ఉంటే అది ఈనాటి వరకు నిలిచి ఉండేదే!

[24] అయితే నీతో నేనంటాను, తీర్పు రోజున నీకు పట్టే గతికంటే సొదొమ ప్రదేశానికి పట్టే గతే ఓర్చుకోతగినది అవుతుంది!”

[25] ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు: “తండ్రీ! భూమ్యాకాశాల ప్రభూ! నీవు ఈ సంగతులు జ్ఞానులకూ తెలివైనవారికీ చూపకుండా దాచిపెట్టి, చిన్నపిల్లలకు వెల్లడి చేశావు.

[26] అవును, తండ్రీ, అలా చేయడం నీ దృష్టిలో మంచిదై ఉంది. అందుచేత నిన్ను స్తుతిస్తున్నాను.

[27] “నా తండ్రి సమస్తమూ నాకు అప్పచెప్పాడు. తండ్రి తప్ప మరెవరూ కుమారుణ్ణి తెలుసుకోవడం లేదు. కుమారుడూ, తన ఇష్టప్రకారం తండ్రిని ఎవరికి వెల్లడి చేస్తాడో వారూ తప్ప మరెవరూ తండ్రిని తెలుసుకోవడం లేదు.

[28] “భారం మోస్తూ అలసిపోయిన వారలారా! మీరంతా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతి ఇస్తాను.

[29] నా కాడి మీమీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. నేను సాధుశీలుణ్ణి, అహంభావం లేనివాణ్ణి, గనుక మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది.

[30] ఎందుకంటే, నా కాడి మృదువైనది, నా భారం తేలికైనది.”

మత్తయి శుభవార్త — Chapters