[1] హేరోదురాజు కాలంలో యూదయలో ఉన్న బేత్‌లెహేంలో యేసు జన్మించాడు. ఆ తరువాత జ్ఞానులు కొందరు తూర్పు దిక్కునుంచి జెరుసలంకు వచ్చి ఇలా అన్నారు:
[2] “యూదులకు రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున ఆయన నక్షత్రాన్ని మేము చూశాం, ఆయనను ఆరాధించడానికి వచ్చాం.”
[3] ఇది విని హేరోదురాజు అతడితోపాటు జెరుసలం వాళ్ళంతా కంగారుపడ్డారు.
[4] అతడు ప్రజల ప్రధాన యాజులనూ ధర్మశాస్త్ర పండితులనూ అందరినీ సమకూర్చి “అభిషిక్తుడు ఎక్కడ పుట్టవలసి ఉంది?” అని వారిని అడిగాడు.
[5] వారు అతనికి ఇలా జవాబిచ్చారు: “యూదయలో ఉన్న బేత్‌లెహేంలో. ప్రవక్త రాసినదేమిటంటే,
[6] యూదాదేశంలోని బేత్‌లెహేం! యూదా పరిపాలకులలో నీవు దేనికీ తీసిపోవు. ఎందుకంటే నీలోనుంచే నా ప్రజలైన ఇస్రాయేల్‌కు కాపరిగా ఉండే పరిపాలకుడు వస్తాడు.”
[7] అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన కాలం వారిమూలంగా తెలుసుకొన్నాడు.
[8] తరువాత వారిని బేత్‌లెహేంకు పంపిస్తూ “ఆ పిల్లవాడికోసం బాగా వెదకండి. నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధించేలా మీరు ఆయనను కనుగొన్నాక నాకు వచ్చి చెప్పండి” అన్నాడు.
[9] రాజు చెప్పినది విని వారు బయలుదేరారు. తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారికి ముందుగా పోతూ ఆ శిశువు ఉన్న స్థలానికి పైగా నిలిచింది.
[10] ఆ నక్షత్రం చూచి వారు అత్యధికంగా సంతోషించారు.
[11] ఇంట్లోకి వెళ్ళి శిశువునూ ఆయన తల్లి మరియనూ చూశారు, సాష్టాంగపడి ఆయనను ఆరాధించారు. తరువాత నిధుల పెట్టెలు విప్పి ఆయనకు బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా అర్పించారు.
[12] హేరోదు దగ్గరకు తిరిగి వెళ్ళవద్దని కలలో హెచ్చరిక విని వారు వేరే దారిన పడి స్వదేశానికి వెళ్ళిపోయారు.
[13] వారు వెళ్ళిన తరువాత ప్రభు దేవదూత ఒకడు యోసేపుకు కలలో కనబడి ఇలా అన్నాడు: “హేరోదు ఈ శిశువును చంపడానికి అంతటా గాలిస్తాడు. లేచి శిశువునూ ఆయన తల్లినీ తీసుకొని ఈజిప్ట్‌కు పారిపో. నేను మళ్ళీ నీకు చెప్పేంతవరకు అక్కడే ఉండు.”
[14] కనుక యోసేపు లేచి రాత్రికి రాత్రే శిశువునూ ఆయన తల్లినీ తీసుకొని ఈజిప్ట్‌కు తరలివెళ్ళాడు.
[15] హేరోదు చనిపోయేవరకు అక్కడే ఉండిపోయాడు. “ఈజిప్ట్‌నుంచి నా కుమారుణ్ణి పిలిచాను” అని మునుపు ప్రభువు ఒక ప్రవక్త ద్వారా పలికించాడు. ఈ మాట నెరవేరేందుకే ఇది జరిగింది.
[16] ఆ జ్ఞానులు తనను నవ్వులపాలు చేశారని గ్రహించి హేరోదు అత్యంత ఆగ్రహంతో మండిపడ్డాడు. అతడు మనుషులను పంపి, జ్ఞానులవల్ల తెలుసుకొన్న కాలం ప్రకారం బేత్‌లెహేంలోనూ దాని పరిసరాలన్నిటిలోనూ రెండేళ్ళు అంతకు తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు.
[17] యిర్మీయాప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట ఆ విధంగా నెరవేరింది –
[18] “రమాలో ఒక స్వరం, విలాపం, ఏడుపు, మహా రోదనం వినబడుతున్నాయి. రాహేలు తన పిల్లలకోసం ఏడుస్తూ ఉంది. వారిని కోల్పోయి ఓదార్పును నిరాకరిస్తూ ఉంది.”
[19] హేరోదు మృతి చెందాక ప్రభు దేవదూత ఒకడు ఈజిప్ట్‌లో కాపురమున్న యోసేపుకు కలలో కనిపించి అన్నాడు,
[20] “ఈ పిల్లవాడి ప్రాణం తీయాలని చూచేవాళ్ళు మరణించారు, గనుక లేచి పిల్లవాణ్ణీ ఆయన తల్లినీ తీసుకొని ఇస్రాయేల్ దేశానికి వెళ్ళు.”
[21] అలాగే అతడు లేచి శిశువునూ ఆయన తల్లినీ ఇస్రాయేల్ దేశానికి తీసుకువెళ్ళాడు.
[22] అయితే అర్కిలావస్ అతడి తండ్రి హేరోదు స్థానంలో యూదయను పరిపాలిస్తున్నాడని యోసేపు విని అక్కడికి వెళ్ళడానికి జంకాడు. కలద్వారా దేవుని హెచ్చరిక పొంది గలలీ ప్రదేశానికి వెళ్ళిపోయాడు.
[23] నజరేతు అనే గ్రామం చేరి అక్కడ నివాసమున్నాడు. యేసును నజరేయుడంటారు అని ప్రవక్తల మూలంగా వచ్చిన మాట నెరవేరేందుకు ఈ విధంగా జరిగింది.