Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:05

[1] ఆ రోజుల్లో బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి యూదయ అరణ్యంలో ఇలా చాటిస్తూ ఉన్నాడు:

[2] “పరలోక రాజ్యం దగ్గరగా ఉంది, గనుక పశ్చాత్తాపపడండి.”

[3] అతణ్ణి గురించే యెషయా ప్రవక్త మునుపు ఇలా చెప్పాడు: “ఎడారిలో ఒకతని స్వరం ఇలా ఘోషిస్తూ ఉంది: ప్రభువుకోసం దారి సిద్ధం చేయండి! ఆయనకోసం త్రోవలు తిన్ననివి చేయండి!”

[4] ఈ యోహాను ఒంటె రోమాల బట్టలు తొడుక్కొని నడుముకు తోలు దట్టి కట్టుకొనేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె.

[5] ప్రజలు జెరుసలంనుంచీ యూదయ అంతటినుంచీ యొర్దాను ప్రాంతమంతటినుంచీ యోహాను దగ్గరికి వచ్చారు.

[6] తమ పాపాలు ఒప్పుకొంటూ అతనిచేత యొర్దాను నదిలో బాప్తిసం పొందుతూ ఉన్నారు.

[7] అతడు బాప్తిసం ఇస్తున్న స్థలానికి చాలామంది పరిసయ్యులూ, సద్దూకయ్యులూ రావడం చూచినప్పుడు యోహాను వాళ్ళతో ఇలా అన్నాడు: “ఓ సర్ప వంశమా! రాబోయే ఆగ్రహం తప్పించుకుపోండని మిమ్మల్ని హెచ్చరించినదెవరు?

[8] పశ్చాత్తాపానికి తగిన ఫలాలు వచ్చేలా చేసుకోండి.

[9] ‘అబ్రాహాము మా తండ్రి’ అని భావించుకోకండి. మీతో చెపుతున్నాను గదా, దేవుడు ఈ రాళ్ళను అబ్రాహాము సంతానమయ్యేలా చేయగలడు.

[10] ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు పెట్టి ఉంది. మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి అగ్నిలో పారవేయడం జరుగుతుంది.

[11] పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నీళ్ళలో మీకు బాప్తిసమిస్తూ ఉన్నాను. కానీ నాకంటే బలప్రభావాలు ఉన్నవాడు నా తరువాత వస్తున్నాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను. ఆయన దేవుని పవిత్రాత్మలోనూ అగ్నిలోనూ మీకు బాప్తిసమిస్తాడు.

[12] తన తూర్పారపట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం పూర్తిగా శుభ్రం చేస్తాడు. తన గోధుమలు గిడ్డంగిలో పోస్తాడు. పొట్టును ఆరిపోని అగ్నిలో కాల్చివేస్తాడు.”

[13] ఆ సమయంలో యోహానుచేత బాప్తిసం పొందడానికి యేసు గలలీ ప్రదేశంనుంచి అతని దగ్గరికి యొర్దానుకు వచ్చాడు.

[14] యోహాను ఆయనను అడ్డుపెట్టడానికి ప్రయత్నించాడు. “మీ చేత నేను బాప్తిసం పొందవలసినవాణ్ణి. మీరు నా దగ్గరికి వస్తున్నారా?” అన్నాడు.

[15] “ఇప్పుడు ఈ విధంగా జరిగిపోనియ్యి. ధర్మం యావత్తూ ఇలా మనం నెరవేర్చడం యుక్తమే” అని యేసు అతనికి జవాబిచ్చాడు. అప్పుడు యోహాను ఆయనకు అలా జరగనిచ్చాడు.

[16] యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలోనుంచి బయటికి వచ్చాడు. అప్పుడే ఆయనకు ఆకాశం తెరచుకొంది, దేవుని ఆత్మ ఒక పావురంలాగా దిగివచ్చి తనమీద వాలడం ఆయన చూశాడు.

[17] అప్పుడే ఆకాశంనుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనంటే నాకెంతో ఆనందం.”

మత్తయి శుభవార్త — Chapters