[1] “మీకు తీర్పు జరగకుండేలా ఇతరులకు తీర్పు తీర్చకండి.
[2] మీరు ఇతరులకు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు జరుగుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకూ ఆ కొలతతోనే కొలవడం జరుగుతుంది.
[3] నీ కంటిలో దూలం గమనించుకోకుండా నీ సోదరుని కంటిలో నలుసు తేరిచూడడం ఎందుకు?
[4] నీ కంటిలో దూలం ఉన్నప్పుడు నీ సోదరునితో ‘మీ కంటినలుసు తీసివెయ్యనియ్యండి’ అంటావేం?
[5] కపట భక్తుడా, ముందుగా నీ కంటిలోనుంచి దూలం తీసివేసుకో, అప్పుడు నీ సోదరుని కంటి నలుసు తీసివేయడానికి తేటగా చూడగలుగుతావు.
[6] “పవిత్రమైనదాన్ని కుక్కలకు పెట్టకండి. మీ ముత్యాలు పందుల ముందు వేయకండి. అలా చేస్తే అవి వాటిని కాళ్ళక్రింద త్రొక్కి మీమీద పడి మిమ్ములను చీల్చివేస్తాయేమో.
[7] “అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి, అది తెరవబడుతుంది.
[8] అడిగే ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. వెదికే వ్యక్తికి దొరుకుతుంది. తట్టే వ్యక్తికి తలుపు తెరవబడుతుంది.
[9] మీలో ఎవరైనా సరే కొడుకు రొట్టె కావాలని అడిగితే రాయిని ఇస్తారా?
[10] చేపకోసం అడిగితే అతనికి పామునిస్తారా?
[11] మీరు చెడ్డవారు అయినా మీ పిల్లలకు మంచివాటిని ఇవ్వాలన్న సంగతి తెలుసునే. అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగేవారికి మరి నిశ్చయంగా మంచివి ఇస్తాడు గదా.
[12] “కాబట్టి అన్ని విషయాలలో మనుషులు మీకు ఏమి చెయ్యాలని ఆశిస్తారో అదే వారికి చేయండి. ధర్మశాస్త్రమూ, ప్రవక్తల ఉపదేశ సారమూ ఇదే.
[13] “ఇరుకు ద్వారంలో ప్రవేశించండి. నాశనానికి దారితీసే ద్వారం వెడల్పు, దారి విశాలం. ఆ ద్వారంలో చాలామంది ప్రవేశిస్తారు.
[14] ఎందుకంటే జీవానికి దారితీసే ద్వారం ఇరుకైనది, దారి కష్టమైనది. దాన్ని కనుగొనేవారు కొద్దిమందే.
[15] “కపట ప్రవక్తల విషయం జాగ్రత్త! వారు గొర్రె తోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు గానీ లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు.
[16] వారి ఫలాలనుబట్టి మీరు వారిని గుర్తిస్తారు. ముళ్ళ పొదలలో ద్రాక్షపండ్లు, పల్లేరుచెట్లలో అంజూరు పండ్లు మనుషులు కోస్తారా?
[17] ఈ విధంగా ప్రతి మంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి గదా. పనికిమాలిన చెట్టుకు పనికిమాలిన పండ్లు కాస్తాయి.
[18] మంచి చెట్టుకు పనికిమాలిన రకం పండ్లు కాయడం అసాధ్యం. పనికిమాలిన చెట్టుకు మంచి రకం పండ్లు కాయడం అసాధ్యం.
[19] మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి అగ్నిలో పారవేయడం జరుగుతుంది.
[20] ఈ విధంగా మీరు వారి ఫలాలను బట్టి వారిని గుర్తిస్తారు.
[21] “నన్ను ‘ప్రభూ, ప్రభూ!’ అనే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్టప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు.
[22] ఆ రోజున చాలామంది నాతో ఇలా అంటారు: ‘ప్రభూ, ప్రభూ! మేము నీ పేర ప్రవక్తలుగా ప్రకటించలేదా? నీ పేర దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ పేర అనేక అద్భుతాలు చేయలేదా?
[23] అప్పుడు నేను వాళ్ళతో ఇలా అంటాను: ‘అక్రమకారులారా, మీరు ఎన్నడూ నేనెరిగినవారు కారు! నా దగ్గరనుంచి పొండి!’
[24] “అందుచేత, ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేసే వారినెవరినైనా బండమీద తన ఇల్లు కట్టుకొన్న తెలివిగల మనిషితో పోలుస్తాను.
[25] వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటిమీద కొట్టాయి. అయినా ఆ ఇల్లు కూలిపోలేదు. ఎందుకంటే అది బండ పునాదిమీది ఇల్లు.
[26] కానీ ఈ నా మాటలు విని వాటిప్రకారం చేయని ప్రతి ఒక్కరూ ఇసుకమీద ఇల్లు కట్టుకొనే తెలివిలేని మనిషిలాగా ఉంటారు.
[27] వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటిమీద కొట్టాయి. ఆ ఇల్లు కూలిపోయింది. దాని పతనం గొప్పది!”
[28] యేసు ఆ మాటలు చెప్పి ముగించిన తరువాత ప్రజలు ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు.
[29] ఎందుకంటే వారి ధర్మశాస్త్ర పండితుల్లాగా కాక అధికారం గలవాడిలాగా ఆయన వారికి ఉపదేశించాడు.